నెల క్రితం అంతర్జాతీయంగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ఇంధన భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ప్రారంభమైన సమయంలో భారత్ వద్ద సుమారు 66 రోజుల వినియోగానికి సరిపడ చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, గత నెల రోజులుగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతినడం, ప్రధాన సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల దిగుమతుల్లో కొంత జాప్యం చోటుచేసుకుంది. ఫలితంగా సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
85 శాతం దిగుమతులపైనే ఆధారం
భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. యుద్ధానికి ముందు రోజుకు సగటున 4.5 నుంచి 5 మిలియన్ బారెళ్ల ముడి చమురును మనం దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ, ప్రస్తుత సరఫరా ఆటంకాల వల్ల ఈ దిగుమతుల్లో 10 నుంచి 15 శాతం వరకు లోటు కనిపిస్తోంది. రష్యా నుంచి వచ్చే చమురు రవాణా మార్గాల్లో బీమా ,షిప్పింగ్ సమస్యలు తలెత్తడం, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరాలో జాప్యం జరగడం వల్ల రిఫైనరీలకు అందే ముడి చమురు పరిమాణం తగ్గింది. ఈ లోటును పూడ్చేందుకు ప్రభుత్వం గయానా , బ్రెజిల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, రవాణా ఖర్చులు పెరగడం సవాలుగా మారింది.
మరో నెల వరకూ సమస్య రాదు!
దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందని ఈ కారణంగానే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం ప్రస్తుతం ఎటువంటి తక్షణ కొరత లేదని, ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయవద్దని విజ్ఞప్తి చేస్తోంది. అయితే, రిటైల్ మార్కెట్లో డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడంలో కొన్ని చమురు కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. చమురు ధరలు బారెల్ కు 100 డాలర్ల మార్కును దాటి స్థిరంగా కొనసాగితే, భారత్ వంటి దిగుమతి దేశాలపై ద్రవ్యోల్బణ భారం విపరీతంగా పెరుగుతుంది.
రేషనింగ్ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు!
పశ్చిమాసియాలో పరిస్థితులు మారకపోతే ఇంధన రేషనింగ్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. రాబోయే రెండు వారాల్లో దిగుమతులు మళ్ళీ గాడిలో పడతాయని, కేంద్రం రష్యా , ఇతర దేశాలతో జరుపుతున్న చర్చలు సఫలమైతే పెట్రోల్, డీజిల్ కొరత సమస్య తలెత్తదని కేంద్రం నమ్మకంతో ఉంది. అటు సరఫరాను పునరుద్ధరించడం, ఇటు ధరలను అదుపులో ఉంచడం ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేకపోయినా, అంతర్జాతీయ పరిణామాలను బట్టి రాబోయే రోజుల్లో ఇంధన పొదుపు మంత్రం పాటించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
