ప్రత్యేక హోదా తెచ్చే మగాడు ఎవడు?

ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం. ఎవరికీ అక్కర్లేని అంశం. ఎవరికీ కనీస ఆసక్తి లేని అంశం. ఆ అంశాన్ని అలా తయారు చేశారు మన నాయకులు, మన మీడియా. ఆ అంశం మీద ఆసక్తి లేని వాళ్లు దయచేసి ఇక్కడితో ఆపేయండి.

నాయకులకి “ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు” అనే నినాదం కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనా?
ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా అనే అంశం అసలు జనానికీ? నేతలకీ? మీడియాకీ? ఎవరికీ అవసరం లేదా?
ఓడినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకునేందుకేనా “ప్రత్యేక హోదా” అనే అంశాన్ని వెంటిలేటర్ మీద బ్రతికించేది?
వచ్చే ఎన్నికల్లో పార్టీల మంత్రం ఇదేనా?
అలా వెళ్తే ప్రజలు వీళ్లని మళ్లీ నమ్ముతారా?
ప్రజలకి దీని మీద కనీస అవగాహన ఉందా?
ప్రజలకి దీని వల్ల కలిగే ప్రయోజనాలు అవసరం లేదా?
రాబోయే తరాలు ఉద్యోగాల కోసం రాష్ట్ర బయటకు వెళ్లాల్సిందేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీ కేసీఆర్ గారికి ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం, కీర్తిశేషులు శ్రీ యెదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, తర్వాత ఆయన కాలం చేయడం వల్ల మాత్రమే రాష్ట్రం రెండు ముక్కలుగా అయింది.

అదే విధంగా ఓటుకు నోటు కేసులో శ్రీ చంద్రబాబు గారి హస్తం ఉండడం, ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద లెక్కకు మించి అవినీతి కేసులు ఉండటం, ప్రశ్నిస్తాను అనే పవన్ కళ్యాణ్ అసలు ఈ విషయం గురించి మర్చిపోవడం, రాష్ట్రం విడిపోతే ఏం? నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అనుకునే జనం, శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర మీడియా, కాసులిస్తేనే బయటకు వచ్చే లెజండరీ సెలబ్రిటీలు వీళ్లందరి వల్లనే ప్రత్యేకహోదా అనేది వెంటిలేటర్ మీద జీవచ్చవంలా బ్రతుకీడుస్తోంది.

ఈ కారణాలన్నీ పక్కనుంచితే 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం విడిపోయే సమయానికి సరిగ్గా 16000 కోట్ల లోటు బడ్జెట్ తో మొదలైంది. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంచి టిడిపి బిజెపి కూటమిని గెలిపించారు.

పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని నెలకొల్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి సారించకుండా ఎక్కడో తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ మద్దతు కోసం నేరుగా బేరసారాలు జరిపి అడ్డంగా కేసులో ఇరుక్కోవడం అనేది అటు కేంద్రానికీ, ఇటు పక్క రాష్ట్రానికీ వరం ఆంధ్రా జనానికి శాపంగా మారింది.

నేతల ముందుచూపు లోపం కారణంగా అన్ని రకాల పరిశ్రమలు, కార్యాలయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ హైదరాబాద్ లోనే నెలకొల్పడం జరిగింది.
ఇప్పుడు కట్టుబట్టలతో మాత్రమే ఉన్న కొత్త రాష్ట్రానికి రాజధాని, పరిశ్రమలు కావాలి. పరిశ్రమలకి అన్నిరకాల టాక్సులు మీద రాయితీలు ఉండాలి. అలా ఉన్నప్పుడే కంపెనీలు తమ ప్లాంట్లను నెలకొల్పడానికి ఆసక్తి చూపిస్తాయి.

