కొత్త పలుకు : లగడపాటి మొదటి సర్వేనే నిజమయిందంటున్న రాధాకృష్ణ..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కొత్తపలుకులో ఈ వారం… తెలంగాణ వారసునికి.. సూచనలతో కూడిన సలహాలు ఇచ్చేందుకు.. లగడపాటి సర్వే విశ్వసనీయతను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి చెప్పినట్లుగా.. టీఆర్ఎస్‌కు 90 సీట్లు వచ్చాయని రాధాకృష్ణ రాసుకొచ్చారు. ” శాసనసభ రద్దు సమయంలో లగడపాటి రాజగోపాల్‌ నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్‌కు 90 స్థానాల వరకు వస్తాయని వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 88 స్థానాలు లభించాయి…” అని రాధాకృష్ణ స్పష్టం చేశారు. లగడపాటి రాజగోపాల్ మొదటి సర్వేను ఎప్పుడు చేశారో.. కానీ బయటకు మాత్రం ప్రకటించలేదు. బహుశా అది టీఆర్ఎస్ పెద్దలకు ఇచ్చి ఉంటారేమో..? కానీ ఆయన బయటకు ప్రకటించినవి మాత్రమే అధికారికం. ఆ సర్వేల్లో.. టీఆర్ఎస్‌కు తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని ప్రకటించారు.

కూటమికే అత్యధిక సీట్లు వస్తాయన్నారు. చంద్రబాబు వల్లే కేసీఆర్ గెలిచారనే వాదనను కూడా.. రాధాకృష్ణ కొత్త పలుకులో వీలైనంత మేర తిప్పికొట్టే ప్రయత్నం ప్రయత్నం చేశారు. ” 2014లో జరిగిన ఎన్నికలలోనూ చంద్రబాబు ప్రచారం చేశారు. అప్పుడే ఆ పార్టీ 15 సీట్లు గెలుచుకుంద”ని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ ఏం చెప్పినా ప్రజలు నమ్మారని మాత్రం విశ్లేషించారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల్ని .. కూడా వేమూరి రాధాకృష్ణచాలా తేలిగ్గా తీసుకున్నారు. 2009లో కేసీఆర్‌ కూడా ఇలాంటి ఆరోపణే చేశారని చెప్పుకొచ్చి… ఓడిపోయిన వాళ్లు అలాగే అంటారని తీసి పడేశారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల గల్లంతు, ఓట్ల మిస్ మ్యాచ్ వంటి అంశాలపై.. జాతీయ మీడియా చేస్తున్న విస్తృత ప్రచారం… ఆయనకు కనిపించడం లేదు. ఇవన్నీ తర్కానికి నిలవని ఆరోపణలు చేస్తూ ఆత్మవంచన చేసుకుంటచున్నారని తేల్చేశారు.

కేటీఆర్‌ ప్రస్తుతానికి యువరాజు మాత్రమే కావచ్చును గానీ, సమీప భవిష్యత్తులో ఆయనే రాజు అవుతారని తేల్చేశారు. అందుకే ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని పాటిస్తే తెలంగాణ రాజకీయాలలో కేటీఆర్‌ దీర్ఘకాలంపాటు తిరుగులేని శక్తిగా నిలుస్తారన్నారు. అలా కాకుండా తనకు తిరుగేలేదు అని భావిస్తే ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉందని హెచ్చరికలు పంపారు. మొత్తానికి… అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత నుంచి… ఈ మూడున్నర నెలల కాలంలో… “కొత్తపలుకు”లో ఎన్నో భిన్నాభిప్రాయాలు బయటకు వచ్చాయి. ఇక ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం వైపే తన వైఖరి ఉంటుందనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.