ఎన్నికల్లో గోల్ మాల్ పై జాతీయ మీడియా కథనాలు..! తెలుగు మీడియా పట్టించుకోదా..?

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు.. తమను ప్రజలు ఓడించలేదని.. ఈవీఎంలు మాత్రమే ఓడించాయన్న నమ్మకంతో ఉన్నారు. అదే మీడియాకు చెబుతున్నారు. న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించామని.. దాసోజు శ్రవణ్ లాంటి.. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న నేతలు ప్రకటిస్తున్నారు. వారి కంఠ శోష వినిపించడానికి కూడా తెలుగు మీడియా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. జాతీయ మీడియా కూడా పట్టించుకోలేదు కానీ.. వారిదైన ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. బీజేపీకి దగ్గరగా ఉంటుందని… భావిస్తున్న న్యూస్ చానెల్స్‌నే.. ఎన్నికల్లో అక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ.. ఈ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. మొదటగా.. ఓటర్ల జాబితాలో అవతకల్ని.. ఎత్తి చూపుతూ.. ఓ పవర్ ఫుల్ స్టోరీని ప్రజెంట్ చేసింది. దానికి సంబంధించి సాక్ష్యాలన్నింటినీ దగ్గర పెట్టుకుని… ఓటర్ల జాబితాలో జరిగిన ఫ్రాడ్‌ను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కౌంటింగ్‌లో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపారు. పోలయిన ఓట్ల కన్నా… కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని బయటపెట్టారు. రెండు నియోజకవర్గాలను… కేస్ స్టడీగా తీసుకుని.. రెండు నియోజకవర్గాల్లో జరిగిన ఫ్రాడ్‌ను బయటపెట్టారు. వాస్తవానికి ఇవి సంచలనాత్మక ఆధారాలు. కానీ తెలుగు మీడియా ఎలాంటి హడావుడి చేయడం లేదు. అంతా గప్ చుప్ అన్నట్లుగా ఉన్నారు.

అసలు ఈవీఎంలలో ఒక్క ఓటు తేడా వచ్చినా… కచ్చితంగా అనుమానించాల్సిన విషయం. ఎందుకంటే.. అవి యంత్రాలు.. వాటికంతటికి అవి.. ఎక్కువ వేసుకోవడం.. తక్కువ వేసుకోవడం సాధ్యం కాదు. మను,ులే చేయాలి. మనుషులే చేసే పరిస్థితి వచ్చిందంటే.. ఎంత వరకైనా చేయవచ్చు. ఈ విషయంలో… స్వల్ప తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు గగ్గోలు పెడుతూంటే.. పట్టించుకునేవారే లేరు. ఎక్కువ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ తెలియడం లేదు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలకు జరిగినపోలింగ్ ఆరవై శాతం వరకూ ఉంటే.. అది తర్వాత ఎనభై శాతానికిచేరింది. ఎలా ఎలా జరిగిందో కూడా.. ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంగ్లిష్ చానళ్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి కానీ.. తెలుగు మీడియా మాత్రం పూర్తిగా సైలెంట్ మోడ్‌లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.