స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరిగిపోతున్నాయని వివరాలు బయటకు తెలిస్తే కేంద్రం భుజాలు తడుముకుంటోంది. అందరి కంటే ముందే ఎక్కువగా కంగారు పడి.. తూచ్.. ఆ సొమ్మంతా భారతీయులది కాదు … ఎన్నారైలది కూడా కాదు.. ఎవరో విదేశీయులదని ప్రకటించేసింది. ప్రస్తుతం భారతీయుల సంపద స్విస్ బ్యాంకుల్లో రూ. 20,700 కోట్లకు చేరుకుందని ఇంటర్నేషన్ల మీడయా ప్రకటించింది. నోట్ల రద్దు నాటికి అది రూ. 6,600 కోట్లు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మూడింతలు పెరిగింది. నిజానికి నోట్ల రద్దు నుంచి ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. అయినా స్విస్ బ్యాంకుకు మాత్రమే నిధులు పోటెత్తాయి.
స్విస్ బ్యాంకులకు .. నల్లధనానికి లంకె ఉంటుంది. ముఖ్యంగా ఇండియాలో అయితే అసలు నల్లధనాన్నే స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారన్న నమ్మకం ఉంది. అది ఎలా పుట్టిందో కానీ… అదే నిజమనేంతగా బలపడింది. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని… స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చి తలా రూ. పదిహేను లక్షలు ఇస్తామని 2014లో ఎన్నికల హామీ ఇచ్చారు నరేంద్రమోడీ. అలా తేవాలన్న లక్ష్యం ఆయనకు ఉందేమో కానీ.. అందరి చేతా జీనో బ్యాలెన్స్‌తో జన్ ధన్ అకౌంట్లను ప్రారంభింపచేశారు. తర్వాత నోట్ల రద్దు చేశారు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా.. వారికో ఆశ కల్పించారు.. అదేమిటంటే.. ఈ కష్టాలు భరిస్తే.. తర్వాత నల్లధనం మొత్తం వెనక్కి వస్తుందని.. అందులో నుంచి తలా కొంత మొత్తం ఖాతాలకు జమ అవుతుందనేది ఆ నమ్మకంసారాశం. కానీ.. బ్లాక్ మనీ బయటకు రాలేదు. బ్లాక్ మనీని పెద్దలు వైట్ చేసుకున్నారు. దాంతో కష్టాలు పేదలకు.. బ్లాక్ మనీని వైట్ చేసుకునే సుఖాలు పెద్దలకు దక్కినట్లయింది.
ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరిగాయంటే.. అదేం లేదని.. స్విస్ బ్యాంకులు ప్రకటిస్తే..కాస్త నమ్ముతారు కానీ.. బాధ్యత తీసుకుని కేంద్రం ప్రకటించింది. అంత అవసరం ఏమిటో సాధారణ ప్రజలకు అర్థం కాదు. నల్లధనం పెద్ద ఎత్తున విదేశాలకు తరలిపోయిందని… అది కేంద్రం తప్పిదమేనని అంటారని భయపడుతున్నట్లుగా ఉంది. ఏదైనా కానీ.. స్విస్ బ్యాంకులు పక్కాగా రూల్స్ పాటిస్తాయి. ఖాతాదారులకు సంబంధించి ఒక్క విషయాన్నీ వెల్లడించవు. కొన్ని నిబధనల ప్రకారం.. ఏ దేశానికి చెందిన వారు..ఎంత పెద్ద మొత్తంలో తమ దగ్గర దాచుకున్నారో మాత్రం చూచాయగా ఇతర దేశాలతో ఉన్న ఒప్పందాల మేరకు వెల్లడిస్తారు.