ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు భారీ స్కెచ్ లో ప్రకాష్ రాజ్ కీలక కుట్రదారుగా ఆరోపణలు వస్తున్నాయి. తనకు ఇష్టం లేని నేతలు, పబ్లిసిటీ వస్తుందనుకునే వారి విషయాల్లో ప్రతి చిన్న అంశంపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ, వివాదాల్లో వేలు పెట్టడం అలవాటుగా మార్చుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల వివాదంలో సంచలనాత్మకంగా తెరపైకి వచ్చింది. గతంలో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అత్యాచారాలు, దారుణ హత్యలకు గురయ్యారని, ఆ మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టేలా నాటి యాజమాన్యం తనను వేధించిందంటూ చిన్నయ్య అనే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే, ఈ ఆరోపణల వెనుక పక్కా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ఒక భారీ అంతర్జాతీయ కుట్ర దాగి ఉందనే నిజం ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడుతోంది.
చిన్నయ్య యూ-టర్న్.. హైకోర్టు పిటిషన్లో ప్రకాష్ రాజ్ ప్రస్తావన!
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిన్నయ్య గురువారం నాడు కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన తాజా రిట్ పిటిషన్ కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో పెను భూకంపం సృష్టించింది. ఇన్నాళ్లూ క్షేత్రానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేసిన చిన్నయ్య.. ఇప్పుడు పూర్తిగా ప్లేటు ఫిరాయించి, కొందరు వ్యక్తులు, సంస్థలు పన్నిన రూ. 200 కోట్ల భారీ కుట్రలో తాను కేవలం ఒక పావుగా మాత్రమేనని కోర్టు ముందు అంగీకరించాడు. ఈ దుష్ప్రచారానికి వెనకుండి నడిపించిన కీలక సూత్రధారులలో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారంటూ చిన్నయ్య సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడారని.. “నువ్వేమీ భయపడకు, జూలై 29న నేనే స్వయంగా వచ్చి నిన్ను గట్టిగా కౌగిలించుకుంటాను” అంటూ భరోసా ఇచ్చారని పిటిషన్లో పేర్కొనడం గమనార్హం.
స్పందించిన ప్రకాష్ రాజ్.. పుకార్లను నమ్మవద్దంటూ ట్వీట్!
ఈ ఆరోపణలతో సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ నెటిజన్లు, భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ధర్మస్థల కేసు గురించి నన్ను ముడిపెడుతూ వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకాలతో కూడిన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి, స్పందించడం నా బాధ్యత. నేను ప్రస్తుతం ఊరిలో లేను. మరో రెండు రోజుల్లో నేనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి నిజాలు చెప్తాను. అంతవరకు కొందరు ఈ వార్తలకు జోడిస్తున్న అబద్ధపు రెక్కలను, పుకార్లను ఎవరూ నమ్మవద్దు” అంటూ ట్వీట్ చేశారు.
పోలీస్ విచారణకు రంగం సిద్ధం.. జూలై 29న తదుపరి విచారణ!
చిన్నయ్య పిటిషన్‌పై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సూరజ్ గోవిందరాజ్.. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేక దర్యాప్తు బృందానికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను జూలై 29కి వాయిదా వేశారు. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే సైతం స్పందిస్తూ.. చిన్నయ్య గతంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నందున నిజానిజాలను లోతుగా పరిశీలించాల్సి ఉందన్నారు. కోర్టు పర్యవేక్షణలోనే సిట్ దర్యాప్తు సాగుతున్నందున, చిన్నయ్య పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రకాష్ రాజ్‌ను కూడా పోలీసులు విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కుట్రలో భాగస్వామ్యం ఉన్నట్లు తేలితే ప్రకాష్ రాజ్ ఈ లీగల్ వివాదంలో గట్టిగా ఇరుక్కోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.


