టాప్ 2 ప్రపంచ అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం బంగారాన్ని ఎక్కడికో తీసుకెళ్తోంది. ట్రంప్, జిన్ పింగ్ సుంకాల యుద్ధం చేసుకుంటూ ఎక్కడ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తారోనన్న భయంతో అందరూ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. బుధవారం పది గ్రామల మేలిమి బంగారం ధర 98వేలకు చేరింది. ఈ వారాంతంలోనే లక్ష మార్క్ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండి ధరలు కూడా అంతే పరుగులు పెడుతున్నాయి.
బంగారం ధర భారీగా తగ్గుతుందని ఇటీవల కొంత మంది విశ్లేషకులు అంచనా వేశారు. కానీ బంగారం విషయంలో తగ్గుదల అనేదే ఉండదని తాజాగా నిరూపితమయింది. లక్షకు చేరుకుంటే.. బంగారం లగ్జరీ వస్తువుగా మారినట్లే. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి కానీ అమ్మకాలు పెరగడం లేదు. బ్యాంకులు, ప్రభుత్వాలు వంటి పెద్ద పెద్ద వ్యవస్థలు మాత్రమే బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. సామాన్యులు మాత్రం బంగారం అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.
భారతీయులకు బంగారం అంటే ఓ సెంటిమెంట్. ప్రతి శుభకార్యానికి ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం కామన్. కానీ ఇప్పుడు అందరూ బంగారాన్నిపెట్టుబడిగా చూసుకుని.. రోల్డ్ గోల్డ్ నగలు ధరించాల్సిన పరిస్థితికి వచ్చేలా ఉంది.