రివ్యూ: నాంది

తెలుగు360 రేటింగ్ 2.75/5

అన్యాయం, అబ‌ద్ధం… నూటికి తొంభై తొమ్మిదిసార్లు గెల‌వొచ్చు. ఒక్క‌సారి… నిజం, నిజాయ‌తీ, న్యాయం గెలిస్తే.. వెయ్యి ఏనుగు‌ల బ‌లం వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ 99 సార్లు గెలిచిన అన్యాయం కూడా తలొంచి తీరుతుంది. అదీ… న్యాయం బ‌లం. మ‌న న్యాయ వ్య‌వ‌స్థ‌లో లోపాలుండొచ్చు. న్యాయం అంత త్వ‌ర‌గా దొరక్క‌పోవొచ్చు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ.. అన్యాయానికి నోరు, బ‌లం ఎక్కువ కావొచ్చు. కానీ.. త‌న‌దైన రోజున న్యాయం త‌ప్ప‌కుండా గెలుస్తుంది. మ‌రో గెలుపుకి `నాంది` అవుతుంది. అలాంటి క‌థే.. `నాంది`. లా గురించీ, సెక్ష‌న్ల గురించీ, అందులో లొసుగుల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. సినిమా క‌థ‌లుగా చూశాం. అయితే… అన్యాయంగా జైలు శిక్ష అనుభ‌వించిన ఓ బాధితుడు… 211 సెక్ష‌న్ రూపంలో.. త‌న‌ని త‌ప్పుడు కేసులో ఇరికించాల‌ని చూసిన‌వాళ్ల‌పై ఎలా ప్ర‌తీకారం తీర్చుకోవ‌చ్చో.. చెప్పిన క‌థ `నాంది`.

సూర్య ప్ర‌కాష్ (అల్ల‌రి న‌రేష్‌)ది సింపుల్ లైఫ్‌. అమ్మా – నాన్న‌.. ఓ మంచి ఉద్యోగం. త‌న‌కు నచ్చిన అమ్మాయే.. పెళ్లి చూపుల్లో ఎదుర‌వుతుంది. త‌న‌ని పెళ్లి చేసుకుని, అమ్మానాన్న‌ల్ని బాగా చూసుకుంటూ లైఫ్ గ‌డిపేద్దాం అనుకుంటాడు. స‌డ‌న్ గా ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. నేరం తాను చేయ‌క‌పోయినా… దారుల‌న్నీ మూసుకుపోతాయి. కోర్టు కూడా సూర్య‌ని నేర‌స్థుడిగానే ప‌రిగ‌ణిస్తుంది. ఆ కేసు వాదించ‌డానికి లాయ‌ర్లు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో… ఐదేళ్ల పాటు జైలులోనే మ‌గ్గిపోవాల్సివ‌స్తుంది. అలాంటి ప‌రిస్థితుల్లో.. ఈ కేసు వాదించ‌డానికి ఆధ్య (వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌) అనే లాయ‌ర్ వ‌స్తుంది. వ‌చ్చాక‌.. తానేం చేసింది? ఈ కేసులోంచి సూర్య ప్ర‌కాష్ ని ఎలా బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. సెక్ష‌న్ 211 ప్ర‌కారం… అస‌లైన నేర‌స్థుల్ని ఎలా శిక్షించింది? అనేదే క‌థ‌..

న్యాయ శాస్త్రాన్ని అర్థం చేసుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. చాలాసార్లు న్యాయం అంత తేలిగ్గా దొర‌క‌దు… అనిపిస్తుంది. లొసుగులు చాలా క‌నిపిస్తుంటాయి. `న్యాయం ప‌ని.. దుర్మార్గుల్ని ర‌క్షించ‌డ‌మే కాదు.. మంచివాళ్ల‌ని కాపాడ‌డం కూడా` అనే విష‌యం మాత్రం అర్థం చేసుకోవ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. ఈ సినిమాలో సెక్ష‌న్ 211 ప్ర‌కారం.. న్యాయ శాస్త్ర బ‌లం ఏమిటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. నిజానికి… కొన్ని సెక్ష‌న్ల గురించి.. ఇప్ప‌టికీ చాలామందికి అవ‌గాహ‌న లేదు. వాటి చుట్టూ న‌డిచిన కేసులు.. న్యాయ శాస్త్ర సామ‌ర్థ్యాన్ని ఎలుగెత్తి చూపించాయి. అందుకే బాలీవుడ్ లో కొన్ని సెక్ష‌న్ల చుట్టూ క‌థ‌లు న‌డిపారు. సెక్ష‌న్ అంకెనే… టైటిల్ గా మార్చి సినిమాలుగా వ‌దిలారు. కోర్టు రూమ్ డ్రామాలుగా ఆ క‌థ‌లు.. మంచి పాపులారిటీ సాధించాయి. తెలుగులో అలాంటి ప్ర‌య‌త్నం.. `నాంది`తో జ‌రిగింది.

