జులై 3న ‘నాగబంధం’ సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రంతోనే అభిషేక్ నామా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ‘పెద కాపు’ ఫేమ్ విరాట్ కర్ణ కథానాయకుడు. `పెద కాపు` పెద్ద ఫ్లాప్. అయినా సరే.. ‘నాగబంధం’ పై భారీగా ఖర్చు పెట్టారు. ఓ ఫ్లాప్ హీరోపై, కొత్త దర్శకుడిపై నిర్మాతలు ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారో అంటూ టాలీవుడ్ అంతా ఆసక్తిగా చర్చించుకొంటోంది. ప్రమోషన్లను కూడా చిత్రబృందం భారీగానే ప్లాన్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా నార్త్ లోనూ గట్టిగా ప్రమోట్ చేయాలనుకొంటున్నారు.
ఈ సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాలు. మీడియం రేంజ్ సినిమాకు ఈ స్థాయి నిడివి అంటే.. ఎక్కువే అని చెప్పాలి. కానీ చిత్రబృందం మాత్రం కంటెంట్‌పై నమ్మకంగా ఉంది. అందుకే నిడివి గురించి పట్టించుకోవడం లేదు. దానికి తోడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నార్ట. క్లైమాక్స్ లోనే సీక్వెల్ కి లీడ్ ఉంటుందని తెలుస్తోంది. ఈ కాన్సెప్టుతో ఎన్ని సినిమాలైనా తీయొచ్చన్నది నిర్మాతల మాట. నిఖిల్ ‘ కార్తికేయ’ పార్ట్ 1, 2లు వచ్చాయి. పార్ట్ 3 కూడా వస్తోంది. అలానే… ‘నాగబంధం’ కూడా ఇలా తీస్తూనే ఉండొచ్చు. అంత స్టఫ్.. ఈ కథలో ఉందని దర్శకుడు చెబుతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందనే వచ్చింది. పాటలూ, అందులోని విజువల్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చిత్రబృందం ఎక్కువగా చెబుతోంది. చివరి 30 నిమిషాలూ వేరే స్థాయిలో ఉంటుందని, ఆ ఎపిసోడ్స్ లో కనిపించే విజువల్స్ హాలీవుడ్ సినిమాలకు మించిపోతాయన్నది నిర్మాతల మాట. అదే నిజమైతే వెండి తెరపై మరో విజువల్ వండర్ చూడబోతున్నట్టే.


