సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. ప్రధానితో భేటీ తర్వాత కామన్‌గా ఓ ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నారు. అందులో పోలవరం నుంచి ఎప్పుడూ చెప్పే అన్ని అంశాలు ఉంటాయి. ఆ వివరాలతో వినతి పత్రం ఇచ్చామని చెబుతారు కానీ.. అసలు ప్రధాని స్పందనేమిటి అన్నది మాత్రం ఎవరూ చెప్పరు.. ఎప్పుడూ చెప్పరు. ఆయన ఇచ్చిన వినతి పత్రాలు బుట్టదాఖలవుతున్నాయా.. కనీసం పరిశీలనకు నోచుకోవడం లేదా అన్న విషయంపైనా స్పష్టత ఉండటం లేదు. ఒక వేళ పరిశీలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ఫాలో అప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండటం లేదు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విభజన హామీలకు సంబంధించి ఫాలో అప్ బాగా ఉండేది. కేంద్రమంత్రులు కూడా ఒత్తిడికి గురయ్యేవారు. ఐదేళ్లలో అనేక సంస్థలు ప్రారంభించాల్సి వచ్చింది. కానీ గత మూడేళ్లో అలా వచ్చిన సంస్థలకు నిధఉలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినవి ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినవీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బహుశా ఖర్చు పెట్టి ఉండరని అందుకే ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ అంచనాలు ఆమోదించాలని అదే పనిగా జగన్ అడుగుతున్నారు.. కానీ కేంద్రం చేయడం లేదు.
అయితే నిజంగానే ప్రెస్ నోట్ లో రిలీజ్ చేసినవి మాత్రమే అడుగుతున్నారా అంటే.. ఎవరూ నమ్మలేకపోతున్నారు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా రాజకీయాలు మాత్రమే మాట్లాడతారని.. రాష్ట్రం కోసం ఏమైనా అవసరం అయితే.. అప్పుల్లాంటి వాటి కోసం బుగ్గన.. అధికారులు వెళ్తారని అంటున్నారు. ఇతర విషయాలయితే పూర్తిగా అధికారులే కమ్యూనికేట్ చేస్తారని అంటున్నారు. ఇక తప్పని సరిగా తాను వెళ్లాలనుకున్నప్పుడే మోదీని కలిసి.. అడుగుతారని అంటున్నారు. ఈ సారి జగన్ పర్యటన పూర్తి స్థాయిలో రాజకీయమేనని.. రాష్ట్రపతి ఎన్నికల అజెండానేనని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రచారం మాత్రం… పోలవరానికి మళ్లీ జీవం పోసినట్లుగా చేసుకుంటున్నారు.