కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన కేసును రాజకీయ రంగు పులిమేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, నల్లగండ్ల వంటి కీలక ప్రాంతాల్లో భగీరథ్ అదృశ్యం అంటూ వెలసిన పోస్టర్లు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక నేరాన్ని నేరంగా చూడకుండా, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే కొంత మంది తాపత్రయం చివరకు అసలు బాధితురాలికి అన్యాయం చేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భగీరథ్‌కు పోలీసుల నోటీసులు
పోలీసులు ఇప్పటికే భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరుకాబోతుండటం వంటి పరిణామాలు జరుగుతుండగానే, పరారీ లో ఉన్నారంటూ పోస్టర్లు వేయడం వెనుక ఉన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడిపై ఉన్న అభియోగాలను చట్టపరంగా విచారించాల్సింది పోయి, ఇలాంటి డిజిటల్, క్షేత్రస్థాయి రాజకీయ ప్రచారాల ద్వారా ఒక బలమైన వర్గాన్ని ప్రభావితం చేయాలని చూస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్న సమయంలో, ఇలాంటి హడావిడి చేయడం వల్ల విచారణ ప్రక్రియకు అడ్డంకులు కలిగే ప్రమాదం ఉంది.
చట్టపరమైన విచారణ ప్రక్రియను ఇలా దుర్వినియోగం చేస్తారా?
ఈ కేసులో భగీరథ్ తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించిన అంశాలు కూడా రాజకీయం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తున్నాయి. బాధితురాలి వయస్సుపై గతంలో ఉన్న రికార్డులను, ర్యాష్ డ్రైవింగ్ కేసు ఛార్జీషీట్లను చూపిస్తూ ఆమె మేజర్ అని వాదిస్తున్నారు. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్న అంశాలైనప్పటికీ, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసును రాజకీయం చేయాలని చూడటం ఈ పోస్టర్లు వేస్తున్న వారి వ్యూహాత్మక తప్పిదంగా కనిపిస్తోంది.
కుటుంబాలను టార్గెట్ చేసుకోవడం ఎందుకు?
రాజకీయం అంటే ప్రజా సమస్యలపై పోరాడటం కావాలి కానీ, ఒకరి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు వేయడం సంస్కారం కాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తీరు వల్ల నేరం పక్కదారి పట్టడమే కాకుండా, బాధితురాలి ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. నేర విచారణను రాజకీయ క్రీడగా మార్చడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు.
ఈ పోస్టర్లు వేసిన వాళ్లు ఎవరో.. తమ పేర్లు దానిపై రాసుకోలేదు. కానీ గతంలో ప్రధాని మోదీతో పాటు ఇతర సందర్భాల్లో పోస్టర్లు వేసిన రాజకీయ పార్టీల వ్యూహకర్తల ఐడియానే అది కూడా అయి ఉంటుందని అనుకుంటున్నారు.