రాజకీయంగా ఇద్దరిమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనొచ్చు. పాము-ముంగీస తంతులా ఉండొచ్చు. కానీ, ఒక విషయంలో మాత్రం చంద్రబాబుకు జగన్ గురువనే చెప్పొచ్చు. వినడానికి ఇది ఆశ్చర్యకరంగానే అనిపించినా ఇందులో వాస్తవం లేకపోలేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వమూ, శాశ్వత శత్రుత్వమూ ఉండవని నమ్మేపక్షంలో చంద్రబాబుకి ఒకానొక విషయంలో జగన్ గురువు అని చెబితే కొట్టిపారేయడానికి ఏమాత్రమూ వీలులేదు. జగన్ రాజకీయంగా శత్రువేకావచ్చు, కానీ ఆయన అనుసరించే ఒకానొక వ్యూహం చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంటే, దాన్నే తాను అనుసరించాలనుకోవడం తప్పుకాదుగా…. చంద్రబాబు సరిగా అలాగే అనుసరిస్తున్నట్టు ఆయన రాజకీయ ప్రవర్తనలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులు చెప్పకనే చెబుతున్నాయి. ఇంతకీ జగన్ నుంచి చంద్రబాబు అందిపుచ్చుకున్న (ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగానైనా) ఆ బలమైన ఆయుధం ఏమిటి?
ఎమోషనల్ గురువు
సార్వత్రిక ఎన్నికల ముందునుంచీ, ఇప్పటివరకు చంద్రబాబు చేసిన, చేస్తున్న పనులను నిశితంగా గమనిస్తే, ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చినట్టు ఎవరైనా అంగీకరిస్తారు. ఈమధ్య ఆ మార్పు చాలా స్పష్టంగానే కనబడుతుందని కూడా ఒప్పుకుంటారు.
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడి ఉండాలని నమ్మే నాయకుల్లో చంద్రబాబు ఒకరు. అందుకుతగ్గట్టుగానే కొత్తదనం కోసం అన్వేషిస్తుంటారు. ఈ లక్షణం లేకపోతే చంద్రబాబు దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీని ఒంటిచేత్తో నడపలేరు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేయడంలో ఆయన ఆరితేరినవాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయనలో వచ్చిన మార్పు భావోద్వేగాలకు సంబంధించినది. ప్రజల ఎమోషన్స్ ని రాజకీయలబ్దికి ఉపయోగించుకోవడంద్వారా తనకూ, తన పార్టీకి మేలు చేస్తుందన్న పాలసీని ఈమధ్యకాలంలో బాబు సంపూర్ణంగా అర్థంచేసుకున్నారనే అనుకోవాలి. ఈవిషయంలో ఆయనకు మానసిక గురువు జగన్! వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా దీన్ని కొట్టిపారేయలేం. గత కొద్దిసంవత్సరాలుగా జగన్ తన భావోద్వేగ ప్రచారంతో తనచుట్టూ ఒక బలిష్టమైన రాజకీయ కంచుకోట నిర్మించుకోవడమేకాకుండా, తన పార్టీని సైతం బలోపేతం చేయగలిగారన్నది వాస్తవకోణం. రాష్ట్రవిభజన అనంతరం పోటాపోటీగా సీట్లు సంపాదించుకునే విషయంలో జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫార్ములానే అక్కరకు వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల భావన. దీంతో జగన్ తనపార్టీ ని బలమైన ప్రతిపక్షంగా నిలబెట్టగలిగారు. ఈ వ్యూహాలతీరుతెన్నులను గమనిస్తున్న చంద్రబాబు తన నూతన వ్యూహాలకు మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారనే అనిపిస్తోంది.
ఓదార్పులో బాబు
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అనూహ్యంగా తలెత్తిన సవాళ్లను (గ్యాస్ పైపు లైన్ లీకేజీ, హుద్ హుద్ తుపాను, పుష్కరంలో తొక్కిసలాటవంటి సవాళ్లను) సమర్ధవంతంగా ఎదుర్కున్నారు. ఎన్నికలకు ముందుకూడా ఆయన `మీకోసం’ అంటూ యాత్రలు చేసి ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీటన్నింటిలోనూ బాధితులను ఓదార్చడం, వారికి అండగా ఉంటానంటూ నిలబడటం గమనార్హం. పాలనాపగ్గాలు అందుకున్నతర్వాత ప్రజలమధ్యతిరిగే అలవాటు మనదేశ నాయకుల్లో చాలాతక్కువగానే కనిపిస్తుంటుంది. అలాంటిది, అందుకుభిన్నంగా చంద్రబాబు ఈసారి ఎన్నికైన తర్వాత సమస్య ఏ రూపంలో తలెత్తినా వెంటనే అక్కడకు వెళ్ళి ఆ సమస్యపూర్తిగా పరిష్కారమయ్యేవరకు అక్కడేఉండటం ఆయనలో వచ్చిన మార్పుకు సంకేతంగా చెప్పుకోవచ్చు.
