ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇంధన పొదుపును ఒక సామాజిక ఉద్యమంగా మార్చే దిశగా స్వయంగా రంగంలోకి దిగారు. దేశ ప్రజలకు ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునివ్వడమే కాకుండా, తన సొంత కార్యాలయం నుంచే ఈ మార్పును ప్రారంభించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని తన అధికారిక కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను ఏకంగా సగానికి సగం తగ్గించుకున్నారు. భద్రతా పరమైన ప్రోటోకాల్స్‌కు ఇబ్బంది కలగకుండానే, అనవసరమైన వాహనాలను తొలగించి ఇంధన వృధాను అరికట్టవచ్చని ఆయన నిరూపిస్తున్నారు.
ప్రధాని బాటలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకోవడం ప్రారంభించారు. జాతీయ భద్రత , పరిపాలనలో వాహనాల అవసరం ఉన్నప్పటికీ, వీలైనంత వరకు తక్కువ వాహనాలతో ప్రయాణించడం ద్వారా భారీగా ఇంధనం ఆదా అవుతుందని మంత్రులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా తమ అధికారిక పర్యటనల్లో వాహనాల వాడకాన్ని నియంత్రించాలని, సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను లేదా తక్కువ ఇంధనం ఖర్చయ్యే విధానాలను అనుసరించాలని కేంద్రం నుంచి అంతర్గత ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం ఒక దేశవ్యాప్త ఇంధన పొదుపు ఉద్యమం గా మార్చాలని యోచిస్తోంది. కేవలం మంత్రులు, అధికారులకే పరిమితం కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ రంగాలు , సామాన్య ప్రజలు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారు. ఇంధన దిగుమతులపై దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ మార్పిడి ద్రవ్యాన్ని ఆదా చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని కేంద్రం ప్రచారం చేస్తోంది.
రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకుని ఈ ఉద్యమంలో చేరాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో చూపిస్తున్న ఈ విధానం దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంపై కొత్త అవగాహనను కలిగిస్తోంది
