కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ పోక్సో కేసు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కావాలని పేట్ బషీర్బాగ్ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన విచారణకు హాజరు కాలేదు. నిర్ణీత సమయానికి భగీరథ్ రాకపోవడంతో పోలీసులు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. విచారణకు సహకరించని పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు భగీరథ్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ తర్వాత పోలీసులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బండి భగీరథ్ అరెస్టును ఆపడం ఎవరి వల్లా కాదని, చట్టం తన పని తాను చేసుకు పోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెబుతున్నారు. ఈ కేసు నుంచి నిందితుడిని తప్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు వదిలేది లేదని ఆయన చెబుతున్నారు.
మరో వైపు బాధితురాలి వయస్సుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాధితురాలికి సంబంధించి రెండు వేర్వేరు పుట్టిన తేదీలు ఉన్న సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చాయని, ఆమె అసలు మైనర్ కాదంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. పోలీసులు కూడా ఈ సర్టిఫికెట్ల ప్రామాణికతను, బాధితురాలి అసలు వయస్సును నిర్ధారించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ను రెండోసారి రికార్డ్ చేసిన పోలీసులు, కేసులో మరిన్ని కఠినమైన సెక్షన్లను చేర్చారు.
