నారా లోకేష్ ప్రతిష్టాత్మక సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లారు. వెళ్లిన తొలి రోజే రష్యా బ్యాంకింగ్ దిగ్గజం స్బేర్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్బేర్ బ్యాంక్ సొంతంగా అభివృద్ధి చేసిన అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ గిగాచాట్ ఎల్ఎల్ఎం సాంకేతికతను భారతదేశంలో విస్తరించే అవకాశాలపై ఇరువర్గాలు సుదీర్ఘంగా చర్చించాయి. ముఖ్యంగా దేశీయ బ్యాంకింగ్ రంగం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , రిటైల్ రంగాలలో ఈ ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవచ్చనే అంశంపై ఈ భేటీలో ఒక రోడ్‌మ్యాప్‌పై చర్చించారు.
ప్రపంచ స్థాయి ఏఐ భాగస్వామ్యాలను అమరావతికి తీసుకురావడం ద్వారా భవిష్యత్ సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రధాన లక్ష్యమని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏపీలో రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు, పరిశోధనలకు అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థను కల్పిస్తామని రష్యా ప్రతినిధులకు వివరించారు. స్బేర్ బ్యాంక్ వంటి గ్లోబల్ లీడర్స్ ఏపీతో చేతులు కలిపితే రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీ ఐటీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
భారతదేశానికి చెందిన ఒక యువ మంత్రి రష్యాకు వచ్చి తమ దేశీయ ఏఐ సాంకేతికత అయిన గిగాచాట్పై ఆసక్తి చూపడంపై రష్యన్ మీడియా ఆసక్తికర కథనాలను ప్రసారం చేసింది. రష్యా సాంకేతిక నైపుణ్యాన్ని గ్లోబల్ మార్కెట్‌కు, ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న భారతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానించడంలో ఏపీ మంత్రి లోకేష్ చొరవను అక్కడి పత్రికలు అభినందించాయి. గిగాచాట్ ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకతను, వేగాన్ని పెంచడానికి ఏపీ ప్రభుత్వం యోచిస్తోందనే అంశాన్ని రష్యా మీడియా ప్రముఖంగా ప్రస్తావించింది.


