చంద్ర‌బాబు నాయుడు ఇంకా ఆ మాటలు వ‌ద‌ల‌ట్లేదు..!

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత కొన్నాళ్ల‌పాటు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఒకేమాట మాట్లాడుతూ వ‌చ్చారు! అదేంటంటే… తాను ఐదేళ్ల‌పాటు రాష్ట్రానికి ఎంతో చేశాన‌నీ, ఎందుకు ఓడిపోయామో త‌న‌కు అర్థం కాలేద‌ని చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో, ఓట‌మికి కార‌ణం ఆయ‌న‌కే అర్థం కావ‌డం లేద‌ట అంటూ వైకాపా నేత‌లు చాలా విమ‌ర్శ‌లు చేశారు. ఇప్పుడు, కార్య‌క‌ర్త‌ల‌కు స‌మ‌యం కేటాయించ‌డం అనే అంశాన్ని ప్ర‌తీ స‌భ‌లోనూ చంద్ర‌బాబు ప్ర‌స్థావిస్తున్నారు! ఇదీ ఒక‌ర‌క‌రంగా విమ‌ర్శ‌ల‌కు ఆస్కారం ఇచ్చేదిగానే క‌నిపిస్తోంది.

శ్రీ‌కాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ… పెద్ద కొడుకుగా ఉంటాన‌ని తాను మాటిచ్చినా, ప్ర‌జ‌లు తెలిసో తెలియ‌కో జ‌గ‌న్ కి ఓటేశార‌న్నారు. ఒక్క అవ‌కాశం ఇస్తే ఏదో చేస్తాడ‌ని న‌మ్మి మోస‌పోయార‌న్నారు. ఇప్పుడు మ‌ళ్లీ నేనే రావాల‌ని ప్ర‌జ‌లు కోరుకోవ‌డం మొద‌లైంద‌న్నారు. జిల్లాకో ఇసుక రాక్ష‌సుడు త‌యార‌య్యాడ‌నీ, ఇసుక‌కు ఇలాంటి కొర‌త ఎప్పుడూ రాలేద‌న్నారు. సంప‌ద సృష్టించే సామ‌ర్థ్యం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి లేద‌న్నారు. ఈ సంద‌ర్భంలోనే కార్య‌కర్త‌ల గురించి మాట్లాడుతూ… లేనిపోని కేసులు పెడుతున్నార‌నీ, అవ‌స‌ర‌మైతే న్యాయ పోరాటం చేసి కార్య‌క‌ర్త‌ల్ని కాపాడుకుంటామ‌న్నారు. గ‌తంలో అధికారంలో ఉండ‌గా ప్ర‌జా సంక్షేమ‌మే ధ్యేయంగా ఆ కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ‌గా స‌మ‌యం గ‌డిపేవాడిన‌నీ, దీంతో కార్య‌కర్త‌ల‌కు స‌మ‌యం ఇవ్వ‌లేక‌పోయాన‌ని చంద్ర‌బాబు అన్నారు. ఒక నుంచి వీలైనంత ఎక్కువ స‌మ‌యం కార్య‌క‌ర్త‌ల కోస‌మే కేటాయిస్తా అన్నారు.

గ‌తంలో కార్య‌క‌ర్త‌ల‌కు స‌మ‌యం ఇవ్వ‌లేకపోయా… ఈ మాటే చంద్ర‌బాబు ఇంకా వ‌ద‌ల‌ట్లేదు! ఇదెలా వినిపిస్తోందంటే… అధికారంలో ఉంటే కార్య‌క‌ర్త‌ల‌కు స‌మ‌యం ఇవ్వ‌లేరా అనే అభిప్రాయం క‌లుగుతోంది. అధికారంలో ఉన్నా లేకుండా పార్టీ అధ్య‌క్షుడిగా కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండాలి. ఇత‌ర పార్టీల్లో ఇలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు క‌దా! ఇంకోటి… ప్ర‌జ‌లు తెలిసో తెలియ‌కో జ‌గ‌న్ కి ఓటేశారు అనేది కూడా అప్ర‌స్తుత వ్యాఖ్య‌గానే క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీగా వైకాపా పాల‌న‌పై అంశాల‌వారీగా స్పందించాలిగానీ, ఎన్నిక‌ల్లో తీర్పు అంటూ ప్ర‌జ‌ల కోణంలో ఇంకా విమ‌ర్శ‌లు చేయ‌డం అన‌వ‌స‌రం. ప్ర‌జ‌ల‌కు ప‌దేప‌దే వారు వేసిన ఓటు గురించి గుర్తు చేయ‌డం అన‌వ‌స‌రం. ఎందుకోమ‌రి.. చంద్ర‌బాబు నాయుడు ఈ టాపిక్ నుంచి పూర్తిగా బ‌య‌ట‌కి రాలేక‌పోతున్నారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com