తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం పలు చోట్ల సోదాలు చేసింది. ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అహిల్యానగర్, బికనీర్, డెహ్రాడూన్, ఢిల్లీ, దిండిగల్, గుంటూరు, ముంబై, రూర్కీ నగరాల్లో ఉన్న నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు సాగాయి. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందనే తీవ్ర ఆరోపణలపై పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు పలు కీలక ఆధారాలను సేకరించారు.
రూ. 60 లక్షల నగదు సీజ్.. భారీగా అక్రమ ఆస్తులు
ఈ తనిఖీల్లో భాగంగా పలువురు కీలక వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలను అధికారులు జల్లెడ పట్టారు. పొమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్లాల్ చావ్డా, అపూర్వ వినయ్‌కాంత్ చావ్డా, మచింద్ర శాంతారామ్ లాంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్ వంటి నిందితుల ప్రాంగణాలలో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా రూ. 60 లక్షల నగదును ఈడీ సీజ్ చేసింది. వీటితో పాటు కుంభకోణం ద్వారా ఆర్జించిన దాదాపు రూ. 45 కోట్లకు పైగా అక్రమ సొమ్మును వివిధ ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించారు. నిందితులు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న పలు స్థిరాస్తుల వివరాలు కూడా ఈ సోదాల్లో బయటపడ్డాయి.
డైరీ ప్లాంట్లపై నిఘా.. బోగస్ లావాదేవీల నెట్వర్క్
కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏ.ఆర్. డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ , మల్‌గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన ప్లాంట్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఇక్కడ దొరికిన పలు పత్రాలను పరిశీలించారు. అక్రమంగా సంపాదించిన నిధులను దాచడానికి, చట్టబద్ధమైనవిగా చూపించడానికి ఒక పెద్ద బోగస్ కొనుగోళ్లు, అమ్మకాల నెట్‌వర్క్‌ను నడిపినట్లు అధికారులు కనుగొన్నారు. ఇందుకు సంబంధించి అనేక నేరపూరిత పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
మనీ లాండరింగ్ కేసు నమోదు.
గతంలో ఏ.ఆర్. డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఇతరులపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ విచారణను ప్రారంభించింది. నిందితులు కొందరు టీటీడీ అధికారులతో కుమ్మక్కై, నమ్మకద్రోహానికి పాల్పడటమే కాకుండా.. కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ద్వారా దేవస్థానానికి భారీ నష్టాన్ని చేకూర్చారని ఈడీ పేర్కొంది. కల్తీ నెయ్యి ద్వారా ఆర్జించిన నల్లధనాన్ని వేర్వేరు వ్యాపార సంస్థలు, అనుబంధ కంపెనీల ద్వారా స్థిరాస్తుల్లోకి మళ్లించారని దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పీఎంఎల్ఏ , 2002 చట్టం కింద దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.