హైదరాబాద్: విభజన జరిగిన తర్వాత విజయవాడ ప్రధాన కార్యాలయంగా ఏర్పడిన ఏపీ ఆర్టీసీ సంస్థ, ప్రయాణీకులకు మెరుగైన సేవలు, అత్యాధునిక సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. స్వీడన్‌కు చెందిన ‘స్కానియా’ కంపెనీకి చెందిన 15 అత్యాధునిక బస్సులను కోటిన్నర చొప్పున కొనుగోలు చేసింది. మరో 15 రోజుల్లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వీటికి బాడీ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు.
‘స్కానియా’ సంస్థ ప్రపంచంలోనే విలాసవంతమైన బస్సుల తయారీకి పేరెన్నికగన్నది. ఈ బస్సులలో మల్టీ యాగ్జిల్, హైస్పీడ్ ఇంజన్, విశాలమైన సీటింగ్, పవర్ఫుల్ ఎయిర్ కండిషనింగ్, భారీ ఎల్ఈడీ స్క్రీన్, డిజిటల్ డాల్బీ సరౌండ్ సిస్టమ్, వైఫై సదుపాయాలు ఉంటాయి. బస్సు లోపలి కదలికలతోపాటు బయట వాహనాల కదలికలను కూడా చూడటానికి వీలుగా సీసీ కెమేరాలు ఉంటాయి. కాక్‌పిట్‌లో డ్రైవర్ తన ఎదుట ఉన్న స్క్రీన్‌లో అన్నింటినీ పరిశీలించగలడు. వీటిని కొనుగోలు చేసేముందు స్కానియా సంస్థ ట్రయల్ చూడటంకోసం ఉచితంగా రెండు బస్సులను రెండు నెలలపాటు తిప్పుకోవటానికి ఆర్టీసీకి గత ఫిబ్రవరి నెలలో అందజేసింది. ట్రయల్ రన్లో వీటి పనితీరు నచ్చటంతో అధికారులు 15 బస్సులను కొనుగోలు చేశారు. మరోవైపు దూరప్రాంతాలకు నడిపేందుకు వీలుగా మరో 30 ఓల్వో బస్సులను కూడా ఆర్టీసీ కొనుగోలు చేసింది. వీటిని పలు జిల్లాలకు కేటాయించనున్నారు.