పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా రెండేళ్ల పాటు కొత్త నిర్మాణాలను నిలిపివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందంటూ సాగిన ప్రచారం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ వార్తను సాకుగా చూపుతూ అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఆగిపోతుందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. అయితే, తాము అటువంటి సూచనలు ఏవీ చేయలేదని నీతి ఆయోగ్ అధికారికంగా స్పష్టం చేయడంతో ఈ దుష్ప్రచారానికి తెరపడింది. ఉ
అంతర్జాతీయ నిధుల రక్షణ
ఒకవేళ భవిష్యత్తులో దేశీయంగా నిర్మాణ రంగంపై ఏవైనా ఆంక్షలు వచ్చినా, అమరావతి ప్రాజెక్టుకు వచ్చే నష్టం ఏమీ లేదు. నిర్మాణాలు ఆగిపోవు కూడా. ఎందుకంటే అమరావతి ప్రభుత్వ నిధులపైనే ఆధారపడటం లేదు. ఇది ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అందుతున్న రూ. 15,000 కోట్ల భారీ రుణ సాయంతో సాగుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం సాగే ఇలాంటి ప్రాజెక్టులకు నిధుల విడుదల , నిర్మాణ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగదు. అమరావతి ఆగిపోవాలని కోరుకున్న వారికి ఈ వాస్తవం మింగుడుపడటం లేదు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ
అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ నమూనా. రాజధాని ప్రాంతంలో ఉన్న ల్యాండ్ పూలింగ్ భూములను అభివృద్ధి చేయడం ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ నగరం తనను తాను నిర్మించుకునే శక్తిని కలిగి ఉంది. ప్రభుత్వం చేసే వ్యయం కంటే, భవిష్యత్తులో ఈ భూముల విక్రయం , పారిశ్రామికాభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అమరావతి వైపు ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, ఇలాంటి తప్పుడు ప్రచారాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీయలేవు.
అసూయతో కూడిన రాజకీయం
రాజధాని నిర్మాణం ఆగిపోతుందని సంబరపడే వారు ఒకటి గుర్తుంచుకోవాలి.. అమరావతి అనేది కేవలం ఇటుకలు, సిమెంట్ కట్టడం కాదు, అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. ప్రజల ఆశలు, రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతున్న ఈ నగరాన్ని చిన్న చిన్న పుకార్లతో ఆపలేరు. అమరావతి అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని వారు చేస్తున్న ఇటువంటి రాజకీయాలు చివరికి ప్రజల్లో వారి పట్ల అసహ్యాన్నే పెంచుతాయి. ఈ విషయాన్ని సొంత రాష్ట్ర రాజధానిపై విషం చిమ్ముతున్న పార్టీలు గుర్తించలేకపోతున్నాయి.
