Arjun Son Of Vyjayanthi Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
మాస్, కమర్షియల్ సినిమాలు సేఫ్ ఫార్ములా అని నమ్ముతుంటారు చాలామంది. హీరోయిజం, కొంత యాక్షన్, ఇంకొంత ఎమోషన్ ఉంటే గట్టెక్కేయొచ్చు, మినిమం గ్యారెంటీ ఉంటుందన్న భరోసా ఇప్పటికీ వుంది. ప్రయోగాలు చేయకుండా, ఫ్యాన్స్ కి కావాల్సింది ఇచ్చేస్తే ఓ పనైపోతుందని హీరోలూ నమ్ముతుంటారు. అందుకే మనకు యాక్షన్ సినిమాలు విరివిగా వస్తుంటాయి. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ కూడా ఇదే ఫార్ములాలో తయారైన సినిమా. కల్యాణ్ రామ్ ఇమేజ్‌కు తగ్గట్టు, తన బలాల్ని దృష్టిలో పెట్టుకొని రాసుకొన్న స్క్రిప్ట్ ఇది. అయితే ఆ బలం తెరపై ఎంత గొప్పగా ప్రజెంట్ చేశారు? బలహీనతల్ని దాచగలిగారా? విజయశాంతి ఇమేజ్‌కూ, ఆమె స్థాయికి తగిన పాత్ర ఇందులో దక్కిందా? అసలింతకీ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’లో ఏముంది?
వైజయంతీ (విజయశాంతి) అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తనయుడు అర్జున్ (కల్యాణ్ రామ్). కొడుక్కి తల్లంటే ప్రాణం. తన కోసం ఏమైనా చేస్తాడు. కొడుకుని ఐపీఎస్‌గా చూడాలన్నది తల్లి తపన. అందుకోసం అర్జున్ సమాయాత్తం అవుతాడు కూడా. అయితే అనుకోని పరిస్థితుల్లో అర్జున్ క్రిమినల్ గా మారాల్సివస్తుంది. వైజాగ్‌లో సమాంతరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తన కను సైగలతో విశాఖ నగరాన్ని శాసిస్తుంటాడు. వైజయంతీకి పఠాన్ (సోహైల్ ఖాన్) అనే ముంబై గ్యాంగ్ స్టర్ ముప్పు ఏర్పడుతుంది. దాన్నుంచి తల్లిని అర్జున్ ఎలా కాపాడుకొన్నాడు? అసలు వైజయంతీకి, పఠాన్‌కీ ఉన్న వైరం ఏమిటి? ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కడుపున క్రిమినల్ ఎలా పుట్టాడు? అనే విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పూర్తిగా యాక్షన్, మసాలా దట్టించిన సినిమా ఇది. కల్యాణ్ రామ్ ఇమేజ్‌కు, ఆయన బాడీ లాంగ్వేజ్కూ తగిన కథ రాసుకొన్నాడు దర్శకుడు. ఎంత కమర్షియల్ సినిమా అయినా ఏదో ఓ కోణంలో కొత్తదనం ఆశిస్తాడు ప్రేక్షకుడు. అయితే అది ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. అలాగని బోర్ కూడా కొట్టదు. హీరో మాస్ ఎలివేషన్లు, ఎమోషన్, యాక్షన్ సీన్స్‌తో.. కాలక్షేపం చేయించేశాడు దర్శకుడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ని బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ ఫైట్‌లో… యాక్షన్ కంటే, హీరోకు ఇచ్చిన ఎలివేషన్లే బాగున్నాయి. మాస్‌కి అది సరిపోతుందిలే అనుకొంటే.. చేసేదేం లేదు. తల్లీకొడుకుల ఎమోషన్‌కి పెద్ద పీట వేశారు. రొటీన్ మాస్ కథకు ఈ ఎమోషన్ కాస్త ఊతాన్ని అందించింది. తన తల్లికి ముప్పు ఉందని అర్జున్ గ్రహించడం, విలన్‌కి సవాల్ విసరడంతో… ఇంట్రవెల్ కార్డు పడుతుంది. ఫస్టాఫ్‌లో చెప్పుకోదగ్గ మెరుపులేం లేవు కానీ, టికెట్ రేటు గిట్టుబాటు కావడానికి కావల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటితో సర్దుకుపోవాల్సిందే.
సెకండాఫ్‌లో అసలు అర్జున్ ఇలా ఎందుకు మారాడన్న విషయంలోకి వెళ్లారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ వ్యవహారమే. దర్శకుడు చేసిన మంచి పని.. తాను చెప్పదలచుకొన్న కథ పైనే ఫోకస్ పెట్టడం. హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఏమీ పెట్టకుండా మంచి పని చేశాడు. లేదంటే కథకు అది అడ్డు కట్ట వేస్తుండేది. రొమాన్స్, ఫన్.. ఇవి మచ్చుకైనా కనిపించవు. ఈ కథని ఒకే టోన్‌లో చెప్పాలనుకొన్నాడు దర్శకుడు. ఆ విషయంలో అభినందించాల్సిందే. క్లైమాక్స్ గురించి ముందు నుంచీ గొప్పగా చెబుతూ వచ్చారు. ఎన్టీఆర్ సైతం ఈ సినిమాలో క్లైమాక్స్ నెక్ట్స్ లెవల్ అనే సరికి.. ‘ఏమై ఉంటుందా’ అనే ఉత్సుకత మొదలవుతుంది. సెకండాఫ్ మొదలైన దగ్గర్నుంచే సగటు ప్రేక్షకుడు క్లైమాక్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. చెప్పినట్టే క్లైమాక్స్ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉన్న భారీ ఎపిసోడ్ ఇది. ఇంత సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ ఈమధ్య కాలంలో చూడడం ఇదే తొలిసారి. ‘ఏంట్రా.. ఇంత సాగదీస్తున్నారు’ అనే ఫీలింగ్ మాస్ ప్రేక్షకుడికి సైతం కలుగుతుంది. సీన్లు తరవాత సీన్లు వెళ్తుంటాయి. ‘ఇక చూడడం మనవల్ల కాదు’ అనేసరికి ఓ షాకింగ్ షాట్ వేస్తాడు దర్శకుడు. అది కాస్త హై ఇచ్చింది. బహుశా.. ఈ ఎమోషన్ గురించే ఎన్టీఆర్ గట్టిగా చెప్పి ఉంటాడు. ఓ మాస్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి షాట్ ఊహించడం కష్టం. అదే ఎక్కువ పే ఆఫ్ అవుతుందని చిత్రబృందం నమ్మి ఉంటుంది.
సోహైల్ ఖాన్ ఎంట్రీ చాలా బీభత్సంగా ఉంటుంది. అంత విలన్ ని పెట్టుకొని, అతన్ని క్లైమాక్స్ వరకూ దాచేయడం అన్యాయం. విలన్ స్టార్ అయితే సరిపోదు. క్యారెక్టరైజేషన్ కూడా బలంగా ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అంచనాలకు తగ్గట్టుగా ఈ పాత్రని రాయలేకపోయాడు. క్లైమాక్స్‌కి ముందు ఓ ట్విస్టు కూడా ఉంది. అది కూడా రొటీన్‌గానే అనిపించింది. ఆ ట్విస్టు రివీల్ చేసిన విధానం చాలా చప్పగా, ఇన్ లాజిక్‌గా అనిపిస్తుంది.
కల్యాణ్ రామ్‌కి ఇది టేలర్ మేడ్ పాత్ర. కొత్తగా చేయడానికి ఏం లేదు. తన బలాల్ని మరోసారి ప్రదర్శించడం తప్ప. ఉన్నంతలో తన పాత్రని పండించాడు. విజయశాంతి ఇమేజ్‌కి తగిన క్యారెక్టర్ పడింది. తన అనుభవం చూపించారామె. ఫృథ్వీది చెప్పుకోదగిన పాత్ర. నమ్మిన బంటులా హీరోని కాపాడే పాత్రలో కనిపించాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌కి తక్కువ, సైడ్ యాక్టర్‌కి ఎక్కువ అనే టైపు. శ్రీకాంత్ కూడా బాగా చేశాడు. తనది ముఖ్యమైన పాత్రే. సోహైల్ ఖాన్ క్యారెక్టరైజేషన్ బలంగా లేదు. అలాంటి విలన్ ని పెట్టుకొని హీరో క్లైమాక్స్ వరకూ వీధి రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. దాంతో ఇంపాక్ట్ రాలేదు.
టెక్నికల్ గా సినిమాకు యావరేజ్ మార్కులే పడతాయి. అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది కానీ, పాటలు చాలా వీక్. ఈ సినిమాలో పాటలకు ఛాన్స్ తక్కువ. ఉన్నా.. పెద్దగా ఆకట్టుకోవు. బ్యాక్ గ్రౌండ్లో వచ్చే పాట కూడా సో..సోగా వుంది. మాటలు ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా హీరో ఎలివేషన్స్ సమయంలో వచ్చిన డైలాగులు బాగున్నాయి. ”భూమికి రక్తానికీ ఏదో సంబంధం ఉంది. రక్తం ఇంకనిదే భూమి చేతులు మారదు. చరిత్రలో యుద్ధాలన్నీ ఇలానే జరిగాయి” లాంటి మంచి డైలాగులు కొన్ని వినిపించాయి. దర్శకుడు ప్రదీప్‌కు మాస్, యాక్షన్ పల్స్ తెలుసు. తనకు ఇది రెండో సినిమా మాత్రమే. మంచి కథలు రాసుకొని, టెక్నికల్ టీమ్ సపోర్ట్ దొరికితే మంచి దర్శకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ ఓ రెగ్యులర్ మాస్ యాక్షన్ సినిమా. అంతే. మాస్‌కి నచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. కొత్తగా ఏదో చూడాలి, అవుటాఫ్ ది బాక్స్ కథలు కావాలి అనుకొనేవాళ్లకు ఇది సరైన ఆప్షన్ కాకపోవొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.75/5