అబుదాబీ ప్రభుత్వం నుంచి సకాలంలో పర్మీషన్లు రానందున ‘సాహో’ షూటింగుకి కొన్ని చిక్కులు తప్పడం లేదు. అనుకున్న ప్రకారం షెడ్యూళ్లు ముందుకు సాగడం లేదు. గతేడాది అబుదాబీలో చేయాలనుకున్న భారీ యాక్షన్ షెడ్యూల్ ఇంకా కాలేదు. దీనికి తోడు ఇప్పుడు హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో కొత్త చిక్కు వచ్చి పడిందట. అదేంటంటే… శ్రద్ధా హిందీ సినిమా షెడ్యూళ్లను బట్టి ‘సాహో’ షెడ్యూళ్లను ప్లాన్ చేసుకోవలసి వస్తుందట.
ప్రభాస్ లాస్ట్ సినిమా ‘బాహుబలి’ కోసం హీరోయిన్ అనుష్క కొన్నేళ్లు మిగతా అవకాశాలను వదులుకుంది. తెలుగు సినిమా మీద అనుష్కకు అంత అభిమానం వుంది మరి! శ్రద్ధా విషయంలో జరిగిన సంగతి వేరు… ఆమె హీరోయిన్ అయితే హిందీ మార్కెట్ పరంగా కొంత కలిసొస్తుందని ‘సాహో’ టీమ్ సంప్రదించింది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందు రెండు హిందీ సినిమాలను శ్రద్ధా అంగీకరించింది. డైరీలో ముందు నోట్ చేసుకున్న ప్రకారం మూడు సినిమాలకు డేట్స్ ఇస్తుందట. మొన్నటివరకు ‘బట్టి గుల్ మీటర్ చాలు’ షూటింగ్ చేసిన శ్రద్ధా, ప్రస్తుతం మరో హిందీ సినిమా ‘స్త్రీ’ షూటింగులో వుంది. ‘స్త్రీ’ షెడ్యూల్ అయిన తర్వాత ‘సాహో’ సెట్స్ మీదకు వస్తుంది. అప్పటివరకూ ఆమె కోసం ప్రభాస్ అండ్ టీమ్ వెయిట్ చేయక తప్పదని సమాచారమ్. అబుదాబీ ప్రభుత్వం నుంచి పర్మీషన్లు వచ్చాయట. త్వరలో అక్కడ షూటింగ్ షురూ చేస్తారని ‘సాహో’ టీమ్ చెబుతోంది. ఈలోపు శ్రద్ధా డేట్స్ కూడా ఫ్రీ అవుతాయట.