సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చుట్టూ ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయం ముదురుతోంది. సింగరేణి పరిధిలోని ఏడు ప్రధాన గనుల్లో దాదాపు 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భౌతికంగా ఆ బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జూన్ 13న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అధికారికంగా ఒక లేఖ రాయడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది. అసలు ఇన్ని లక్షల టన్నుల బొగ్గును రాత్రికి రాత్రే దొంగతనం చేయడం సాధ్యమేనా? అసలు బొగ్గు ఎలా తరలిపోతుంది?
రికార్డుల్లేకుండా బొగ్గు తరలించగలరా?
ఆరోపణల ప్రకారం 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది అనుకుంటే.. లాజిస్టిక్స్ పరంగా ఇది ఎంత అసాధ్యమైన విషయమో అర్థమవుతుంది. సాధారణంగా ఒక పెద్ద లారీ 20 నుండి 25 టన్నుల బొగ్గును మోయగలదు. అంటే 40 లక్షల టన్నుల బొగ్గును రోడ్డు మార్గంలో తరలించాలంటే దాదాపు 2 లక్షల లారీలు కావాలి. ఒకవేళ రైల్వే వ్యాగన్ల ( ద్వారా తరలించాలంటే.. ఒక గూడ్స్ రైలు గరిష్టంగా 3,800 నుండి 4,000 టన్నుల బొగ్గును మాత్రమే తీసుకెళ్లగలదు. ఈ లెక్కన 40 లక్షల టన్నులు రవాణా కావాలంటే ఏకంగా 1000కి పైగా గూడ్స్ రైళ్లు కావాలి. రైల్వే నెట్వర్క్, ప్రతి టన్నుకూ ఉండే ఆన్లైన్ వే-బిల్స్ , జీఎస్టీ ఇన్వాయిస్లు, మైనింగ్ అనుమతుల కళ్లగప్పి ఇంత భారీ ఎత్తున రైళ్లు, లారీలను సింగరేణి వ్యాప్తంగా తిప్పడం అనేది మైనింగ్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని పని.
బొగ్గును కొనేది ఎవరు? ఎవరికి అవసరం ఉంటుంది?
బొగ్గు అనేది మార్కెట్లో దొరికే కిరాణా సామాగ్రి కాదు.. దాన్ని దొంగతనం చేసి బ్లాక్ మార్కెట్లో ఎవరికైనా అమ్మేయడానికి. సింగరేణి తవ్వే థర్మల్ గ్రేడ్ బొగ్గుకు ప్రధాన కొనుగోలుదారులు కేవలం జెన్కో విద్యుత్ ప్లాంట్లు, భారీ సిమెంట్ ఫ్యాక్టరీలు, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు మాత్రమే. వీటిలో ఏ ఒక్క పరిశ్రమ కూడా అధికారిక రికార్డులు, లాంఛనాలు, క్వాలిటీ చెకింగ్ లేకుండా నల్ల బజారు లో దొంగ బొగ్గును వేల టన్నుల పరిమాణంలో కొనుగోలు చేయలేదు. ఎందుకంటే వారు వాడే ప్రతి గ్రాము బొగ్గుకూ అకౌంటింగ్ చూపించాలి, ఆడిటింగ్ జరగాలి. కాబట్టి అంత సులువుగా బొగ్గును బయట ఎవరికీ అమ్మేసే ఆస్కారమే లేదు.
అసలు సమస్య ఎక్కడ వచ్చింది?
ఈ వివాదం వెనుక దొంగతనం కంటే సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైనింగ్ రంగంలో బొగ్గు తవ్వేటప్పుడు దాని పరిమాణాన్ని వాల్యూమ్ ఆధారంగా అంచనా వేస్తారు. కానీ తరలించేటప్పుడు బరువు ఆధారంగా లెక్కిస్తారు. బొగ్గును గనుల వద్ద నిల్వ ఉంచినప్పుడు వర్షాల వల్ల లేదా ఎండల తీవ్రత వల్ల దానిలోని తేమ శాతం మారి బరువులో తేడాలు వస్తాయి. గత ప్రభుత్వం నుంచి వస్తున్న కొన్ని పాత లెక్కలను, ఉత్పత్తి టార్గెట్లను కాగితాలపై ఎక్కువగా చూపించి.. ఇప్పుడు వాస్తవ నిల్వలను లెక్కేసేసరికి ఈ 40 లక్షల టన్నుల షార్టేజ్ బయటపడి ఉండవచ్చు. అందుకే కేటీఆర్ అన్నట్లు.. ఈ బొగ్గుకు ట్యాక్సులు, సెస్సులు కట్టేసినా భౌతికంగా స్టాక్ లేకపోవడం వెనుక లోపలి అధికారుల అవినీతి లేదా తప్పుడు లెక్కల వ్యూహం ఉండి ఉండాలి తప్ప భౌతిక రవాణా కాదని అంటున్నారు.
