తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయంపై వెనక్కి తగ్గారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను పూర్తి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మంగళవారం జరిగిన ఈ నియామకం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపింది. ముఖ్యంగా హేతువాద భావజాలం బలంగా ఉన్న తమిళ రాజకీయాల్లో, ఒక ముఖ్యమంత్రి తన వ్యక్తిగత విశ్వాసాలకు అనుగుణంగా జ్యోతిష్యుడిని ప్రభుత్వ పదవిలో నియమించడంపై ప్రతిపక్షాలు , మిత్రపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ప్రజా ధనంతో జ్యోతిష్యులకు అధికారిక పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో 144 ఓట్లతో విజయం సాధించిన వెంటనే, సీఎం విజయ్ ఈ దిద్దుబాటు చర్య చేపట్టారు. గతంలో జయలలిత వంటి నేతలకు కూడా సలహాదారుగా పనిచేసిన రాధన్ పండిట్, ప్రస్తుతం టీవీకే పార్టీ అధికార ప్రతినిధిగానూ కొనసాగుతున్నారు. అయితే, ప్రభుత్వ కార్యకలాపాల్లో జ్యోతిష్యుడి జోక్యం ఉండకూడదన్న విమర్శలతో , ఆయన నియామక ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ రీటా హరీష్ థక్కర్ సంతకంతో కొత్త ఆదేశాలు వెలువడ్డాయి.
విజయ్ తన పాలన ఆరంభంలోనే ఎదురైన ఈ వ్యతిరేకతను గమనించి త్వరగా స్పందించారని అభిప్రాయపడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలకు , ప్రభుత్వ లౌకిక స్వభావానికి విఘాతం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఈ తాజా రద్దు ఉత్తర్వుతో ప్రస్తుతానికి ఆ వివాదానికి తెరపడినట్లయింది.