ఈ క‌థ‌ని రెండు భాగాలుగా చూడాలి. నిర్దోషి సూర్య ప్ర‌కాష్‌ ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అనేది తొలి పాయింట్‌. బ‌య‌ట‌కొచ్చాక 211 సెక్ష‌న్ ని ఎంత స‌మ‌ర్థంగా వాడుకున్నాడు? అనేది రెండో పాయింట్. ఈ రెండింటినీ దర్శ‌కుడు చాలా బాగా డీల్ చేశాడు. సూర్య‌ని ఈ కేసులో ఇరికిస్తుంటే.. మ‌న‌సు చివుక్కుమంటుంది. అధికారం చేతిలో ఉంటే.. దాన్ని దుర్వినియోగం చేయాలి అనుకుంటే.. ఓ అమాయ‌కుడ్ని బ‌ల‌వంతంగా ఓ కేసులో ఇరికించాల‌నుకుంటే.. ఎవ‌రు ఎంత‌కి తెగిస్తారో.. చాలా స్ప‌ష్టంగా చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆయా స‌న్నివేశాలు వాస్త‌విక ధోర‌ణిలో సాగుతాయి. కోర్టు వ్య‌వ‌హారాలు, పోలీస్ స్టేష‌న్ ప‌ద్ధ‌తులు.. క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. సూర్య ఈ కేసులోంచి బ‌య‌ట ప‌డితే బాగుణ్ణు.. అని ప్రేక్ష‌కుడే ఫీల‌య్యేలా.. ఆ స‌న్నివేశాల్లో లాక్కెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. అమ్మానాన్న‌ల్ని కోల్పోయిన స‌న్నివేశం. `నువ్వు కూడా న‌న్ను చూడ్డానికి రాకు` అంటూ స్నేహితుడ్ని అడ‌గ‌డం… ఇలాంటి మూమెంట్స్ కంట‌త‌డి పెట్టిస్తాయి. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల ఫ్రేమింగ్ ప్ర‌కార‌మే సాగినా.. అందులోనూ రియ‌లస్టిక్ అప్రోచ్ కనిపిస్తుంది.

ద్వితీయార్థంలో 211 సెక్ష‌న్‌ని వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. ఒక కేసులోంచి మ‌రో కేసులోకి జంప్ అయ్యి.. అస‌లు నేర‌స్థుల్ని ప‌ట్టుకున్న విధానంలో ద‌ర్శ‌కుడు కాస్త లిబ‌ర్టీ తీసుకున్నాడ‌నిపిస్తుంది. కాక‌పోతే.. ఈ క‌థ‌ని న‌డ‌పించ‌డానికి అంత‌కంటే ఇంకో మార్గం లేదు. ద్వితీయార్థంలో… లాయ‌ర్ ఆధ్య‌నే హీరోగా క‌నిపిస్తుంది. నిజానికి ఆయా సన్నివేశాల్లో హీరోగా న‌రేష్ చేయాల్సిందేం లేదు కూడా. క‌థే.. ఈ క‌థ‌ని న‌డిపించింది. ప‌తాక సన్నివేశాలు గుండె బ‌రువెక్కించేలా చేస్తాయి. మొత్తానికి ఓ కోర్టు రూమ్ డ్రామాని, కొంత లిబ‌ర్టీ తీసుకున్నా – ద‌ర్శ‌కుడు రియ‌లిస్టిక్ పంధాలో న‌డిపించుకుంటూ వెళ్లాడు.

