తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణలో జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశం, సభ నిర్వహించ తలపెట్టడం కొన్ని పార్టీల నేతలు తెగ ఇబ్బంది పడుతున్నారు. పవన్ కేవలం తన పార్టీ శ్రేణులను బలోపేతం చేసేందుకు, సమైక్యతను చాటేందుకు సేన గళం వంటి కమిటీల ద్వారా అడుగులు వేస్తుంటే.. ఇక్కడి ప్రాంతీయ పార్టీల నేతల్లో మాత్రం అప్పుడే వణుకు మొదలైంది. కవిత నుంచి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వరకు అందరి ఫోకస్ పవన్ కల్యాణ్‌పైనే ఫోకస్ చేస్తున్నారు.
సభ పెట్టుకుంటే తప్పా? పళ్లు రాలగొట్టేస్తారా?
పవన్ కల్యాణ్ ఏమీ తెలంగాణకు వ్యతిరేకంగానో లేదా పాత సమైక్యాంధ్ర నినాదంతోనో ఇక్కడ సభ పెట్టడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా తన క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసేందుకే ఆయన సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ, తెలంగాణపై కేవలం తమకే గుత్తాధిపత్యం ఉందనే కోణంలో ఆలోచించే కొన్ని రాజకీయ శక్తులు పవన్ రాకను తట్టుకోలేకపోతున్నాయి. ఆయన వ్యాఖ్యలను వంకరగా చిత్రీకరిస్తూ, పళ్లు రాలుతాయి అంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడుతుండటం వారిలోని అసహనాన్ని, రాజకీయ అభద్రతా భావాన్ని స్పష్టం చేస్తోంది.
జనసేనను ఎంత టార్గెట్ చేస్తే అంత ప్రాధాన్యత
నాగేశ్వర్ అంశాన్ని అడ్డం పెట్టుకుని, పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు తిట్టించడమే జనసేనకు రాజకీయంగా కలిసి వస్తోంది. ప్రతిపక్షాలు ఎంతగా బురదజల్లే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ప్రజల్లోనూ, యువతలోనూ జనసేన వైపు అంతగా ఆకర్షణ పెరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు పూర్తిగా జనసేన వైపు ఫోకస్ తిరిగేలా చేస్తోంది. ఇది తెలంగాణ మాకే సొంతం అనుకునే పార్టీల ఉనికికే పెద్ద షాక్‌గా మారేలా కనిపిస్తోంది.
పవన్ తమ హవాకు చెక్ పెడతారని భయమా?
పవన్ కల్యాణ్ అంటే తమకు ఎలాంటి భయం లేదని పైకి చెప్తున్నా, నేతల మాటలు, వారి వ్యూహాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయన సభ నిర్వహిస్తే ఎక్కడ తమ ఓటు బ్యాంకు చీలిపోతుందో, యువత ఎక్కడ ఆయన వైపు మళ్లుతుందో అనే కంగారు వారి ప్రతి ప్రకటనలోనూ స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, పవన్ కల్యాణ్ పట్ల తెలంగాణ నేతలు ప్రదర్శిస్తున్న మితిమీరిన ఆందోళన.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఒక బలమైన శక్తీగా ఎదగబోతోందనే సంకేతాలను ఇస్తోందని అనుకోవచ్చు.