మ‌న‌సా.. మ‌ది దోచుకుంది తెలుసా!

ఏ సినిమాకైనా సంగీతం స‌గం బ‌లం. పాట‌లు హిట్ట‌యితే… ఏదో ఓ చిన్న భ‌రోసా. ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే మ్యాజిక్‌… సంగీతానికి ఉంది. ఈ మ‌ధ్య విజ‌య‌వంత‌మైన ప్ర‌తీ చిత్రంలోనూ ఓ గ‌మ్మ‌త్తైన పాటైనా క‌నిపిస్తోంది.. వినిపిస్తోంది. యాధృచ్ఛిక‌మో ఏమో గానీ, ఆ పాట‌ల‌న్నీ సిద్ద్ శ్రీ‌రామ్ గొంతులోంచి వ‌చ్చిన‌వే. ఆల్బ‌మ్‌లో ఒక్క పాటైనా సిద్ తో పాడించ‌డం, దాన్ని ఫ‌స్ట్ సింగిల్‌గా విడుద‌ల చేయ‌డం, ఆ పాట హిట్ట‌యిపోవ‌డ‌మూ… మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’ సినిమాలోంచి తొలి గీతం విడుద‌లైంది. ”మ‌న‌సా… మ‌న‌సా” అంటూ న‌డిచిన ఈ పాట‌ని అల‌వాటు ప్ర‌కారం సిద్ శ్రీ‌రామ్ త‌న‌దైన స్టైల్‌లో పాడి మ‌త్తెక్కించాడు. ఇదో అంద‌మైన మెల‌డీ. అమ్మాయిని చూసి మ‌న‌సు పారేసుకున్న ఓ ప్రేమికుడి మ‌నో వేద‌న ఈ గీతం.

గోపీ సుంద‌ర్ ఓ సింపుల్ ట్యూన్ అందించాడు. దానికి సురేంద్ర కృష్ణ అల‌తి అల‌తి ప‌దాల‌తో సాహిత్యం స‌మ‌కూర్చాడు. నా మాట విన‌వా మ‌న‌సా అంటూ మ‌న‌సుని బ‌తిమాలుకోవ‌డం, మ‌న‌సా నేను నీకు తెలుసా అంటూ త‌న‌ని తాను మ‌న‌సుని పరిచ‌యం చేసుకోవ‌డం అందంగా, ఆహ్లాదంగా అనిపించాయి. ”త‌న‌తో ఉండే ఒక్కో నిమిషం… మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావే మ‌న‌సా” అని రాయ‌డం మ‌రింత బాగుంది. పిక్చ‌రైజేష‌న్ ఎలా ఉంటుందో తెలీదు గానీ, ఈ సినిమా సంగీత ప్ర‌యాణానికి మంచి ఆరంభం ల‌భించిన‌ట్టే. మిగిలిన పాట‌లెలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.