వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… అనంతపురంలో చంద్రబాబు చేసిన వంచనకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు చేసిన వంచనేమిటంటే.. విభజన హామీలు సాధించలేకపోవడట. రాజీనామాలు చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీలు.. ఈ దీక్షలో కూర్చుంటున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు కేంద్రమంత్రివర్గంలో ఉండి మరీ విభజన హామీలు సాధించలేకపోవడం వంచనేనని.. వైసీపీ నేతలు తీర్మానిస్తున్నారు. సాధించలేకపోవడం వైఫల్యమే కానీ.. వంచన ఎలా అవుతుంది…? విభజన హామీలు అమలు చేయని వాళ్లను.. పల్లెత్తు మాట అనుకుండా… వారితో తెర వెనుక లాలూచీ కొనసాగిస్తూ చంద్రబాబును మాత్రమే దోషిగా చూపెట్టాలనే ప్రయత్నం ఇంత బహిరంగంగా చేస్తే ప్రజలు గుర్తించలేరా..?
విభజన హామీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మొదటి నుంచి ఇంతే ఉంది. అసలు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్రమోడీపై ఎక్కడ లేని అభిమానం చూపిస్తూ.. తప్పంతా.. ఏపీ ప్రభుత్వానిదేని చెప్పేందుకు మొదటి నుంచీ తాపత్రయ పడుతోంది. ప్రత్యేకహోదా విషయంలో… వైసీపీ చేసిన పోరాటం నవ్వల పాలయింది. ఆ పార్టీ ఎంపీలు.. అవిశ్వాస తీర్మానం ఇస్తామంటే.. జాతీయ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడానికి కారణం… ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పదిహేనురోజులకోసారి.. నెలకోసారి మోడీని కలిసి.. విశ్వాసం ప్రకటిస్తూ ఉంటారు. ఓ వైపు అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ఇచ్చి.. జాతీయ మీడియాలో.. కేంద్ర ప్రభుత్వం అంతులేని విశ్వాసాన్ని ప్రకటిస్తారు. దీంతో సహజంగానే… వైసీపీ డబుల్‌గేమ్ ఆడుతోందని.. రాష్ట్ర ప్రయోజనాలను.. స్వార్థానికి వాడుకుంటోందని… ప్రజల్లోకి వెళ్లిపోయింది.
రైల్వేజోన్, స్టీల్ ఫ్యాక్టరీ విషయంలోనూ వైసీపీది ఇదే వైఖరి. కేంద్రం తీరును ప్రశ్నించకుండా.. ఏపీ ప్రభుత్వంపైనే అస్త్రాలన్నీ ఎక్కు పెడుతోంది. కడప జిల్లాలో పెట్టాల్సిన స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం అసాధ్యమన్నట్లు మాట్లాడుతూంటే… నోరు విప్పలేని పరిస్థితి వైసీపీది. కేంద్రంపై తన పోరాటాన్ని చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కళ్ల ముందు ఉంచుతున్నారు. ఇలాంటి సమయంలో… అదే చంద్రబాబును నిందిస్తూ.. వంచన దీక్షలు చేస్తే ప్రజల ఆలోచనలు ఎలా ఉంటాయి..?. ఈ మాత్రం అంచనా వేసుకోలేని స్థితిలో వైసీపీ ఉందా..?
అసలు వైసీపీని చూసుకునే… విభజన హామీల విషయంలో బీజేపీ ఇంత మొండిగా వ్యవహరిస్తోందన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తోంది. వైసీపీ గెలిచే లోక్‌సభ సీట్లన్నీ.. బీజేపీ ఖాతాలోకే వెళ్తాయి కాబట్టి.. ఏపీకి ఏమీ చేయాల్సిన పని లేదని కేంద్రం భావిస్తోందని టీడీపీ చెబుతోంది. ఈ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన వైసీపీ.. మరింత బలం చేకూర్చేలా వ్యవహరిస్తోంది. మోడీకి వంత పాడుతోంది. వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూనే పోతోంది.