పిల్లజమిందార్తో ఆకట్టుకున్నాడు అశోక్. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినా… అవేం ఆడలేదు. పిల్ల జమిందార్‌తో ఒక్కసారిగా పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. ఓ దశలో వెంకటేష్‌కి కథ చెప్పి ఒప్పించాడు కూడా. కానీ అదో మూకీ సినిమా. ‘పుష్ఫకవిమానం’ లాంటి సినిమా అన్నమాట. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు లేట్ అయ్యింది. ఆ తరవాత సుకుమారుడు పనిలో పడ్డాడు అశోక్. అది ఫ్లాప్ అవ్వడంతో వెంకీ సినిమా పక్కకు వెళ్లిపోయింది. అప్పటి నుంచీ ‘భాగమతి’ ఊసుల్లోనే గడిపేశాడు అశోక్. ఈ సినిమా అటూ ఇటూ అయితే.. అశోక్ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ హిట్టయిపోయింది. సాంకేతికంగా ఈ సినిమా బాగుండడంతో ఫైనల్ క్రెడిట్ అనుష్కకే దక్కినా, అందులో తనకు దక్కాల్సిన వాటా దక్కించుకున్నాడు అశోక్. ఇప్పుడైనా తనకు వెంకీ నుంచి పిలుపు వస్తుందన్నది అశోక్ నమ్ముతున్నాడు. హిట్ చిత్రాల దర్శకుల వెంట పడడం… నిర్మాతలకు, హీరోలకూ మామూలే. ఆల్రెడీ కథ ఓకే అయిపోయింది కదా?? సురేష్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. కాకపోతే… వెంకీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అశోక్ సినిమా మొదలయ్యేసరికి టైమ్ పట్టొచ్చు. ఈలోగా అశోక్ కూడా ఓ సినిమా పూర్తి చేయాల్సివుంటుంది.