విభజన హామీలు, ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని కేంద్రంపై నేరుగా యుద్ధం ప్రకటించిన … తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శల్లో ప్రముఖంగా వినిపించే పేరు “ధొలెరా”. గుజరాత్లో దాదాపుగా రూ. 90 వేల కోట్లకుపైగా వ్యయంతో ఈ నగరాన్ని నిర్మిస్తున్నారని… దీనికి కేంద్రం సాయం చేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి ఆరోపణ. విభజన కారణంగా రాజధాని లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోదీ.. ఇప్పుడు అమరావతికి రూపాయి ఇవ్వకుండా… అహ్మదాబాద్ లాంటి రాజధాని ఉన్న.. గుజరాత్లో నిర్మిస్తున్న నగరానికి వేల కోట్లు తరలిస్తూ వివక్ష చూపిస్తున్నారని ఆయన పాయింట్. దీన్ని మహానాడు వేదికపై నుంచి కూడా గట్టిగా చెప్పారు. దీంతో నష్టనివారణ కోసం బీజేపీ రంగంలోకి దిగింది. వరుసగా ధొలెరా నగరంపై వాస్తవాలంటూ.. చాలా మంది బయటకు వచ్చి చెబుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దగ్గర్నుంచి… గుజరాత్ ప్రభుత్వం కూడా.. వివరణ లాంటి ప్రకటనలు జారీ చేసింది. కానీ వీరు చెప్పేవాటిలో ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పోవడంతో “ధొలెరా”పై ఏదో దాస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా… తమ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయిన సందర్భంగా మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. అప్పుడు గుజరాత్లో నిర్మిస్తున్న సిటీలకు..నిధులిస్తూ.. అమరావతికి ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నలకు కూడా జవాబులు ఇచ్చారు. గుజరాత్ లో నిర్మిస్తున్న నగరాలకు కేంద్రం ఒక్కటంటే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని.. అంతా ఆ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటోందని తేల్చేశారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకు వచ్చారు. ధొలెరాపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ధొలెరాకు రూ. 2,500 కోట్లు మాత్రమే ఇస్తుందని… అలాంటి నగరాలు.. ఏపీకి మూడు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత గురువారం గుజరాత్ ప్రభుత్వం తెలుగు పత్రికల్లో ధొలెరాపై ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ పరంగా వివరణ ఇచ్చినట్లు ఉన్న ఆ ప్రకటనల్లో … కేంద్రం రూ. 3 వేల కోట్లు మాత్రమే ధొలెరాకు ఇస్తుందని.. ఆ ప్రాజెక్ట్ వ్యయం రూ.57 వేల కోట్లు అని చెప్పుకొచ్చారు.
నిజానికి “ధొలెరా” నిర్మాణం…. దాదాపుగా రెండు లక్షల ఎకరాల్లో జరుగుతోంది. దీనితో పోల్చుకుంటే అమరావతి చాలా చిన్న ప్రాజెక్ట్. కొన్ని రూల్స్ ప్రకారం… గుజరాత్ సిటీ నిర్మాణం కోసం.. కేంద్రం నుంచి వేల కోట్లు వెళ్తున్నాయి. కానీ బయటకు వెల్లడించని పద్దులు చాలా ఉంటాయి. వాటి ద్వారా వేల కోట్లు వెళ్తున్నాయనేది ఏపీ ప్రభుత్వం అనుమానం. అంతే కాదు.. అమరావతి నిర్మాణం అయితే.. ధొలెరాకు ఇబ్బందులు వస్తాయన్న కారణంగానే… ప్రధాని మోదీ… అమరావతిపై చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే.. ప్రఖ్యాత విద్యాసంస్థలను అమరావతి తీసుకొచ్చారు. అనేక ప్రఖ్యాత సంస్థలు తమ క్యాంపస్‌లు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అమరావతిని ఎలా ఉపాధి, అవకాశాల గనిగా మార్చాలనుకుంటున్నారో… ధొలెరానూ అక్కడి ప్రభుత్వం అలాగే చేయాలనుకుంటోంది. దీనికి అమరావతి పోటీ వస్తే.. ధొలెరా నష్టపోతుందన్న ఉద్దేశంతో కేంద్రం ఉద్దేశపూర్వక నిరాదరణ చూపిస్తోందనేది టీడీపీ ఆరోపణ. ప్రస్తుతం .. బీజేపీ నేతలు భుజాలు తడుముకుంటున్న పరిస్థితి చూస్తే.. అది నిజమేనేమో అనిపించేలా పరిస్థితి ఉంది.