రివ్యూ: చ‌క్ర‌

తెలుగు360 రేటింగ్ 1.5/5

ఓ తెలివైన హీరో.. అంతే తెలివైన విల‌న్‌. ఇద్ద‌రు స‌మ ఉజ్జీల పోరు… ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. వాళ్ల మైండ్ గేమ్‌, ఎత్తుకు పైఎత్తులు.. చ‌ద‌రంగం ఆట‌ని త‌ల‌పిస్తాయి. ఈ ఫార్ములా ఎప్పుడూ హిట్టే. కాక‌పోతే… `స‌రిగా` తీయాలి. అన్ని తెలివితేట‌లు ద‌ర్శ‌కుడికి ఉండాలి. ఏవో నాలుగు జిమ్మిక్కులు చేసి, తిమ్మిని బ‌మ్మిని చేసి, బ‌మ్మిని ఈజిప్టు మమ్మీగా చేద్దామ‌ని చూస్తే మాత్రం – ప‌ప్పులు ఉడ‌క‌వు. ద‌ర్శ‌కుడే కాదు.. ప్రేక్ష‌కులూ తెలివైన వాళ్లే అనే విష‌యం గ్ర‌హించాలి. ఆ తూకంలో తేడా వ‌స్తే… చ‌ద‌రంగం ఆట‌కైనా చ‌ద‌లు ప‌ట్టేస్తాయి. `చ‌క్ర‌`లోనూ చ‌ద‌రంగం ఫార్ములా ఆట ఉంది. మ‌రి ఆ ఆట ర‌స‌వ‌త్త‌రంగా సాగిందా? లేదా బోర్ కొట్టించిందా? చ‌క్ర‌లోని ద‌మ్మెంత‌?

ఆగ‌స్టు 15… హైద‌రాబాద్ మొత్తం.. సంద‌డి సంద‌డిగా ఉంటుంది. సందట్లో స‌డేమియా అన్న‌ట్టు.. ఓ ముఠా వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుంది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 50 చోట్ల దొంగ‌త‌నం జ‌రుగుతుంది. అన్ని దొంగ‌తనాల్లోనూ ఒక‌టే ఫార్ములా. ఓ ఇంట్లో `అశోక చ‌క్ర‌` ప‌త‌కాన్ని కూడా దొంగిలిస్తారు. ఈ దొంగ‌త‌నాల వెనుక ఎలాంటి ముఠా ఉంది? దాన్ని క‌థానాయ‌కుడు ఎలా ప‌ట్టుకున్నాడు? అనేదే క‌థ‌.

ట్రైల‌ర్ చూస్తే.. క‌థేమిటో అర్థ‌మైపోతుంది. దాని కోసం సినిమా అంతా చూడ‌క్క‌ర్లెద్దు. ఓ సిటీలో వ‌రుస‌గా, ఒకే స‌మ‌యంలో 50 దొంగ‌త‌నాలు చేయ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. ఇది ఇంట్ర‌స్ట్రింగ్ టేకాఫే. ఆ 50 దొంగ‌త‌నాల త‌ర‌వాత ఇంకేదో జ‌రుగుతుంద‌నుకుంటారంతా. కానీ… క‌థ అంతా ఈ 50 దొంగ‌త‌నాల చుట్టే తిరుగుతుంది. టెక్నాల‌జీని వాడుకుని దొంగ‌త‌నాలు ఎలా చేయాలో.. సైబ‌ర్ నేర‌గాళ్లు ప‌ట్టేశారు. అలాంటి క‌థ‌లు కూడా ఇది వ‌ర‌కే చాలా చూశాం. `అభిమ‌న్యుడు`లో విశాల్ డీల్ చేసిన పాయింట్ కూడా ఇదే. ఆ సినిమా బాగా ఆడింది. `చ‌క్ర‌`లోనూ సైబ‌ర్ నేర‌స్థుల్ని చూపించాల‌నుకున్నాడు. కాక‌పోతే.. ఆ పాయింట్ `అభిమ‌న్యుడు` కంటే బ‌లంగా ఉండాల్సింది. కానీ… దాని ద‌రిదాపుల్లో కూడా `చ‌క్ర‌` పాయింట్ నిల‌బ‌డ‌దు. అలాగ‌ని ఇదేదో సైబ‌ర్ క్రైమ్ నేరం కాదు. దాన్ని ఆస‌రాగా చేసుకుని చేసిన‌… దోపిడీ. అంతే. ఆ నేరంలో ప్ర‌త్య‌ర్థి తెలివితేట‌లేం ఆహా… ఓహో అనుకునే రేంజులో ఏం లేవు. సిటీలో ఒంట‌రిగా ఉన్న వృద్ధ దంప‌తుల్ని టార్గెట్ చేసి చేసిన నేరాల‌వి. అంతే. అందుకోసం `డ‌యిల్ ఫ‌ర్ హెల్ప్‌` అనే పాయింట్ ని బేస్ చేసుకోవాల్సిన ప‌నిలేదు. దోపిడీల‌కు కాస్త సాంకేతిక హంగు ఇవ్వాల‌న్న ఉద్దేశ్యం త‌ప్ప ఇంకేమీ క‌నిపించ‌దు.

