ప్రొ. నాగేశ్వర్ : ట్రంప్‌ – కిమ్‌లలో గెలిచిందెవరు..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉల్‌లు సింగపూర్‌లో సమావేశం కావడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ఎందుకంటే.. వీరిద్దరూ అణ్వస్త్రాలున్న దేశాలకు అధ్యక్షులు. ఇద్దరికీ స్థిర చిత్తం లేదు. కొద్ది రోజుల కిందటి వరకూ.. ఒకరినొకరు… వ్యక్తిగతంగా తిట్టుకున్నారు కూడా. ఓ దశలో… అణు బాంబులు ప్రయోగించుకుంటారేమోనన్న అనుమానం వచ్చేలా… వీరి వ్యవహారశైలి నడిచింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా చల్లబడింది. కానీ ఇద్దరూ సమావేశం అవుతారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఎందుకంటే ఉత్తరకొరియాతో అమెరికాకు ఆరు దశాబ్దాల వైరం ఉంది.

ట్రంప్ కొద్దిగా తగ్గారు..!
డొనాల్డ్ ట్రంప్ – కిమ్ జోంగ్ ఉల్ మధ్య చర్చలు జరిగాయి. ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచారు అనే చర్చ వచ్చినప్పుడు పాశ్చాత్య మీడియా అంతా… డొనాల్డ్ ట్రంప్‌పై కిమ్‌ పై పైచేయి సాధించేశారని తీర్మానించాయి. దీనికి కారణం.. ప్రపంచంలో ఇప్పటి వరకూ అమెరికాది పెద్దన్న పాత్ర. ప్రజాస్వామ్యం కాకుండా.. నియంత పాలన ఉన్న దేశాల్లో అధికారంలో ఎవరు ఉండాలన్నది తాము నిర్ణయిస్తామన్నది .. అమెరికా తీరుగా ఉండేది. ఇరాక్, లిబియాల దగ్గర్నుంచి అనేక దేశాల్లో అమెరికా చేసింది అదే. ఉత్తరకొరియాలోనూ.. అధికారంలో ఎవరు ఉండాలన్నది తాము నిర్ణయిస్తామన్నట్లుగా అమెరికా తీరు ఉండేది. కానీ ఇప్పుడు కిమ్‌కే ట్రంప్ మద్దతు పలకాల్సి వచ్చింది. అందుకే కిమ్ ను అంగీకరించలేని పాశ్చాత్య మీడియా… డొనాల్డ్ ట్రంప్ లొంగిపోయారని చెబుతోంది.

వ్యూహాత్మకంగా కిమ్ ..!
కిమ్‌ – ట్రంప్‌లలో ఎవరు లొంగిపోయారన్న విషయం పక్కన పెడితే రెండు దేశాలు మాత్రం వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మొదటగా అమెరికా… ఉత్తరకొరియాను అణ్వస్త్రదేశంగా గుర్తించినట్లయింది. ప్రపంచంలో ఎవరూ అణ్వస్త్రాలు సమకూర్చుకోకుండా చూసే పెద్దన్న పాత్రలో అమెరికా ఉంది. ఏ దేశమైన అణ్వాయుధాలు తయారు చేసుకుంటే.. ఆంక్షలు విధిస్తోంది. ఉత్తరకొరియాపై అలా విధించింది కూడా. కానీ ఉత్తరకొరియా మాత్రం కొద్ది రోజుల క్రితం వరకూ అస్సలు వెనక్కి తగ్గలేదు. నిజానికి ఉత్తరకొరియా అమెరికాతో ఎప్పుడో చర్చలు జరపాల్సింది. కానీ తమ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేకుండా.. చర్చలకు వెళ్తే.. ఇరాక్‌లో సద్దాంహుస్సేన్, లిబియాలో గడాఫీకి పట్టిన గతి పట్టిస్తారని కిమ్‌కు తెలుసు. ఓ దేశంలో ఎవరు అధ్యక్షుడుగా ఉండాలో అక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఆయా దేశాల్లో ఆమెరికా సైన్యాలే నేరుగా రంగంలోకి దిగి అధ్యక్షుడ్ని హతమార్చాయి. అందుకే కిమ్.. ముందుగా ఉత్తరకొరియాకు అణ్వస్త్ర ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు. దీని కోసం శక్తియుక్తులను వెచ్చించారు. హైడ్రోజన్ బాంబునూ పరీక్షించారు. అణ్వస్త్రాలు లేకపోతే అమెరికాతో ఎప్పటికైనా ప్రమాదమని ఉత్తరకొరియా అధ్యక్షుడు భావించారు. ఉత్తరకొరియా శక్తిసామర్థ్యాల్ని అయిష్టంగానైనా.. ట్రంప్ అంగీకరించాల్సి వచ్చింది. అణు సామర్థ్యం వస్తే… కొత్తగా ఆయుధాలు తయారు చేయకుండా.. పరీక్షించకుండా చేయగలగడమే మిగిలింది. ఆ పని చేయాలి కాబట్టే.. ట్రంప్ కొంత దిగి రావాల్సివచ్చింది.

