తెలుగు360 సర్వే : కృష్ణా జిల్లాలో టీడీపీకే అడ్వాంటేజ్…! వైసీపీ, జనసేనకు మెరుగైన ఫలితాలు..!

జిల్లాల వారీగా తెలుగు360 అందిస్తున్న సర్వే ఫలితాల్లో భాగంగా ఈ రోజు.. కృష్ణా జిల్లా ఫలితాలను ప్రకటిస్తున్నాం. అయితే క్షేత్ర స్థాయిలో మేము పరిశీస్తున్న విషయం.. ఏమిటంటే.. రాజకీయం వేగంగా మారుతోంది. ప్రచార వ్యూహాలు, అభ్యర్థులు, ప్రజలను ఆకట్టుకునే విషయం, ఓటర్ల మనసుల్లో తమదైన ముద్ర వేసే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో… ప్రచారంలో వెనుకబడిన పార్టీలు… హోరోహారీగా సాగుతున్న పోరాటంలో చివరాఖరకు వెనుకబడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో.. హోరాహోరీ పోరు సాగుతోంది. చాలా చోట్ల ముక్కోణపు పోటీ ఉంది. పలు చోట్ల పార్టీల రెబల్స్ కూడా ఉన్నారు. అయితే.. పుంజుకోవాల్సిన చోట.. కొన్ని పార్టీలు వెనుకబడిపోతున్నాయి.

కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు నియోజకవర్గాలున్నాయి. మొదటి నుంచి.. తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లా కంచుకోట. మద్దతిచ్చే సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే కాదు.. బీసీ వర్గాల ఆదరణ కూడా ఉండటంతో… ఆ పార్టీ ఎప్పటికప్పుడు తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ పది, బీజేపీ ఒకటి వైసీపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత విజయవాడ పశ్చిమ, పామర్రు ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. దాంతో.. అంతిమంగా ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. ఈ సారి కొత్తగా బరిలోకి జనసేన పార్టీ వచ్చింది.

విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్, వైసీపీ నుంచి బొప్పన భవకుమార్, జనసేన నుంచి బత్తిన రాము పోటీ చేస్తున్నారు. టీడీపీలో రామ్మోహన్‌కు పోటీ లేదు. కానీ.. బత్తిన రాము వైసీపీ నుంచి వచ్చారు. అంతకు ముందు పీఆర్పీ తరపున గన్నవరం నుంచి పోటీ చేశారు. చివరి క్షణం వరకూ.. టిక్కెట్.. యలమంచిలి రవికేనని చెప్పిన జగన్.. చివరికి హ్యాండివ్వడంతో ఆయన వర్గం.. వైసీపీ అభ్యర్థికి సహకరించే పరిస్థితి లేదు. వంగవీటి రాధాకృష్ణ.. వైసీపీని ఓడించాలన్న పట్టుదలగా ఉన్నారు. ఆయన వర్గం.. టీడీపీకి సంపూర్ణంగా సహకరిస్తోంది. కాపు ఓట్లను.. పూర్తి స్థాయిలో బత్తిన రాము చీల్చుకునే పరిస్థితి లేదు. దాంతో… గద్దె రామ్మోహన్.. తూర్పు నియోజకవర్గంలో మరో సారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమ, వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హోరాహోరీ తలపడుతున్నారు. ఇక్కడ జనసేన మిత్రపక్షం సీపీఎం .. బాబూరావును అభ్యర్థిగా నిలిపింది. ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులు బలమైన సామాజికవర్గం. ఆ తర్వాత కాపు ఓటర్లదే పైచేయి. ఇప్పుడు ఇద్దరూ చెరో సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నరు. జనసేన అభ్యర్థి నేరుగా.. బరిలో ఉంటే.. టీడీపీ అభ్యర్థి బొండా ఉమకు ఇబ్బందికరం అయ్యేది. కానీ… జనసేన అభ్యర్థి లేకపోవడం.. వంగవీటి రాధాకృష్ణ వర్గం పూర్తి స్థాయిలో బొండా ఉమ కోసం పని చేయడం.. బొండా ఉమకు ధైర్యాన్నిస్తోంది. పోరు హోరాహోరీగా సాగినా… చివరికి బొండా ఉమకే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరపున షబానా ఖాతూన్, వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జనసేన నుంచి పోతిన వెంకట మహేష్ పోటీ చేస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘనమైన విజయాలనేమీ సాధించలేదు. గత ఎన్నికల్లో ఈ సీటును బీజేపీకి ఇచ్చారు. ఈ సారి బీజేపీతో పొత్తు లేకపోవడంతో.. జలీల్ ఖాన్ కుమార్తెను బరిలోకి దింపారు. వైసీపీ తరపున వెలంపల్లి శ్రీనివాస్‌ బరిలోకి దిగుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలుపొందిన ఆయన 2014 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈయనకు ఆరెస్సెస్ నేపధ్యం ఉంది. ముస్లిం వర్గాలు తీవ్ర వ్యతిరేకత ను వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ తరపున పోటీ చేసినప్పటికీ… విజయవాడ ముస్లింలు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు. బేగ్ అనే బలమైన నియోజకవర్గ స్థాయి నేత టీడీపీలో చేరిపోయారు. జనసేన నుంచి పోతిన వెంకట మహేశ్‌ పోటీ చేస్తున్నారు. జనసేనకు మద్దతిచ్చే సామాజికవర్గం పూర్తి స్థాయిలో అండగా ఉండనుంది. కమ్యూనిస్టులు విబేధించడం ఇక్కడ జనసేనకు మైనస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హోరాహోరీగా సాగుతున్న పోరులో..షబానా ఖాతూన్ తొలి సారి .. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చు.

పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బొడె ప్రసాద్ బరిలోకి దిగారు. వైసీపీ తరఫున మాజీ మంత్రి కొల్లు పార్థసారథి పోటీ చేస్తున్నారు. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి లంకా కమలాకర్‌ రాజు పోటీలో ఉన్నారు. సంప్రదాయంగా.. టీడీపీకి మద్దతిచ్చే సామాజికవర్గం బలంగా ఉంది. వైసీపీ తరపున అభ్యర్థిగా కొలుసు పార్థసారధి బరిలో ఉన్నప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. పైగా.. బీఎస్పీ అభ్యర్థి కమలాకర్ రాజు.. వైసీపీ ఓట్లను.. చీలుస్తారు. దీంతో.. పెనమలూరు మరోసారి టీడీపీ ఖాతాలోనే పడనుంది. గన్నవరంలో.. టీడీపీ తరపున వల్లభనేని వంశీ, వైసీపీ తరపున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఈ సీటును..జనసేన సీపీఐకి కేటాయించింది. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఐదేళ్లలో వంశీమోహన్ గన్నవరం నియోజకవర్గంలో తన పట్టును పెంచుకున్నారు. సొంత డబ్బులతో నియోజకవర్గ ప్రజలకు కావాల్సినవి చేసి పెట్టారు. పైగా తెలంగాణ సర్కార్ వేధింపులకు గురయ్యారన్న సానుభూతి కూడా ప్రజల్లో కనిపిస్తోంది. ఈ సారి మెజార్టీ పెంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇక మంత్రి దేవినేని ఉమ..పోటీ చేస్తున్న మైలవరంపై అందరి దృష్టి ఉంది. వైసీపీ తరపున బరిలోకి దిగిన వసంత కృష్ణప్రసాద్‌.. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఒకప్పుడు టీడీపీలో సీనియర్‌ నేత. జగన్‌ను ఎప్పటికప్పుడు తీవ్రంగా విమర్శించే దేవినేనిని ఈ సారి ఎలాగైనా ఓడించాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఖర్చుకు వెనుకాడకుండా.. కృష్ణప్రసాద్ పని చేస్తున్నారు. బీసీ సామాజికవర్గం అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి దేవినేని కుటుంబానికి పట్టు ఉంది. పోరు హోరాహోరీగా సాగినా.. టీడీపీ అభ్యర్థి మంత్రి ఉమ… విజయం వైపుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. తిరువూరు నియోజకవర్గంలో ఈ సారి మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కె.రక్షణనిధికే టిక్కెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ స్వల్ప తేడాతో ఓడిపోయింది. అసంతృప్తులందర్నీ… చంద్రబాబు దారికి తేవడం… డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున టీడీపీకి మద్దతు పలికే అవకాశం ఉండటంతో.. టీడీపీకే అడ్వాంటేజ్ కనిపిస్తోంది. పెడన నియోజకవర్గంలో 1989 నుంచి నేటి వరకు ప్రధాన ప్రత్యర్ధులుగా పోటీ పడుతున్న కాగిత వెంకట్రావు, బూరగడ్డ వేదవ్యాస్ ప్రస్తుతం ఒకే పార్టీ లో ఉన్నారు. సీటు కోసం ఇద్దరు నాయకులు పోటీ పడినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం చివరకు కాగిత వెంకట్రావు కుమారుడికి టికెట్‌ను ఖరారు చేసింది. మరోవైపు వైసీపీ నుంచి ఈ ఎన్నికల్లో జోగి రమేష్ బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ గా ఉన్న ఉప్పాల రాంప్రసాద్ వర్గం.. సహకరించడం లేదు. ఈ కారణంగా.. కాపు సామాజికవర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో జనసేన తరపున అంకెం లక్ష్మీ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఈయన గట్టీ పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. అయినా… వేదవ్యాస్ వర్గం సహకరిస్తూండటంతో.. టీడీపీ అభ్యర్థి గెలుపు సునాయాసం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

నూజివీడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు పోటీ పడుతున్నారు. నిన్నటి దాకా నూజివీడు వైసీపీలో నంబర్‌ -2గా ఉన్న మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బసవా భాస్కరరావు, ప్రతాప్‌తో విభేదించి, బయటకు వచ్చి జనసేన తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. జనసేన అభ్యర్థి బసవా భాస్కరరావుకు లభించే ఓట్లు ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయంపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఎస్సీ, కాపులు, సిబ్బందీలలో ఎక్కువ మంది ప్రతాప్‌కు మద్దతుగా ఉండే వారు. ఇప్పుడు కొంత మంది జనసేన అభ్యర్థి వెంట నడుస్తున్నారు. ప్రతాప్‌ను ఓడించడమే లక్ష్యంగా బసవా భాస్కర్ రావు పని చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినప్పుడు నూజివీడు నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన ముత్తంశెట్టి విజయనిర్మలకు 23 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నాటి టీడీపీ అభ్యర్థి చిన్నం రామకోటయ్య ఐదు వేల ఓట్ల పైగా ఆధిక్యతతో ప్రతాప్‌పై గెలుపొందారు. ఈ సారి కూడా జనసేన పోటీ టీడీపీ అభ్యర్థికి లాభించే అవకాశం ఉంది.

పామర్రు నియోజకవర్గంలో టీడీపీ తరపున ఉప్పులేటి కల్పన బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆమె టీడీపీలో చేరారు. వైసీపీ టికెట్ కైలే అనిల్ కుమార్ దక్కించుకున్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. ఇప్పటికే ఇరు నాయకులు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. జనసేన టిక్కెట్ ఆశించిన డీవైదాస్ దక్కకపోవడంతో.. వైసీపీకే మద్దతు పలుకుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికే మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. నందిగామ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. అయితే.. ఆమె పార్టీని చక్కదిద్దడంలో విఫలమయ్యారు. ఒకరిద్దరు నాయకులు చెప్పినవే చేస్తారన్న ప్రచారం ఉంది. వైసీపీ నుంచి జగన్ మోహన్ రావు టికెట్ దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇచ్చి నియోజకవర్గంలో జెండాను ఎగురవేస్తానని జగన్మోహన్ రావు దీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతితో గెలుస్తానని నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి వైసీపీకే అనుకూలంగా ఉంది.

