తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. బుధవారం జరిగిన బలపరీక్షలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 144 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118 కాగా, విజయ్‌కు ఆశించిన దానికంటే ఎక్కువ మద్దతు లభించింది.
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం కి కాంగ్రెస్ , విసికె , సిపిఐ, సిపిఐ(ఎం), ఐయుఎంఎల్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. వీటితో పాటు ఏఎంఎంకే నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ బలపరీక్షలో ప్రధాన మలుపు ఏఐఏడీఎంకేలో వచ్చిన చీలిక. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి విప్ జారీ చేసినప్పటికీ, సీనియర్ నేతలు ఎస్.పి. వేలుమణి , సి.వి. షణ్ముగం నేతృత్వంలోని సుమారు 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారు. ఇది విజయ్ విజయాన్ని సునాయాసం చేసింది.
ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సభ్యులు అసెంబ్లీలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఓటింగ్‌కు ముందే డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. మెజార్టీ ప్రజలు టీవీకేను వ్యతిరేకించారని ఉదయనిధి లెక్కలు చెప్పారు. హార్స్ ట్రేడింగ్ కు పాల్పడుతున్నారని .. అవినీతి పరుల మద్దతు తీసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ ఈ ఓటింగ్‌లో తటస్థంగా ఉండగా, పీఎంకే ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలిక వర్గం కాకుండా పళనిస్వామి వెనుక ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు.
ఓటింగ్ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వం సెక్యులర్ మార్గంలో నడుస్తుందని స్పష్టం చేశారు. హార్స్ ట్రేడింగ్‌కు తావు లేకుండా, ప్రజల సంక్షేమం కోసం గుర్రం వేగంతో పని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విజయంతో విజయ్ ప్రభుత్వం రాజకీయంగా స్థిరపడటమే కాకుండా, రాబోయే ఐదేళ్ల పాలనకు బలమైన పునాది వేసుకుంది.బలపరీక్ష ముగిసిన అనంతరం స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా వేశారు.