రాంగోపాల్ వర్మ సినిమాల్లో యాక్షన్ సీన్స్ కొత్తగా ఉంటాయి. రక్తపాతం ఏమీ కనిపించదు గానీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది. శివ నుంచి ఏ సినిమా తీసుకున్నా.. ఆయన ఫైట్స్లలో కొత్తదనం కనిపిస్తుంది. సహజంగా ఉంటుంది. ఇప్పుడూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. నాగార్జున, వర్మ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ యాక్షన్ సీన్స్, ఓ ఛేజ్ని తెరకెక్కిస్తున్నారు. వీటికి బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఇజాజ్ షేక్ నేతృత్వం వహిస్తున్నారు. వర్మ దర్శకత్వం వహించిన కంపెనీ చిత్రానికి ఆయనే కొరియోగ్రాఫర్. అక్షయ్ కుమార్ లాంటి యాక్షన్ కథానాయకులకు ఆయన ఆస్థాన ఫైట్ మాస్టర్. ప్రస్తుతం నాగార్జున కోసం కొత్త తరహా ఫైట్లని కంపోజ్ చేస్తున్నార్ట. అజయ్, షాయాజీ షిండేలు కూడా ఈ ఫైట్లో పాలుపంచుకుంటున్నారు. మార్చి 10 వరకూ ముంబైలోనే చిత్రీకరణ జరగనుంది. ఏప్రిల్లో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది.