రాబోయే 6 నుండి 12 నెలల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగం పూర్తిగా మారిపోతుందని, ప్రస్తుతం మనం చూస్తున్న కోడింగ్ పద్ధతులు దాదాపు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ప్రకటించారు. ఈ ఆంత్రోపిక్ ఇప్పుడు సాఫ్ట్ వేర్ కోడింగ్ ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. AI మోడల్స్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయంటే, మనుషులు నెలల తరబడి చేసే కోడింగ్ పనులను ఇవి కేవలం నిమిషాల్లో పూర్తి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఈ ఆంత్రోపిక్ ఆ పనులు చేస్తోంది.
నెలల తరబడి సాఫ్ట్వేర్ ఇంజినీర్లు చేసే పనిని నిమిషాల్లో చేస్తున్న ఆంత్రోపిక్ ఏఐ మోడల్స్
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌కు ముప్పు పొంచి ఉందనడానికి ప్రధాన కారణం ఆంత్రోపిక్ AI మోడల్స్ కోడింగ్‌లో చూపిస్తున్న అసాధారణ నైపుణ్యం. గతంలో AI కేవలం చిన్న చిన్న కోడ్ స్నిప్పెట్స్ మాత్రమే ఇచ్చేది. కానీ ఇప్పుడు సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్‌ను నిర్మించడం, బగ్స్‌ను గుర్తించి సరిచేయడం , ఒక ప్రోగ్రామింగ్ భాష నుండి మరొక భాషలోకి కోడ్‌ను మార్చడం వంటి పనులను ఇవి అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్నాయి. దీనివల్ల ప్రాథమిక స్థాయి కోడర్ల అవసరం గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.
ఏఐ ప్రాంప్ట్‌లు ఇచ్చే టాలెంట్ ఉన్న వారికే ఉద్యోగాలు
అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తిగా అంతరించిపోతుందని అర్థం కాదని.. దాని రూపం మారుతుందని దిగ్గజ కంపెనీల నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంజనీర్లు కోడ్ రాయడం కంటే, AI రూపొందించిన కోడ్‌ను రివ్యూ చేయడం, సమస్యలను విశ్లేషించడం , ప్రాజెక్ట్ డిజైన్‌పై దృష్టి పెట్టడం వంటి పనులకే పరిమితం కావచ్చు. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థానంలో ఒక AI ఆర్కెస్ట్రేటర్ లేదా ప్రాంప్ట్ ఇంజనీర్ ఉద్యోగాలు క్రియేటయ్యే అవకాశం ఉంది. కేవలం సింటాక్స్ నేర్చుకున్న కోడర్ల కంటే, లాజికల్ థింకింగ్ ఉన్నవారికి మాత్రమే డిమాండ్ ఉంటుంది.
సాఫ్ట్వేర్ రంగంలో ఎన్నో మార్పులు !
ఈ మార్పు వల్ల కంపెనీలకు ఖర్చులు తగ్గి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వేగం విపరీతంగా పెరుగుతుంది. ఒకప్పుడు ఒక యాప్ తయారు చేయడానికి 10 మంది ఇంజనీర్లు అవసరమైతే, భవిష్యత్తులో ఒక్క ఇంజనీర్ AI సహాయంతో అదే పనిని పూర్తి చేయగలడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రంగం ఒక భారీ పరిణామ క్రమంలో ఉంది. ఆంత్రోపిక్ సీఈఓ చెప్పినట్లు 12 నెలల్లోనే అంతా మారిపోతుందా అనేది చర్చనీయాంశమే అయినా, మార్పు మాత్రం అనివార్యం. రాబోయే కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కేవలం టూల్ యూజర్స్ లా కాకుండా, AIని సమర్థవంతంగా వాడుకోగలిగే డొమైన్ ఎక్స్పర్ట్స్ గా తమను తాము మలచుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
