సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి పేరు ఇకపై కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా, అంతర్జాతీయ రక్షణ రంగ హబ్‌గా కూడా మారుమోగనుంది. మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?” అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్.. భారత రక్షణ రంగ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవబోతున్న AMCA ప్రాజెక్టుకు సంకేతం. దేశీయంగా అభివృద్ధి చేసిన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, ఇంటిగ్రేషన్ ,ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ పుట్టపర్తిలో ఏర్పాటు కాబోతోంది. సుమారు లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు మే 15న శంకుస్థాపన జరగనుంది.
చంద్రబాబు – రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో శంకుస్థాపన
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దీని కోసం పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో సుమారు 350 నుంచి 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాకుండా, యుద్ధ విమానాల పరీక్షల కోసం రన్‌వేను 10,000 అడుగులకు విస్తరించడం, ఏటీసీ టవర్ల నిర్మాణం వంటి పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా జరగనున్నాయి.
రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే పారిశ్రామిక విప్లవం
గతంలో కియా మోటార్స్‌తో అనంతపురం జిల్లా పారిశ్రామికంగా ఎదిగితే, ఇప్పుడు పుట్టపర్తిలో రాబోతున్న ఈ రక్షణ రంగ ప్రాజెక్టు రాయలసీమ రూపురేఖలనే మార్చనుంది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కేవలం యుద్ధ విమానాలే కాకుండా, భవిష్యత్తులో అన్ మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ డ్రోన్లు తయారీకి కూడా ఇది కేంద్రం కానుంది. లోకేష్ తన ట్వీట్లో జత చేసిన స్టెల్త్ ఫైటర్ జెట్ వీడియో చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ పట్టుదల స్పష్టమవుతోంది.
స్పీడ్ పాలిటిక్స్‌తో లోకేష్ బ్రాండింగ్
రాష్ట్రంలోకి గూగుల్ డేటా సెంటర్లు, రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్లు వస్తున్న వేళ.. ఇప్పుడు యుద్ధ విమానాల ఫ్యాక్టరీ ని తీసుకురావడం ద్వారా కూటమి ప్రభుత్వం తన డెవలప్మెంట్ గ్రాఫ్‌ను అమాంతం పెంచుకుంది. మే 15న పుట్టపర్తిలో జరగబోయే ఈ శంకుస్థాపన కేవలం ఒక భవన నిర్మాణానికి పునాది కాదు, అది నవ్యాంధ్ర పారిశ్రామిక ఆకాంక్షలకు టేకాఫ్ . పుట్టపర్తి గగనతలం నుంచి యుద్ధ విమానాల గర్జన వినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టుతో ఏపీ గ్లోబల్ డిఫెన్స్ మ్యాప్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకోబోతోంది.