ఇక మనం బిజెపి మన రాష్ట్రం మీద ప్రదర్శించిన కుటిలత్వం ఒకసారి గుర్తు చేసుకోవాలి. తలుపులు వేసి మరీ విడగొట్టడానికి చేసిన చట్టంలో కాంగ్రెస్ తో పాటూ బీజేపీకి కూడా ఉంది. అడ్డదిడ్డంగా చేసిన చట్టాన్ని సమర్ధించి బీజేపీ మన రాష్ట్రానికి మొదటి దెబ్బ కొట్టింది.

రాష్ట్రం ఎలాగూ విడిపోయింది ఇక ఎన్నికల సభల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, తీరా సంపూర్ణ మెజారిటీ వచ్చాక దానిని కాస్తా మరిచిపోయి రెండో దెబ్బకొట్టింది.
బిజెపి వాళ్ల వల్ల ఇప్పటి వరకు జరిగిన లాభం శూన్యం. ప్రత్యేక హోదా ప్యాకేజీ హోదా ప్యాకేజీ అనే గజిబిజి డ్రామాలో టిడిపిని జోకర్ ని చేసి ఆడుకున్నారు.

చివరికి ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ లేదు అవతలికి పొమ్మన్నారు. కేవలం ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి ప్రత్యేక హోదా అనే అంశం యొక్క ఆవశ్యకతని ఆలస్యంగా పసిగట్టిన టిడిపి ప్రభుత్వం అర్థంపర్థం లేని దుబారా దీక్షలతో ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్లా పడింది. ఓటమికి గల ప్రధాన కారణాలలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో చిత్తశుద్ధితో పోరాడకపోవడం అనేది కూడా ఒకటి.

ఇక గౌరవనీయులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారి విషయానికొస్తే పరిపాలన మీద అవగాహనా లోపం వల్ల మొదటి ఎన్నికల్లో ఓడిపోయినా ప్రత్యేక హోదా నినాదాన్ని ఒకరకంగా బలంగా ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. అది రాజకీయ స్వప్రయోజనాల కోసమేనా ? లేక ప్రజోపయోగం కోసమా? అనేదాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ప్రభుత్వ వ్యతిరేకత, ఒక చాన్స్ ఇద్దాం అని ప్రజలు అనుకోవడం, కేంద్ర, పక్క రాష్ట్ర ప్రభుత్వాలతో మంచి అవగాహన, మరియు అనేకానేక ఇతర కారణాలతో 151 సీట్ల భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించారు.

“25 ఎంపీలని నాకు ఇవ్వండి కేంద్రం మెడలు ఇలా వంచి అలా ప్రత్యేక హోదా తెస్తాను” అని పలుమార్లు చెప్పడంతో 25 కాకపోయినా 23 ఎంపీలను గెలిపించారు. తీరా గెలిచాక కేంద్రానికి మన ఎంపీలతో అవసరం లేదు, ఒకవేళ వాళ్లకి అవసరమైతే ప్రత్యేక హోదా కోసం మెడలు వంచే వాళ్ళం. ప్రస్తుతం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ అని అడుగుతామని అనడం తప్ప ఇప్పటివరకూ ఈ విషయంలో చిత్తశుద్ధి చూపలేదు. ప్రస్తుత బిజెపి వైసిపి మధ్య ఉన్న కోల్డ్ వార్ తో అది సాధ్యం కాదు అనిపిస్తుంది. ఇక ప్రత్యేక హోదా విషయం పక్కన పెడితే గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు టిఆర్ఎస్ తో ఉన్నదో దోస్తీ కారణంగా హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ఆస్తులను గిఫ్ట్ గా ఇచ్చారు. ఏది? ఎప్పుడు? ఎవరి నుంచి? ఎలా? రాబట్టాలి అనే విషయంలో స్పష్టతా లోపం కనిపిస్తుంది.

ఇక గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రస్తుత మిత్ర పార్టీ అయిన టిఆర్ ఎస్ కి చెందిన ఎంపీలు 2014 తర్వాత లోక్ సభలో ప్రత్యేక హోదాకి సంబంధించిన డిస్కషన్ మొదలు పెట్టిన ప్రతీసారీ సభను వివిధ రకాల కారణాలతో అడుగడుగునా అడ్డంకులు కలిగించడందేశం మొత్తం చూసింది. అలాంటి టి ఆర్ ఎస్ పార్టీ వల్ల మనకి ప్రత్యేక హోదా విషయంలో కానీ, అసలు ఏ విషయంలోనైనా లాభం చేకూరుతుందని నమ్మడం అమాయకత్వమే.

