నేర పరిశోధనలో పోలీసులకు ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది. ఎక్కడైనా ఒక నేరం లేదా ఘర్షణ జరిగినప్పుడు.. ఈ ఘటన వల్ల అసలు లబ్ధి పొందేది ఎవరు అనే కోణం నుంచే దర్యాప్తు ప్రారంభిస్తారు. తాజాగా కర్నూలులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తల భాగాన్ని తొలగించిన ఘటనను పరిశీలిస్తే ఈ సూత్రం స్పష్టంగా వర్తిస్తుంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండాలని, పెట్టుబడులు రావాలని ఆశించే అధికార కూటమి ప్రభుత్వం ఇలాంటి ఉద్రిక్తతలను కోరుకుంటుందా? లేక రాజకీయంగా మైలేజ్ కోసం, ప్రభుత్వంపై బురద జల్లేందుకు అవకాశం కోసం చూస్తున్న విపక్షం కోరుకుంటుందా? అనే చిన్న లాజిక్ ఆలోచిస్తే అసలు నిజాలు బయటపడతాయి.
ఈ కేసులో పోలీసుల విచారణ తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా గుర్తించిన నిందితుడు మరెవరో కాదు, స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే. అంతటితో ఆగకుండా, సదరు నిందితుడి కుటుంబ సభ్యులు కూడా తాము మొదటి నుండి వైసీపీ వీరాభిమానులమేనని బహిరంగంగా ప్రకటించారు. తమ పార్టీ నేత విగ్రహాన్ని తమ పార్టీ కార్యకర్తే పాడుచేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనేది ఇప్పుడు బహిరంగ రహస్యమే. కేవలం ప్రభుత్వంపై అపవాదు వేయడానికి, శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి సొంత క్యాడర్‌నే రంగంలోకి దించారనే విమర్శలకు ఇది బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది.
రాష్ట్రంలో ఉనికి కోల్పోతున్న తరుణంలో, సెంటిమెంట్‌ను రగిల్చి రాజకీయంగా లబ్ధి పొందడానికే వైసీపీ ఈ విధమైన స్కెచ్ వేసిందని భావిస్తున్నారు. విగ్రహం పాడైంది అని తెలియడమే ఆలస్యం.. అసలు నిందితుడు ఎవరో తేలకముందే, ఏ విధమైన ఆధారాలు లేకుండా అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం, ధర్నాలకు పిలుపునివ్వడం వెనుక ఉన్న తొందరపాటే వారి వ్యూహాన్ని బయటపెట్టింది. శవ రాజకీయాలు, విగ్రహాల రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలనే పాత పంథానే ఇక్కడ కూడా అమలు చేయాలని చూశారు.
అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉండాలనే కోరుకుంటుంది. లేనిపోని ఉద్రిక్తతలు సృష్టించుకుని తమ గ్రాఫ్‌ను తగ్గించుకోవాలని ఏ అధికార పార్టీ కూడా అనుకోదు. ఈ చిన్న లాజిక్‌ను విస్మరించి, వైఎస్ విగ్రహాల పేరుతో ప్రజల్లో సెంటిమెంట్లను రెచ్చగొట్టాలని వైసీపీకాపా ఆడిన డ్రామా.. నిందితుడు సొంత పార్టీ వాడే అని తేలడంతో దారుణంగా అట్టర్ ప్లాప్ అయింది.