తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. నిర్మాణాత్మకంగా విమర్శలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చాలా సరంజామా ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒక రోజు ఆలస్యంగా స్పందించింది. హరీష్ రావు ప్రెస్మీట్ పెట్టారు. కానీ అప్పటికే రైజింగ్ సమ్మిట్ హడావుడి పెరగడంతో ఏ మీడియా పట్టించుకోలేదు. సోషల్ మీడియా హడావుడి చేయలేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా అంతంతమాత్రనే ప్రచారం కల్పించింది. వారు వేరే మిషన్ లో ఉన్నారు. అదేమిటంటే.. ఏదైనా వంద కోట్ల స్కామ్ అని ప్రచారం చేయడంలో మునిగిపోయి ఉన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సును ఫ్యూచర్ సిటీని ప్రమోట్ చేయడానికి అక్కడే ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే పెద్ద తప్పు అయినట్లుగా.. అక్కడ వంద కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు ప్రారంభించారు. ఎందుకంటే అక్కడ టెంట్లు వేయడానికి.. ఇతర ఏర్పాట్లకు వంద కోట్లు బడ్జెట్ కేటాయించారని.. అదే హైటెక్స్ లో చేసి ఉంటే పది కోట్లతో అయిపోయి ఉండేదని లెక్కలేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఈ వంద కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబుల్లో కివెళ్తున్నాయని ప్రకటించేశారు. ఇక్కడ వంద కోట్లు ఖర్చు పెట్టారన్నదానికి..ఆ పనులు ఆంధ్రా కంపెనీలే చేశాయన్నదానికి కనీసం బేస్ లేదు.
ఇది ఒక్కటే కాదు.. పదమూడో తేదీన సాకర్ దిగ్గజం మెస్సీ ఇండియాకు వస్తున్నారు. ఆ రోజున హైదరాబాద్ లో ఓ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ నిర్వహణకూ తెలంగాణ ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టేస్తుందని ప్రచారం ప్రారంభించారు. ఎందుకంటే ఏర్పాట్లు చేయడానికిట. ఈ వందల కోట్ల ఆరోపణకు బేస్ ఉందా అంటే..ఏమీ ఉండదు.. అంకె బాగుందని ప్రచారం చేసేస్తున్నారు. ఈ మ్యాచ్ లో మెస్సితో పాటు రేవంత్ కూడా ఆడనున్నారు. ఈ మ్యాచ్ ద్వారా క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. అందుకే దానికి వంద కోట్లు లెక్క కట్టారు.
బీఆర్ఎస్ ఎలా.. సోషల్ మీడియా ధీయరీలతో టైంపాస్ చేస్తూనే ఉంది. రేవంత్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
