రివ్యూ: గాండీవ‌ధారి అర్జున‌

Gaandeevadhari Arjuna movie review

రేటింగ్‌: 1.75/5

రాసిన ప్ర‌తీ క‌థా సినిమాకి ప‌ని చేయ‌దు. ఎందుకంటే సినిమా కొల‌త‌లు వేరు. అది వినోద ప్ర‌ధానం. జ‌న‌రంజ‌క‌మైన విష‌యాలే తెర‌పై క‌నిపించాలి. స‌క్సెస్ రేటు కూడా దానికే ఎక్కువ‌. అయితే కొంత‌మంది ద‌ర్శ‌కులు తాము రాసుకొన్న విష‌యాల్ని బ‌లంగా న‌మ్మి, తెర‌పై చూపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. జ‌యాప‌జ‌యాల గురించి ఆలోచించ‌రు. ప్ర‌వీణ్ స‌త్తారు ఇదే జాబితాకి చెందిన ద‌ర్శ‌కుడు. తన‌కి డీసెంట్ ఫిల్మ్ మేక‌ర్ అనే పేరుంది. స్టైలీష్ మేకింగ్ పై శ్ర‌ద్ద పెట్టే ప్ర‌వీణ్‌.. దాన్ని గ‌ట్టిగా డిమాండ్ చేసే ఓ యాక్ష‌న్ డ్రామాని ఎంచుకొన్నాడు. అదే.. ‘గాండీవ‌ధారి అర్జున‌’. వ‌రుణ్ తేజ్ హీరో అవ్వ‌డం, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో ఏదో విష‌యం ఉంద‌న్న `భ్ర‌మ‌` క‌ల‌గ‌డంతో ఈ సినిమాపై దృష్టి పెట్టారంతా. మ‌రి… ఈ అర్జునుడు ఎలా ఉన్నాడు? ఏమా క‌థ‌..?

లండ‌న్‌లో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. అక్క‌డ ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మిట్ జ‌రుగుతుంటుంది. భార‌త‌దేశం త‌ర‌పున కేంద్ర మంత్రి ఆదిత్య రాయ్ (నాజ‌ర్) హాజ‌ర‌వ్వాలి. కానీ లండ‌న్‌లో ఆదిత్య‌ ప్రాణాల‌కు ముప్పు ఉంది. అందుకే బాడీ గార్డ్ గా అర్జున్ (వ‌రుణ్‌తేజ్‌) వ‌స్తాడు. ఆదిత్య రాయ్‌ స‌మిట్‌లో పాల్గొని, తిరిగి ఇండియా వెళ్లిపోయేలోగా వారం రోజుల పాటు.. ఆదిత్య‌ని రక్షించే బాధ్య‌త స్వీక‌రిస్తాడు. అస‌లింత‌కీ… ఆదిత్య‌రాయ్‌కి ఎవ‌రితో ముప్పు ఉంది? స‌మిట్ లో ఆదిత్య రాయ్ ప్ర‌స్తావించే విష‌యం ఏమిటి? అనేది మిగిలిన క‌థ‌.

