కర్ణాటకలో కుమారస్వామి సర్కారు బలపరీక్షకు సిద్ధమైంది. కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాల్సిన సమయం ఇది. అయితే, ఇలాంటి సమయంలో భాజపా నుంచి ఏవైనా మెరుపు నిర్ణయాలు ఉంటాయా, అనూహ్య రాజకీయాలు చోటు చేసుకుంటాయా అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొంత జరుగుతున్న మాట వాస్తవమే. కుమారస్వామి సర్కారు మూణ్ణాళ్ల ముచ్చటే అంటూ ఎడ్యూరప్ప ఎద్దువా చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు నాయకులు అలకబూనడం, తాము ఆశించిన పదవులు దక్కే అవకాశం లేదంటూ శివకుమార్ వంటివారి అసంతృప్తీ… ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని చీల్చి, పదవుల ఎరజూపి, ఎడ్యూరప్ప ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయా అంటే… ఉండవనే అనిపిస్తోంది.
ఎందుకంటే, భాజపా దృష్టంతా ఇకపై వచ్చే ఎన్నికలపై ఉంటుందని చెప్పొచ్చు. వారు బహిరంగంగా ఒప్పుకోకపోవచ్చుగానీ… దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేక పవనాలు మొదలౌతున్నాయనే సంకేతాలు వారికీ అందుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో జరిగిన కొన్నిస్థానాల ఉప ఎన్నికలే ఆ పరిస్థితిని చెప్పాయి. ఇక, త్వరలో రాజస్థాన్ తోపాటు కొన్ని భాజపా పాలిత రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. అసలైన పరీక్ష అక్కడ ఉంటుంది. రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈసారి వసుంధ రాజెను మార్చాలని మోడీ షా ద్వయం భావిస్తోందట! కానీ, అదే పరిస్థితి వస్తే తాను సొంతంగా పార్టీ పెట్టడం ఖాయమన్నట్టుగా ఆమె సంకేతాలిస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో రుణమాఫీ చేస్తా, నిధులు కావాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో పరిస్థితిని ఎలా డీల్ చేయాలనేది ఇప్పుడు ఆ పార్టీకి కొత్త సమస్యగా మారింది.
దీంతోపాటు తాజా వెలువడుతున్న కొన్ని సర్వేల్లో కూడా భాజపాకి ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఏబీపీ న్యూస్ చేసిన సర్వేలో.. మోడీకి మరోసారి అవకాశం ఇవ్వొద్దని అత్యధికులు చెప్పారు. ఇదే సంస్థ 2014 ఎన్నికలకు ముందు ఇలానే సర్వే చేయిస్తే.. మోడీ దేశానికి అవసరమని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో ఇదీ చర్చనీయం అవుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వ్యక్తమౌతున్న కొంత వ్యతిరేకత, త్వరలో భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం ఇవన్నీ భాజపాను కొంత వెనక్కి తగ్గించే అవకాశాలున్నాయి. కాబట్టి, కర్ణాటకలో మెరుపు రాజకీయాలు లాంటివి ఉండవనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే… అది భాజపా ప్రతిష్టను మరింత దిగజార్చినట్టే అవుతుంది.