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ప్రతిపక్షాలను సైతం ఊరిస్తోంది. వైసీపీ తరపున పేర్ని వెంకట్రామయ్య అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జనసేన ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకుంది. పవన్‌కల్యాణ్ సామాజిక వర్గ ఓటర్లు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అభ్యర్థి బండి రామకృష్ణ చురుగ్గా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రయత్నాలను కొనసాగిస్తే.. జనసేన ఖాతాలో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పడే అవకాశం ఉంది. కైకలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయమంగళకు టిక్కెట్‌ కేటాయించారు. వైసీపీ టికెట్‌ చేజెక్కించుకున్న దూలం నాగేశ్వరరావు కాపు సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కైకలూరు జనసేన అభ్యర్థిగా బి.వి.రావును ఖరారు చేశారు. బి.వి.రావు బీసీ వర్గానికి చెందిన వారు. ఆయనకు కాపు వర్గం మద్దతు రానుంది. దాంతో ఈ వర్గం ఓట్లపై ఆశలు పెట్టుకున్న వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు కు కైకలూరు వాసిగా ముద్ర ఉండడంతో ఆయన అనుచర వర్గం, మాగంటి సామాజిక వర్గం కూడా జయమంగళ విజయానికి కృషి చేస్తుంది. దీంతో టీడీపీ అభ్యర్థికి అడ్వాంటేజ్ కనిపిస్తోంది.

జగ్గయ్యపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్ అలియాస్ తాతయ్య టీడీపీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను బరిలో ఉన్నారు. ఇద్దరూ చాలా కాలంగా ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇద్దరు గత రెండు సార్లు హోరాహోరీ తలపడ్డారు. 2009లో ఏడు వేల ఓట్లతో గెలిచిన తాతయ్య.. ఆ తర్వాత 2014లో పదిహేను వందల ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. రెండు సార్లు ఓడిపోయిన సానుభూతి పని చేస్తుందని.. నమ్ముతున్నారు. ఇక్కడ.. వైసీపీకే కాస్త అనుకూలంగా ఉంది. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన బుద్దప్రసాద్ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయనే పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ముత్తంశెట్టి కృష్ణారావు నేడు జనసేన పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. టీడీపీలో గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి ముందంజలో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. గుడివాడపై పట్టు సాధించేందుకు టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ , వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని బరిలో ఉన్నారు. అవినాష్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొడాలి నాని.. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వంగవీటి రంగాను హత్య చేసింది.. దేవేనేని అవినాష్ తండ్రేనని..ఆయన అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. కానీ పోటీ మాత్రం అంత తేలికగా లేదు. వచ్చే వారం రోజుల్లో జరగబోయే పరిణామాలు విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. ఇక్కడ… ఇప్పటికైతే… కొడాలి నానికే అడ్వాంటేజ్ కనిపిస్తోంది.

AreaParty
తిరువూరు వైసీపీ
నూజివీడు టీడీపీ
గన్నవరం టీడీపీ
గుడివాడ వైసీపీ
కైకలూరు టీడీపీ
పెడన టీడీపీ
మచిలీపట్నంజనసేన
అవనిగడ్డ జనసేన
పామర్రు (ఎస్సీ) వైసీపీ
పెనమలూరు టీడీపీ
విజయవాడ పశ్చిమ టీడీపీ
విజయవాడ సెంట్రల్ టీడీపీ
విజయవాడ తూర్పు టీడీపీ
మైలవరంటీడీపీ
నందిగామ వైసీపీ
జగ్గయ్యపేట వైసీపీ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close