హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, తెల్లాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ఐటీ కారిడార్లలో నివాసముండటం ఇప్పుడు సగటు ఉద్యోగికి భారంగా మారుతోంది. 2026 మే నాటి గణాంకాల ప్రకారం, గచ్చిబౌలిలో ఒక మోస్తరు 3BHK ఫ్లాట్ అద్దె నెలకు రూ. 40,000 నుంచి రూ. 60,000 వరకు పలుకుతోంది. కొన్ని ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలలో ఇది రూ. 70,000 కూడా దాటుతోంది. గత రెండేళ్లలో అద్దెలు దాదాపు 24-30% మేర పెరిగాయి. సంపాదించిన జీతంలో సగానికి పైగా కేవలం అద్దెలకే వెచ్చించాల్సి రావడంతో, యువ ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్నారు.
ప్రస్తుత మార్కెట్ విశ్లేషణల ప్రకారం, అద్దెకు నెలకు రూ. 50,000 కట్టే కంటే, మరో రూ. 30,000 – రూ. 40,000 కలిపి నెలకు సుమారు రూ. 80,000 నుంచి రూ. 1 లక్ష వరకు ఈఎంఐ చెల్లించడం మేలని భావిస్తున్నారు రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేస్తే, అది దీర్ఘకాలంలో స్థిరమైన ఆస్తిగా మిగలడమే కాకుండా, ఏడాదికి 10-12% వరకు విలువ పెరిగే అవకాశం ఉంది. మనం కట్టే అద్దె వేరొకరి ఈఎంఐ అవుతోంది, దానికంటే మనమే సొంత ఇల్లు కొనుక్కోవడం తెలివైన పని అనే భావన ఇప్పుడు మధ్యతరగతి కొనుగోలుదారుల్లో బలంగా నాటుకుంది.
గచ్చిబౌలిలో ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, మధ్యతరగతి గృహ కొనుగోలుదారులు ఇప్పుడు తెల్లాపూర్, నల్లగండ్ల, కొల్లూరు , ఓఆర్ఆర్ సమీప ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఇంకా ధరలు అందుబాటులోనే ఉండటంతో ఫస్ట్-టైమ్ హోమ్ బయ్యర్స్ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెట్రో ఫేజ్-2 విస్తరణ వార్తలు కూడా ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను మరింత పెంచాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల హైబ్రిడ్ పని విధానం వల్ల ఆఫీసులకు కొంచెం దూరంగా ఉన్నా, మెరుగైన వసతులు ఉన్న గేటెడ్ కమ్యూనిటీలకే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు.