”ప్ర‌పంచానికి ప‌ట్టిన అతి పెద్ద కాన్స‌ర్… మ‌నిషే”. ఈ సినిమాలోని నాజ‌ర్ డైలాగ్ ఇది. ఆ కాన్స‌ర్ ఎంత భ‌యంక‌రంగా ఉంటుంది? ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించ‌క‌పోతే, ఎన్ని అన‌ర్థాలు వ‌స్తాయి? వాటి వ‌ల్ల ఏం జ‌రగ‌బోతోంది? పేద దేశాల్ని, అగ్ర రాజ్యాలు ఎలా డంప్ యార్డులుగా వాడుకొంటున్నాయి..? ఈ విష‌యాల్ని తెర‌పై చూపించే ప్ర‌య‌త్నం చేశారు. మేట‌ర్ వ‌ర‌కూ సీరియ‌స్సే. కాక‌పోతే.. దాన్ని చూపించే విధానంలోనే సిన్సియారిటీ లోపించింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్లు.. సీట్ ఎడ్జ్ అనుభూతి క‌లిగించాలి. అది… `అర్జున‌`లో మిస్ అయ్యింది. తెర‌పై ఏదో జ‌రుగుతూపోతుంటుంది త‌ప్ప‌.. వాటికి ప్రేక్ష‌కుడు రియాక్ట్ అవ్వ‌లేడు. కేంద్ర‌మంత్రి ప్రాణానికి మ‌రో దేశంలో ముప్పు ఉందంటే.. అది చాలా పెద్ద విష‌యం. లండ‌న్ ప్ర‌భుత్వ‌మే ర‌క్ష‌ణ ఇవ్వాల్సిన విష‌యం అది. దాని కోసం ప్రైవేటు ఏజెన్సీపై ఆధార‌ప‌డ‌డం ఏమిటో అర్థం కాదు. పోనీ.. హీరోకి ఈ క‌థ‌లో స్పేస్ ఇవ్వాలి కాబ‌ట్టి త‌ప్ప‌దు అనుకొందాం. కానీ లాజిక్కుకు అంద‌ని చాలా విష‌యాలు తెర‌పై జ‌రిగిపోతుంటాయి. మంత్రికి కాలుష్యానికి సంబంధించిన కీల‌క ఆధారాలు ఇవ్వాల‌ని ఓ అమ్మాయి ప్రాణాల‌కు తెగించి ప‌రిత‌పిస్తుంటుంది. ఈరోజుల్లో.. వీడియో ఫుటేజ్ ఫార్వ‌డ్ చేయ‌డానికి కొన్ని సెక‌న్లు చాలు. వాట్స‌ప్‌, ఈమెయిల్ అందుబాటులోనే ఉన్నాయి. అందుకోసం లండ‌న్ వీధుల వెంట ప‌రుగులు పెట్ట‌డం ఏమిటో అర్థం కాదు. ఆ ఫుటేజీలో కొంపలు కొల్లేర‌యిపోయే అంశాలూ ఏం ఉండ‌వు. తీరా చూస్తే అదో డాక్యుమెంట‌రీ అంతే. దాంతో కొండ‌ని త‌వ్వి, ఎలుక‌ని ప‌ట్టిన‌ట్టైంది.

ప్ర‌తీ క‌థ‌లోనూ హీరో, హీరోయిన్లు ఉంటారు కాబ‌ట్టి, వాళ్ల మ‌ధ్య కొన్ని సీన్లు ఉండాలి కాబ‌ట్టి, వ‌రుణ్ – సాక్షి వైద్య‌ల‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అది ఏమంత ఆసక్తిగా ఉండ‌దు. కేవ‌లం అపార్థం చుట్టూ ఆ ఫ్లాష్‌బ్యాక్ న‌డిపారు. దాని వ‌ల్ల సినిమాని మ‌రో 20 నిమిషాలు సాగ‌దీయ‌డం త‌ప్ప‌, పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఏం లేదు. హీరో మ‌ద‌ర్ సెంటిమెంట్ వ‌ల్ల కూడా ఒన‌గూరిందేం లేదు. స‌మ‌స్య‌ని హీరోకి స‌ర్స‌న‌లైజ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఓ సోల్జ‌ర్ కాబ‌ట్టి, దేశ స‌మ‌స్య‌ని భుజాన వేసుకోవ‌డంలో అభ్యంత‌రం ఎవ‌రికి ఉంటుంది?

