ఆంధ్రప్రదేశ్ రాజధానిపై… సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనలను అసెంబ్లీలో వెల్లడించారు. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చని.. ఆయన అసెంబ్లీలో చెప్పకనే చెప్పారు. అమరావతిలో చట్టసభలు ఉంటాయన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటుందున్నారు. అంటే.. అక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తారు. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవచ్చని జగన్ సూచన ప్రాయంగా చెప్పారు. ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని.. ఆ దిశగా.. ప్రతిపాదనల కోసం.. ఓ కమిటీని నియమించామని.. మరో వారంలో ఆ కమిటీ నివేదిక వస్తుందని జగన్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని జగన్ తన ప్రసంగం సందర్భంగా గుర్తు చేశారు.
అమరావతిపై అనేక అనుమానాలు కలిగేలా మంత్రులు గతంలో ప్రకటనలు చేశారు. అయితే.. జగన్ మోహన్ రెడ్డి తన ఆలోచనలు మాత్రం వెల్లడించలేదు. పలు రకాల కమిటీలు వేస్తూండటంతో.. మార్చాలనే ఆలోచన చేస్తున్నట్లుగా స్పష్టమయింది. అయితే.. ఏపీకి మూడు రాజధానులు చేయాలన్న ఆలోచనను మాత్రం.. మొదటి సారి బయట పెట్టారు. సౌతాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు కాబట్టి.. ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో నియమించిన కమిటీ కూడా.. ఇదే నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంది.
అంతకు ముందు అసెంబ్లీలో అమరావతి అంశంపై.. సుదీర్ఘంగా చర్చ జరిగింది. అమరావతిలో భూములు చంద్రబాబు బినామీలు కొన్నారని మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. నాలుగు వేల ఏడు వందల ఎకరాలు టీడీపీ నేతలు కొన్నారని ఆరోపించారు. పలువురు పేర్లు చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిదంని ఆరోపించారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో.. స్పీకర్ బుగ్గనకు చాన్సిచ్చారు. బుగ్గన అబద్దాలు చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తే.. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సీఎం జగన్ .. స్వయంగా ఆ ఎమ్మెల్ని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సూచించారు. ఆ తర్వాత జగన్.. బుగ్గన, బొత్స మాట్లాడారు.