నాయకుడనేవాడు ముందునిలబడి పోరాడాలేకానీ, వెనుకనిల్చుని ఆజ్ఞాపించడంకాదన్న సూత్రాన్ని అక్షరాలా పాటిస్తున్నారు చంద్రబాబు. ఈ తరహాపాలన రాజకీయంగా అక్కరకు వస్తుందన్నది ఆయన ఆలోచన.
బాధితుల దగ్గరకు వెళ్లడం, వారిని ఓదార్చడం, అవసరమైన సాయం చేయడం ద్వారా ఎంతటి రాజకీయ లబ్దిపొందవచ్చునో ప్రధానప్రతిపక్షనేత జగన్ చూసి ఎవరైనా తెలుసుకోవచ్చు. బాబు ప్రస్తుతం ఆపనిలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. దీన్ని అనుసరించడంలో నూటికినూరుమార్కులు కొట్టేయాలని బాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి.
మతానికి పెద్దపీట
మతపరమైన పెద్ద పండుగగా చెప్పుకునే గోదావరి పుష్కరాలు రావడంతో ఆయన ఆలోచనలు అటువైపు కూడా తిరిగాయి. మొదటినుంచీ మతానికి పెద్దపీట వెయ్యని బాబు ఈసారి అందుకు భిన్నంగా ఉన్నతాసనాన్నే ప్రతిష్ఠించారు. మహాపుష్కరాలను అద్భుతంగా నిర్వహించి మతపరమైన ప్లస్ పాయింట్స్ కొట్టేయాలని అనుకున్నారు. కానీ అంతలో తొక్కిసలాట సంఘటన చోటుచేసుకుంది. అయినా చెక్కుచెదరకుండా తాను అనుసరించదలచుకున్న వ్యూహాన్ని అమలుపరిచారు. రాజమండ్రినే స్థావరంగా చేసుకుని పాలనసాగించారు. చివరకు నూతన రాజధాని మాస్టర్ ప్లాన్ పట్టుకొచ్చిన సింగపూర్ ప్రతినిధులను రాజమండ్రికే రప్పించుకుని పాలనా వ్యవహారాలు నడిపించారు.
గోదావరి పుష్కరాలు తర్వాత కృష్ణాపుష్కరాలు వచ్చేస్తున్నాయి. ఈ పెద్ద పండుగల ద్వారా మెజారిటీ ప్రజలమనస్సులను గెలుచుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. జగన్ ఒక వర్గంవారిని దగ్గరకు తీసుకుంటుంటే, అంతకంటే బలమైన వర్గానికి తాను దగ్గరవ్వడంలో తప్పేముందన్నది బాబు ఆలోచన. పైగా, క్రిందటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మైనార్టీ ఓట్లమీద ఆధారపడకుండా కేవలం హిందూఓట్లతోనే మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం బాబును ఆలోచనలో పడేసింది. ఇటు జగన్, అటు బిజేపీలు అనసరిస్తున్న మతపరమైన రాజకీయ వ్యూహాన్ని తానుకూడా అందిపుచ్చుకుని రాజకీయ కంచుకోట నిర్మించుకోవాలని తపనపడతున్నారు. అంతాసవ్యంగా జరిగితే, ఇటు మెజారిటీ ప్రజల మనోభావాలను గెలుచుకోవడంతోపాటు, అటు నూతన రాజధాని నిర్మాణం పూర్తిచేయడంతో ఎదురులేని నాయకునిగా ఎదగాలన్నదే బాబుఆలోచన.
ఈ మొత్తం వ్యవహారంలో బాబుమనసులో అంతర్లీనంగా జగన్ ఆలోచనలు వెంటాడుతున్నాయన్నదే పొలిటికల్ ట్విస్ట్.
– కణ్వస
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                