విన‌య్ రాయ్ ఈ సినిమాలో విల‌నా, అతిథి పాత్ర చేస్తున్నాడా అనేది అర్థం కాదు. సినిమా మొద‌లైన‌ప్పుడు ఓసారి.. ప్రైవేటు జెట్ లో పైలెట్‌గా చూపించారు. అది ఇంట్ర‌వెల్ స‌మ‌యానికి కానీ లాండ్ అవ్వ‌దు. ఆ త‌ర‌వాత కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌స్తూ, పోతూ ఉంటాడు. హీరోతో ఇంట్రాక్ష‌నే క‌నిపించ‌దు. చివ‌రి ఫైట్ లో త‌ప్ప‌. ఓ కేంద్ర మంత్రిని లండ‌న్‌లో ఒక‌డు భ‌య‌పెడుతున్నాడంటే, వాడెంత బ‌ల‌వంతుడ‌వ్వాలి? అత‌న్నుంచి వ‌చ్చే ముప్పు ఎలాంటిదై ఉండాలి..? ఆ టెన్ష‌న్, ఇంటెన్ష‌న్ ఏమీ తెర‌పై క‌నిపించ‌వు. క్లైమాక్స్ కూడా సాగ‌దీత వ్య‌వ‌హార‌మే. స‌మిట్ లో నాజ‌ర్ స్పీచు సుదీర్ఘంగా సాగుతుంటుంది. మ‌రోవైపు హీరో ఫైట్ చేస్తుంటాడు. ఇవి రెండూ ఎప్పుడు అయిపోతాయా? అని థియేట‌ర్లో ప్రేక్ష‌కుడు కాచుకొని కూర్చోవ‌డం త‌ప్ప‌.. వాటిపై కూసింత ఆసక్తి కూడా క‌ల‌గ‌దు.

వ‌రుణ్ క‌థ‌ల ఎంపిక బాగుంటుంది. కానీ ప్ర‌వీణ్ ఏం చెప్పాడో కానీ, ఈసారి తేలిగ్గా ఊ కొట్టేశాడు. స్టైలీష్ యాక్ష‌న్ సినిమా చేయాల‌న్న కోరిక‌.. వ‌రుణ్‌కి ఈ సినిమాతో తీరి ఉంటుంది. కానీ.. త‌న‌లోని న‌టుడికి ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వ‌ని పాత్ర ఇది. క్యారెక్ట‌ర్‌లోనూ వేరియేష‌న్స్ పెద్ద‌గా క‌నిపించ‌వు. క్లైమాక్స్ లో పెన్ డ్రైవ్ ప‌ట్టుకొని అటూ ఇటూ తిర‌గ‌డం, ఫ‌స్టాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ మిన‌హాయిస్తే హీరోయిన్ గా సాక్షి వైద్య కూడా చేసిందేం లేదు. కానీ త‌న డ్ర‌స్సింగ్ స్టైల్ బాగుంది. విన‌య్ రాయ్ పాత్ర‌నీ సరిగా డిజైన్ చేయ‌లేదు. నాజ‌ర్ కి ఓ కూతురు (విమ‌లారామ‌న్‌), ఆమెకు ఓ కూతురు, ఆ కూతురి కిడ్నాప్ ఇవ‌న్నీ.. క‌థ‌లో బ‌ల‌వంతంగా ఇరికించిన విష‌యాల్లా అనిపిస్తాయి.

మిక్కీకి పాట‌లు చేసే అవ‌కాశం ఇవ్వ‌ని సినిమా ఇది. ఒకే ఒక్క పాటకి ఛాన్స్ ఉంది. అక్క‌డ కూడా మిక్కీ మార్కేం క‌నిపించ‌దు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా మెరుపులేం లేవు. సినిమా అంతా లండ‌న్‌లో జ‌రుగుతుంది. కాబ‌ట్టి.. అక్క‌డి లొకేషన్ల‌తో రిచ్ లుక్ వ‌చ్చింది. కెమెరా వ‌ర్క్ డీసెంట్ గా ఉంది. ప్ర‌వీణ్ స‌త్తారు క‌థ‌కుడిగా విఫ‌ల‌మైన సినిమా ఇది. ఓ సీరియ‌స్ స‌బ్జెక్ట్ కి అత్యంత బోరింగ్ గా చెప్పాడు.

‘మీ చెత్త మీ ద‌గ్గ‌రే ఉంచుకోండి’ అనే డైలాగ్ ఈ సినిమాలో ఉంది. కొన్ని క‌థ‌లు కూడా ద‌ర్శ‌కులు త‌మ ద‌గ్గ‌రే ఉంచుకోవ‌డం మేలు. ప్రేక్ష‌కుల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ఇచ్చిన‌వాళ్ల‌వుతారు. అది కూడా ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డం లాంటిదే.

రేటింగ్‌: 1.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close