లగడపాటి రాజగోపాల్… ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత మీడియాకు కనిపించ లేదు. ఆయన తన రాజకీయ జీవితంలో చేసిన సర్వే మొదటి సారి ఫెయిలయింది. దీనిపై ఆయన తన స్పందనను కూడా తెలియజేయలేదు. హఠాత్తుగా మళ్లీ తిరుమలలో కనిపించారు. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మళ్లీ మీడియా కంట పడ్డారు. ఆయనను మీడియా వదిలి పెట్టదు కదా.. అందుకే… అందరూ.. సర్వే గురించే… ఆయను అడిగారు. కానీ లగడపాటి మాత్రం తెలివిగా తప్పించుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడబోనని చెప్పి.. కారు ఎక్కి వెళ్లిపోయారు.
గతంలో తిరుమల వచ్చినప్పుడు… మీడియా ప్రతినిధులు అందర్నీ చూసి మాట్లాడేశానని.. అదే తప్పయిపోయిందని ఆయన బాధపడ్డారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటూనే ఆ కార్నర్కి వెళ్లి మాట్లాడటం తప్పయిపోయిందన్నారు. లగడపాటి తన ఎగ్జిట్ పోల్ విషయంపై వివరణ ఇవ్వడానికి సిద్ధంగా లేరన్న విషయం మాత్రం స్పష్టమైపోయింది. సాధారణంగా తన వాదన వినిపించాలనుకుంటే.. ఆయన హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్ పెట్టి.. ఏం జరిగిందో చెప్పి ఉండేవారు. కానీ.. ఇప్పుడు తాను వెల్లడించిన ఎగ్జిట్ పోల్కు… వచ్చిన ఫలితాలను… హస్తిమశకాంతరం ఉండటంతో.. ఆయన సమర్థించుకోలేకపోతున్నారని అనుకోవచ్చు.
లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే.. ఇక ముందు… పెద్దగా క్రేజ్ ఉండే అవకాశం లేదు. అంతకు ముందు.. టీఆర్ఎస్ నేతలు… ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కూడా లగడపాటి చేసిచ్చిన సర్వే అంటూ… కొన్ని నెంబర్లను వైరల్ చేసేవారు. ఇక ఇప్పుడు ఏ పార్టీ కూడా.. అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు. ఆయన నిజంగా సర్వే చెప్పినా… ఏ పార్టీకి అనుకూలంగా వస్తే వారు నమ్ముతారు కానీ… ఇతరులు నమ్మే అవకాశం లేదు. కేటీఆర్ చెప్పినట్లు.. లగడపాటి తన సర్వేలపై క్రెడిబులిటీ పోగొట్టుకున్నారు.