ఫ్రీజ్ – ఫ్రీజ్ టెక్నిక్ – విన్ – విన్ సిట్యూయేషన్..!
ఉత్తర కొరియా కూడా ఈ విషయంలో కొన్ని వాస్తవాల్ని అంగీకరించింది. నిరంతరం కఠినంగా మారుతున్న ఆర్థిక పరిస్థితులు.. ప్రపంచం మారుతున్న వైనం ఆయనను మార్చి ఉంటుంది. అగ్రదేశాల మద్దతు లేకుండా.. తమ దేశం మనుగడ సాగించడం కష్టమన్న భావనతో ఆయన చర్చలకు అంగీకరించారు. ఈ చర్చలు కార్యరూపంలో దాల్చడంలో చైనా కూడా ఒకింత సాయం చేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి.. యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు… చైనా చొరవతో.. ఫ్రీజ్ – ఫ్రీజ్ అనే టెక్నిక్‌ను అమల్లోకి తెచ్చారు. అంటే అమెరికా ఓ విషయంలో వెనక్కి తగ్గితే.. ఉత్తరకొరియా ఓ విషయంలో వెనక్కి తగ్గుతుంది. అమెరికా చెప్పిన దాని ప్రకారం..మొదట అణుపరీక్షల్ని ఉత్తరకొరియా ఆపేసింది. అదే సమయంలో… దక్షిణకొరియాతో కలిసి చేస్తున్న యుద్ధ విమాన విన్యాసాల్ని అమెరికా నిలిపివేసింది. రెండు దేశాలమధ్య చైనా ఈ తరహా రాజీ కుదర్చడంతో.. చర్చలు సుగమం అయ్యాయి.

ఒప్పందంలో కీలక అంశాలు – అమలుపైనే అస్పష్టత..!
ట్రంప్-కిమ్ ఇరువులూ కలిసి చేసిన ఒప్పందంలో కీలక అంశాలున్నాయి. కానీ దేనిపైనా స్పష్టత లేదు. కానీ రెండు దేశాలు మాత్రం శాంతిని పెంచుకోవాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశాయి. నార్త్ కొరియా అణునిరాయుధీకరణ చేసుకోవాలన్నది ఒప్పందంలోని అంశం. ఈ అణునిరాయుధీకరణ ఎలా జరుగుతుందన్న విషయంలో స్పష్టత లేదు. ఎవరు పర్యవేక్షిస్తారు..? ఎలా చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. నార్త్ కొరియా ఆర్థికంగా బలపడటానికి కృషి చేస్తామని ట్రంప్ ఒప్పందంలో పేర్కొన్నారు. నిజానికి ఉత్తరకొరియాకు ఇచ్చిన ఈ హామీ నెరవేర్చాలంటే.. అమెరికా చాలా ఆంక్షలను ఎత్తివేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికాతో పాటు … ఐక్యరాజ్య సమితి కూడా… ఉత్తరకొరియా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆర్థికంగా ఎదిగేలా ఉత్తరకొరియాకు సహకారం అందించాలంటే.. కచ్చితంగా ఆంక్షలు ఎత్తి వేయాల్సి ఉంటుంది.

ఉత్తరకొరియా రక్షణకు హామీ..!
ఉత్తరకొరియాకు భద్రత హామీ కల్పించాలన్నది కూడా ట్రంప్ – కిమ్ ఒప్పందంలో ఉంది. ఇది ఎందుకంటే.. ఉత్తరకొరియా పొరుగు దేశం… దక్షిణకొరియాలో.. ఏకంగా అమెరికా సైనిక స్థావరమే ఉంది. దక్షిణకొరియా అమెరికాకు మిత్ర దేశం. ఉత్తరకొరియాపై దాడికి.. దక్షిణ కొరియానే బేస్ చేసుకుని కాలు దువ్వింది అమెరికా. ఉభయకొరియా శాంతి మంత్రం పాటిస్తూండటంతో.. అమెరికాకు మరో మార్గం లేకుండా పోయింది. దీంతో తమ సైనిక స్థావరాన్ని ఎత్తి వేసేందుకు ట్రంప్ అంగీకరించారు.

కలసి పోవాలన్నదే ఉభయకొరియాల ఆకాంక్ష..!
ఉభయకొరియాల మధ్య 1960ల నుంచి ప్రత్యక్షంగా కాకపోయినా మరో రకంగా యుద్ధం నడుస్తోంది. ఇప్పుడా యుద్దం అంతమయిందని ప్రకటించుకోవాల్సి ఉంది. ప్రత్యక్షంగా ఇప్పుడు నడవకపోయినా.. రెండు దేశాల మధ్య రాకపోకలు కూడా.. ఉండవు. నీ ఇటీవల దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడు వచ్చారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య మళ్లీ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. శాంతి కోసం ప్రయత్నాలు ముమ్మరమ్యయాయి. రెండు దేశాల అధ్యక్షులు రెండు సార్లు కలిశారు కూడా. ఒలింపిక్స్‌లోనూ ఒకే కొరియాగా పోటీ పడాలని నిర్ణయం తీసుకున్నారు. కొంత ఆలస్యమైనా.. ఉభయకొరియాలు ఏకమవ్వాలన్న ఆలోచనలో ఉన్నాయి. దక్షిణ కొరియా కూడా శాంతినే కోరుకుంటోంది. అసలు చర్చలు అమెరికాకు ఇష్టం లేకపోయినా…ఒప్పుకుందంటే కారణం.. దక్షిణ కొరియానే.

కొన్ని సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి..!
ట్రంప్ – కిమ్ భేటీపై ఇప్పటికి కొన్ని సందేహాలు మిగిలిపోయినా… ఒక ముందడుగు అయితే పడింది. జాయింట్ స్టేట్ మెంట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది..? ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎప్పుడు తీసేస్తారు..? ఉత్తరకొరియా ఎప్పుడు అణ్వస్త్రాలను నిర్వీర్యం చేస్తుంది..? అన్నదానిపై క్లారిటీ వచ్చినప్పుడే.. చర్చల సఫలతను నిర్ణయించవచ్చు. ఇప్పటికే.. రెండు దేశాలు..వాస్తవికతను గుర్తించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.