తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీకి చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణ పార్టీ ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రచారానికి వచ్చి వెళ్లిన తరువాత తమకు మరింత నమ్మకం పెరిగిందనీ, ప్రజారంజకమైన మేనిఫెస్టో కూడా వచ్చిందన్నారు. మూటలు మోసే అలవాటు ఉన్న కేసీఆర్ కి అందరూ అదే పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుందనీ, ఓడిపోతామనే ఆవేదన తెరాసలో చాలా స్పష్టంగా ఉందనడానికి వారి వ్యవహార శైలిలోనే తెలిసిపోతోందన్నారు.
రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనమంతా తెలుగువాళ్లమనీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉందనీ, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గెలుస్తుందనీ, కేంద్రంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనీ, అన్ని చోట్లా కాంగ్రెస్ ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు రఘువీరా. తెలుగుదేశంతో పొత్తు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు! 2014లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది చెప్పడం మొదలుపెట్టి, టాపిక్ మార్చేశారు. ఏపీలో కూడా ఇదే పొత్తు కొనసాగుతుందా అనే మరో సూటి ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా, అదే తమకు శిరోధార్యం అన్నారు. ఇంకోటి, వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ… ఆయన బొమ్మ ప్రతీ తెలుగువాడి గుండెల్లో ఉందన్నారు. కొంతమంది స్వార్థపూరిత నేతలు ఆ బొమ్మను ఎత్తుకెళ్లిపోయే ప్రయత్నం చేస్తున్నారనీ, కానీ కాంగ్రెస్ గుండెల్లో మాత్రమే ఆయన బొమ్మ ఉంటుందన్నారు.
ఆంధ్రాలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఏంటనేది ప్రస్తుతానికి ఆ రెండు పార్టీలకూ స్పష్టత లేని అంశం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తమ పార్టీ సీట్ల సర్దుబాటు లాంటిది ఉండదని ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలు అంటున్నారు. దానిపై టీడీపీ కూడా అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అలాంటప్పుడు, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని రఘువీరా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి, కేంద్రంలో రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని కూడా రఘువీరా చెప్పడం కూడా అలాంటిదే. ఎందుకంటే, లోక్ సభ ఎన్నికల్లో కూడా మహా కూటమి కట్టేందేకే కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. పైగా, రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఉండరనే విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలే చాలాసార్లు చెప్పిన సందర్భాలున్నాయి. ఇవన్నీ చెప్పిన తరువాత… రాహుల్ ఏది ఆదేశిస్తే అదే శిరోధార్యం అంటారు రఘువీరా! ఏదేమైనా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఏంటనేది రాబోయే రోజుల్లో తీవ్ర చర్చనీయాంశం కావడం ఖాయం.