ఇక బిజెపి గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి. బిజెపి ప్రస్తుత అజెండా దేశం మొత్తాన్ని కాషాయమయం చేయడం. ఉత్తర భారత దేశంలో మెజారిటీ ఉన్నప్పటికీ, ఉన్న దక్షిణ భారత దేశంలో ఒక్క కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేడర్ లేనందువల్ల ఎప్పుడూ అరకొర సీట్లే. ఇప్పుడు ఇక్కడ బాగా వేయాలంటే ఒకే ఒక్కదారి ఉన్న నేతలను చేతగాని వారిగా చూపించడం. ఎలాగూ ప్రజాబలం లేదు కనుక ఓటుకు నోటు అడ్డుపెట్టుకుని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదే తంత్రంతో ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా దెబ్బకొట్టడమే లక్ష్యం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గానీ ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గానీ ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఇచ్చామన్న పేరు బిజెపికి వచ్చినా దాని అసలు లాభం పొందేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లేదా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే. మొన్న ఎన్నికలప్పుడు పూర్తి మద్దతు ప్రకటించిన బిజెపి సోషల్ మీడియా పెద్దలు ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక హిందూ ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు, ఆంధ్రా బిజెపి నాయకులు మాత్రం మా దయవల్ల మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగారు అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినా అటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు గానీ, ఇటు శ్రీ విజయసాయి రెడ్డి గారు గానీ బిజెపి వారిని పల్లెత్తు మాట అనడం లేదు. దీని వల్ల బీజేపీకి లాభం వైసీపీకి నష్టం జరిగిపోతున్నాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారిని ఇప్పటికైనా ఎన్నికల హామీలుతో పాటు రాష్ట్రానికి అత్యావశ్యకం అయిన ప్రత్యేక హోదా మన హక్కు అనే నినాదాన్ని మనసా వాచా గట్టిగా పోరాడితే ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. అలాగే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అలా కాదని వ్యక్తిగత కారణాల దృష్ట్యా పక్కన పెడితే “మళ్లీ ఎన్నికలకి ఏ నినాదంతో వెళ్లాలి?” అనే ఆలోచనలో పడాలి. లేటుగా నిద్రలేచిన టిడిపి ప్రభుత్వం గత ఎన్నికల్లో బోల్తా పడింది. ఇప్పుడు మొదలు పెడితే హోదా వచ్చి పరిశ్రమ నుంచి ఆర్థికంగా పటిష్ఠంగా ఉపాధి పెరిగి రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయంలో ఎంత త్వరగా కళ్ళు తెరిస్తే అంత మంచిది.

ఇక శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకుందాం. అసలు పార్టీ పెట్టిందే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన విధానాలు నచ్చక అని ప్రారంభోత్సవ సభలోనే చెప్పడం జరిగింది. ప్రత్యేక హోదాని కాదని టిడిపి ప్రభుత్వం ఒప్పుకున్న ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి అనేకచోట్ల సభలు పెట్టి ఢిల్లీ వాళ్లని గట్టిగా విమర్శించడం జరిగింది. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఉద్యమాలు కూడా చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. కారణాలు ఏమైనా ప్రత్యేక హోదా గురించి చెప్పినంత గట్టిగా పోరాడలేదు అనేది స్పష్టం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా బీజేపీ వాళ్ళతో పోరాడుతారా? లేదా ప్రభుత్వాన్నీ, ప్రజల్నీ ప్రత్యేక హోదా కోసం ప్రేరేపిస్తారా? అనేది వేచిచూడాలి.