అశోక చ‌క్ర ప‌త‌కం దొంగిలించ‌డం వెనుక నేప‌థ్యం ఏదో బ‌లంగా ఉంటుంది అనుకుంటారంతా. దాన్నీ తుస్ మ‌నిపించారు. అది.. రాండ‌మ్ దొంగ‌త‌నాల్లో ఒక‌టంతే. మ‌రో ముఖ్య‌మైన సంగ‌తి… హీరో.. మిల‌ట‌రీ నుంచి వ‌స్తాడు. అదేదో.. పోలీస్ శాఖ‌లో కీల‌క‌మైన పోస్ట్ అయిన‌ట్టు, పోలీసులంద‌రినీ ప‌క్క‌న పెట్టి తానే ఇన్వెస్టిగేష‌న్ చేసేస్తాడు. పోలీసు బాసులంతా.. `సార్‌.. సార్‌… అలానే చేద్దామా, ఇలానే చేద్దామా` అంటూ హీరో చెప్పే సూచ‌న‌ల్ని తు.చ త‌ప్ప‌కుండా పాటిస్తుంటారు. అదేదో.. హీరోనే పోలీస్ ఆఫీస‌ర్ గా చూపిస్తే స‌రిపోతుంది క‌దా? ఇంత డొంక తిరుగుడు ఎందుకు? పోలీస్ శాఖ‌లో ఓ ఆర్మీ ఆఫీస‌ర్ ప‌నేంటి? అని అడిగితే… ఇంత క‌థ‌కు ఆస్కారం ఉంటుందా?

విల‌న్ ఫ్లాష్ బ్యాక్ ఏదో బ‌లంగా ఉంటుంద‌నుకుంటే… అది మ‌రింత రొటీన్ గా మారిపోయింది. విల‌న్ ఎవ‌రో దొరికేశాక కూడా అరెస్ట్ చేయ‌రు. `నీకో 24 గంట‌లు టైమ్ ఇస్తున్నా.. తీసుకో. ఈలోగా పారిపో` అంటూ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తాడు హీరో. విల‌న్ ని ప‌ట్టుకునే గేమ్ ఏదో ఆస‌క్తిగా సాగుతుందేమో అనుకుంటే.. అది కేవ‌లం సినిమా నిడివి పెంచ‌డానికి త‌ప్ప దేనికీ ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని అర్థ‌మ‌వుతుంది. హీరోయిన్ ఉన్నా.. డ్యూయెట్ల జోలికి పోక‌పోవ‌డం ఒక్క‌టే మెచ్చుకోద‌గిన విష‌యం. ప‌నిలో ప‌నిగా.. అవ‌స‌ర‌మైనా, లేక‌పోయినా మ‌న రాజ‌కీయ నాయ‌కులపై, మేక్ ఇన్ ఇండియా… స్లోగ‌న్‌పై సెటైర్లు వేశారు ధైర్యంగా.

విశాల్ కి ఇది రొటీన్ పాత్రే. కండ‌లు పెంచి, బాడీ ఫిట్ గా ఉంచుకున్నాడు. మిల‌ట‌రీ ఆఫీస‌ర్‌కి త‌గ్గ‌ట్టు. సీన్ల‌న్నీ మంచి ఈజ్ తో చేశాడు. శ్ర‌ద్దా శ్రీ‌నాథ్ కి కూడా డిఫ‌రెంట్ పాత్రే. రెజీనా షాక్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కాక‌పోతే… విల‌నిజం త‌న‌కు న‌ప్ప‌ద‌న్న విష‌యం రెండో సీనుకే తేలిపోతుంది. ఓ హీరోయిన్ ని విల‌న్ స్థాయి పాత్ర‌లో చూపించాలంటే చాలా గ‌ట్స్ కావాలి. ద‌ర్శ‌కుడు అంత ధైర్యం చేశాడు గానీ, రాంగ్ ఛాయిస్‌.

యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం వ‌హించిన ఈ చిత్రంలో ఒకే ఒక్క పాట ఉంది. అందులోనూ యువ‌న్ మార్క్ ఏమీ ఉండ‌దు. ఇలాంటి క‌థ‌ల‌కు రేసీ స్క్రీన్ ప్లే, ఉత్కంఠ‌త క‌లిగించే మ‌లుపులు ఉండాలి. అవి రెండూ ఈ సినిమాలో క‌నిపించ‌వు. మైండ్ గేమ్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. గుడ్ల‌ప్ప‌గించి చూసే స‌న్నివేశాలేం ఉండ‌క‌పోగా.. `ఏదో ఒక‌టి జ‌రుగుతుందిలే.. చూద్దాం` అని ప్రేక్ష‌కుడు రిలాక్స‌యిపోయేలా స్క్రీన్ ప్లే తీర్చిదిద్దారు.

ఫినిషింగ్ ట‌చ్‌: అష్టా వ‌క్ర‌

తెలుగు360 రేటింగ్ 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close