కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురయ్యాయి. ఈ కేసు విషయంలో కుల ప్రస్తావన రావడంతో ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన బాధితురాలు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయేనని, కుల పెద్దలు కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పెళ్లి చేస్తారో.. పంచాయితీ చేస్తారో మీ ఇష్టం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, పోక్సో వంటి తీవ్రమైన కేసులో పంచాయితీ, పెళ్లి పరిష్కారం అని చెప్పడం ఏమిటని విపక్షాలు, మహిళా సంఘాలు ప్రశ్నించాయి.
ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అవన్నీ పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేనివన్నారు. పొన్నం వ్యక్తిగతమని స్పష్టం చేశారు. దీంతో ఆయన తాజాగా వాటిపై వివరణ ఇచ్చారు. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన ఏకైక ఉద్దేశమని, తన మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
బాధితురాలు కూడా వెనుకబడిన తరగతులకు చెందిన బిడ్డ కాబట్టి, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే తాను ఆ మాటలు అన్నానని వివరించారు. బండి సంజయ్ తన కుమారుడిని వెనకేసుకు రావడం మానేసి, బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని హితవు పలికారు. ఆ అమ్మాయికి న్యాయం చేసే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు.. న్యాయం కోసమే మేము పోరాడుతాము అని పొన్నం చెప్పుకొచ్చారు. ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకోవడంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ వివరణ ద్వారా వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