ఇక ప్రత్యేక హోదా విషయంలో ప్రజల పాత్ర గురించి మాట్లాడకుందాం. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మొదలుపెట్టిన విశాఖపట్నం ఉద్యమం ప్రభుత్వ అరెస్టులు అణిచివేత కారణంగా అటకెక్కింది. కొన్ని అరెస్టులతోనే సద్దుమణిగి ఉద్యమకారులా మన జనం?. జల్లికట్టు నుంచి తీసుకొన్న స్ఫూర్తి తాలూకు ఇంటెన్సిటీ ఇంతేనా? అసలు మన ప్రజలకు ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?. ఎవడు ఎటు పోతే నాకేంటి నేను, నా వాళ్ళు బాగుంటే చాలు అనుకునే సగటు ఆంధ్రుల మిగిలిపోతున్నారా?. ఎవరో వస్తేనే వస్తేనే పోరాడుదాం అనే మానసిక దౌర్భాగ్యం నుంచి బయటపడేది ఎప్పుడు?.

సమైక్యాంధ్ర ఉద్యమం జనంలో నుంచి వచ్చింది. ఉద్యమకారులు ఎలా ఉన్నా ఉద్యమనాయకులు అమ్ముడుపోవడం వల్ల మాత్రమే ఉద్యమం నీరుగారిన విషయం తెలిసిందే. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని కొత్తగా ఉద్యమం చేసే సత్తా మన ప్రజలకు ఉందా?

అన్నిటిలోనూ తమిళులతో పోటీపడే సగటు తెలుగు వాడు ఆత్మాభిమానం విషయంలో ఆమడదూరంలో ఎందుకు ఆగిపోతున్నాడు?. ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి పోతాయి. కులం, మతం, ధనం, ప్రాంతం, కారణాలు ఏవైనా సరే ఎవరో ఒకరికి ఓటు వేసి చేతులు దులుపేసుకుంటే మిగిలినవన్నీ వాడే చూసుకుంటాడు అనే నిద్రలోనే ఇంకా జోగుతున్నారా?.

రాష్ట్రాభివృద్ధి జరగకపోతే ఉద్యోగాల కోసం నీ తరం, నీ తర్వాత తరం కూడా పక్క రాష్ట్రలకీ, వేరే దేశాలకీ పోవాలా? అనే ఆలోచన వచ్చేది ఎప్పటికీ. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ శ్రీ శ్రీ యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానికులకే అనే నినాదం మన కన్నా ఇతర రాష్ట్రాల వారు గట్టిగా నెత్తికి ఎత్తుకున్నారు. వాళ్లు కూడా అదే విధంగా చేస్తే, పరిశ్రమలు, హోదా లేకపోవడం వల్ల ఇటు మన రాష్ట్రంలోనూ ఉపాధి లేక అటు పక్క రాష్ట్రాలు పొమ్మంటే ఇక ఏ దిక్కుకు పోవాలి.

ఎన్నికల హామీలు నేతలతో పాటు ప్రజలు మెల్లగా మర్చిపోతున్నారా?
వచ్చే ఎన్నికలకు నేతలు నినాదం ఏమిటి మళ్లీ ప్రత్యేక హోదానేనా?
మళ్లీ ఆ మాట ఎత్తడానికి నేతలకు సిగ్గుగా అనిపించదా?
చిత్తశుద్ధి ప్రజలకు నాయకులకు కొరవడింది అనేది సుస్పష్టం.
బిజెపి, టిడిపి, వైసిపి, జనసేన ఇన్ని హద్దుల్ని దాటుకుని రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా?
రేపటి తరం మనల్ని తిట్టుకోకుండా ఉంటుందా?
ఆ ప్రత్యేక హోదా అనే ఆకాశగంగను రాష్ట్రానికి తీసుకువచ్చే భగీరథుడు ఎవరు?
ఇంకా చెప్పాలంటే ప్రత్యేక హోదా తెచ్చే మగాడు ఎవ్వడు?
తెచ్చినవాడు చరిత్రలో మిగులుతాడు, మిగిలిన వాళ్లంతా ఆ చరిత్రలో కనుమరుగైపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close