ఉత్తరాంధ్ర , ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాపోరాట యాత్రను కొన్ని నెలల్లోనే పూర్తి చేసేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాయలసీమలో అడుగు పెట్టేందుకు మరో కవాతు ద్వారా సిధ్దమయ్యారు. గుత్తి మార్కెట్ యార్డు నుంచి క్లాక్ టవర్ వరకు 2.7 కిలో మీటర్ల మేర కవాతు సాగనుంది. క్లాక్‌టవర్ సెంటర్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. అనంతపురం పోరాట యాత్రలో కరువు పరిస్ధితులు, రైతాంగ సమస్యలపైనే దృష్టి సారిస్తారట. రైతు సదస్సులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా విపక్ష నేత జగన్‌ను టార్గెట్ చేసుకుంటున్న జగన్… రాయలసీమలోనూ..అదే విమర్శలు కొనసాగిస్తారా… లేక స్టాండ్ మార్చుకుంటారా అన్నదానిపై క్లారిటీ లేదు. పవన్ ఎప్పుడు ఎలా మాట్లాడతారో.. ఆయన పార్టీ నేతలకే తెలియదని చెబుతున్నారు.
ఇప్పటి వరకూ జనసేన పార్టీలోకి… ఉభయగోదావరి జిల్లా కాపు నేతలే చేరారు. రాయలసీమ పర్యటనలో ముఖ్యంగా అనంతపురం పర్యటనలో… ఇతర పార్టీల నేతల్ని ఎక్కువగా చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే.. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన ఓ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న లీడర్.. తూ.గో జిల్లాకు వచ్చి కండువా కప్పించుకుని వెళ్లారు. ఆయన ద్వారా మరికొంత మంది నేతల్ని పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అనంతపురం తర్వాత కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో పోరాటయాత్ర చేయాలనుకుంటున్నారు.
అనంతపురం జిల్లాకు పవన్ కల్యాణ్ వెళ్లి పది నెలలు దాటిపోయింది. గతంలో.. అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కరువును పారదోలడానికి పాదయాత్ర చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఇటీవలి కాలంలో …ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం వెళ్లినప్పుడల్లా… పవన్ ను దెప్పిపొడవడం ప్రారంభించారు. ఏదో చేస్తానని మాటలు చెప్పిన ఓ మనిషి.. ఎక్కడున్నాడో తెలియడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో.. తన పోరటయాత్ర ఇక రాయలసీమలోనే చేయాలని… పవన్ కల్యాణ్ డిసైడయ్యారు. అయితే… ఉత్తరాంధ్రలోని మూడు, ఉభయగోదావరి జిల్లాల్లో పోరాటయాత్ర చేయడానికి దాదాపుగా ఆరు నెలలు పట్టింది. మరి రాయలసీమలో ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మరి..!