ఈ త‌ర‌హా క‌థ‌ల్లో… హీరో జైలు నుంచి బ‌య‌ట‌కు ఎప్పుడు వ‌స్తాడా? అని హీరోయిన్ ఎదురు చూపుల్లో గ‌డిపుతుంది. హీరో జైలు నుంచి బ‌య‌ట‌కు రాగానే.. గ‌ట్టిగా కౌగిలించుకుని, త‌న జీవితంలోకి ఆహ్వానిస్తుంటుంది. అలాంటి రొటీన్ పైత్యాల‌కు పోకుండా… హీరోయిన్ అప్ప‌టికే మ‌రోక‌రి జీవితంలోకి వెళ్లిపోయింద‌న్న విష‌యాన్ని చూపించ‌డం మెచ్చుకోద‌గిన విష‌యం అనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ మొద‌లు కాగానే.. న‌రేష్ శైలిలో కొన్ని స‌న్నివేశాలు న‌డిపి, కాస్త ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేయొచ్చు. కానీ “ఇది సీరియ‌స్ సినిమా… ” అని న‌రేష్ గ‌ట్టిగా స్టిక్ అయ్యాడు. అందుకే.. పంచ్‌లు, అన‌వ‌స‌ర‌మైన కామెడీ జోలికి పోలేదు. ల‌వ్ స్టోరీతో… అస‌లు క‌థ ట్రాక్ త‌ప్పుతుందేమో.. అనుకునేలోగానే క‌ట్ చేశాడు. రెండు పాట‌లు.. మూడ్ ని కాస్త త‌గ్గించాయి. మిగిలిన విష‌యాల్లో వంక పెట్టేందుకు ఏం లేదు.

న‌రేష్ ని కొత్త యాంగిల్ లో చూపించే సినిమా ఇది. గాలి శీను లాంటి పాత్ర‌.. న‌రేష్ ఎలాంటి న‌టుడో ఎప్పుడో నిరూపించేసింది. సూర్య ప్ర‌కాష్ కూడా ఆ జాబితాలో చేరే పాత్ర అవుతుంది. పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా న‌టించాల్సివ‌చ్చిన‌ప్పుడు.. ఆ పాత్ర‌కి గౌర‌వం ఇచ్చే ఆ రిస్క్ చేశాడు. చాలా చోట్ల‌… త‌న‌లో హీరో క‌నిపించ‌డు. ఆ పాత్రే క‌నిపిస్తుంది. కోర్టులో నిర్దోషి అని తేలాక‌.. ఇంటికి వ‌చ్చేంత వ‌ర‌కూ.. ఓ లాంగ్ షాట్ ఉంది. దాదాపు 2 నిమిషాల‌కు పైగానే ఆ షాట్ కొన‌సాగుతుంది. ఈ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించిన తీరు… అందులో న‌రేష్ స‌హ‌జ‌మైన న‌ట‌న క‌ట్టిప‌డేస్తాయి. న‌రేష్ త‌ర‌వాత‌.. అంతటి ప్రాముఖ్యం ఉన్న పాత్ర‌… వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌. ద్వితీయార్థానికి హీరో త‌నే. త‌న రా.. వాయిస్‌, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్ర‌కి ప్ల‌స్ అయ్యాయి. ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి కూడా త‌మ సిన్సియ‌ర్ ఎఫెక్ట్ పెట్టారు. తండ్రి పాత్ర‌లో దేవి ప్ర‌సాద్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది.

ఇది ద‌ర్శ‌కుడి సినిమా. తాను అనుకున్న క‌థ‌ని.. అనుకున్న‌ట్టు తెర‌పై చూపించ‌గ‌లిగాడు. చాలా చోట్ల‌.. త‌న ప‌నిత‌నం క‌నిపిస్తుంది. నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల్ని మ‌రింత ఎలివేట్ చేసింది. కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా జైలు గోడ‌ల మ‌ధ్య కొన్ని స‌న్నివేశాల్ని బాగా ఫ్రేమ్ చేశాడు. అబ్బూరి ర‌వి మాట‌లు మ‌రో ప్ల‌స్ పాయింట్. `ఈ దేశంలో అన్నీ ఫ్రీగా ఇస్తామంటారు. కానీ న్యాయం మాత్రం ఎందుకు కొనుక్కోవాలి?` అనేది ఆలోచించాల్సిన ప్ర‌శ్న‌.

ఇలాంటి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గానూ నిల‌దొక్కుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఓ మంచి పాయింట్ ని.. నిజాయ‌తీగా చెప్పే ప్ర‌య‌త్నం చేసిన ఇలాంటి క‌థ‌ల‌కు నాలుగు డ‌బ్బులొస్తే… త‌ప్ప‌కుండా మంచి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయి. ప్ర‌స్తుతానికైతే… అవార్డులు మాత్రం ఖాయం.

ఫినిషింగ్ ట‌చ్‌: న్యాయానికి ‘నాంది’

తెలుగు360 రేటింగ్ 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడీ..! సంజయ్ సిద్ధమేనా..?

కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్...

కొన్ని చోట్ల మళ్లీ మున్సిపల్ నామినేషన్లు..!

దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు,...

బాలికను పెళ్లి చేసుకుంటావా? విచారణలో రేపిస్ట్‌ను అడిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా...

జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే.. బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close