టాలీవుడ్ లో అతి ముఖ్యమైన సీజన్ ఏమిటంటే.. సంక్రాంతి అనే చెబుతారంతా. నిజానికి వేసవి, దసరా సీజన్లు కూడా చాలా కీలకం. పెద్ద సినిమాలు ఈ సీజన్లను లక్ష్యంగా చేసుకొని బరిలో దిగుతుంటాయి. కానీ కొన్నాళ్లుగా టాలీవుడ్ సంక్రాంతి మాయలో పడిపోయింది. సంక్రాంతి కి పెద్ద సినిమాలు విడుదల చేయడం, మిగిలిన సీజన్లను పట్టించుకోకపోవడం కామన్ అయిపోయింది. ఈ వేసవి అలానే వేస్ట్ చేసేశారు. అయితే ఈ దసరా మాత్రం సంక్రాంతికి మించి ఉండబోతోంది. హీరోలు, నిర్మాతలు అలా ప్లాన్ చేసుకొన్నారు. వేసవిని నిర్లక్ష్యం చేసినందుకు ఈ దసరాకి వడ్డీతో పాటు ఇవ్వడానికి టాలీవుడ్ సిద్ధం అవుతున్నట్టు అనిపిస్తోంది.
మెగాస్టార్ ‘విశ్వంభర’ కోసం మెగాఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడో సిద్ధమైంది. పలుమార్లు విడుదల తేదీ కూడా ప్రకటించారు. కానీ వీఎఫ్ఎక్స్ జాప్యంతో సినిమా కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. త్రిష కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది. కీరవాణి స్వరాలు అందించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. చిరుతో నిర్మాతలు త్వరలో సమావేశం కానున్నారు. ఆ తరవాత రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నాగార్జున సెంచరీ మార్క్ చేరుకోబోతున్నారు. కార్తీక్ దర్శకత్వంలో ‘లాటరీ కింగ్’ (వర్కింగ్ టైటిల్) సిద్ధం అవుతోంది. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దసరా బరిలో నిలపాలన్నదే లక్ష్యం. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తూ, ఓ గ్లింప్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ సమయంలోనే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది. నాగ్ వందో సినిమా కావడంతో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమాలో స్పెషల్ ఎప్పీరియన్సులు కూడా కనిపించబోతున్నాయని టాక్.
నందమూరి బాలకృష్ణ కూడా దసరాపై గురి పెట్టినట్టు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అప్పటికి సినిమా పూర్తవుతుందా, లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉంది. కానీ ప్రస్తుతానికి దసరాని టార్గెట్ చేసుకొన్నారు. రెండు మూడు షెడ్యూల్స్ గడిచాక.. దసరాకి రాగలమా, లేదా? అనే విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘ఆదర్శ కుటుంబం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలో రిలీజ్ చేయడమే లక్ష్యంగా సినిమా మొదలెట్టారు. కానీ కుదర్లేదు. అయితే దసరా బరిలో కచ్చితంగా ఈ సినిమాని తీసుకురావాలన్నది ప్లాన్. ఆ మేరకు షూటింగ్ కూడా వేగవంతం చేశారు. జులై నాటికి చిత్రీకరణ పూర్తయ్యే ఛాన్స్ వుంది. అప్పటికి సినిమా సిద్ధమైపోతే.. దసరాకు రిలీజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. చిరు, వెంకీ, నాగ్, బాలయ్య… ఇలా నలుగురు అగ్ర హీరోలూ దసరాకి వస్తే అంతకంటే కావాల్సిందేముంది? సంక్రాంతికి మించిన వైబ్ కనిపిస్తుంది. బాక్సాఫీసు మళ్లీ కళకళలాడుతుంది. కాకపోతే… వీళ్ల ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాలి. అన్నట్టు వీళ్లతో పాటు నాని సినిమా ‘పారడైజ్’ కూడా ఈ సీజన్ లోనే రావడానికి రెడీ అవుతోంది. మార్చిలో విడుదల కావాల్సిన సినిమా ఇది. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో వాయిదా పడింది. ఈసారి దసరా బరిలో నిలపాలన్నది లక్ష్యం. దానికి తగ్గట్టు చక చక పనులు పూర్తి చేస్తున్నారు. ఒకవేళ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఈ నలుగురూ దసరా బరిలో దిగితే మాత్రం నాని ఇంకాస్త టైమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు డ్రాప్ అయినా… నాని సినిమా కూడా పోటీ పడడం ఖాయం.
