ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటనకు పెట్టింది పేరు. కానీ, ఆయనకు రాజకీయం అనే దోమ చాలా కాలం కిందటే కుట్టింది. కానీ దాని వల్ల ఆయనను నమ్మిన వారంతా నట్టేట మునిగిపోతున్నారు. రాజకీయాల్లో ఐరెన్ లెగ్ అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. కానీ, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విషయంలో అది మరో స్థాయికి చేరిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో స్వయంగా బరిలోకి దిగిన ఆయనకు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే రావడం, కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం ఒక ఎత్తు. అయితే, ఆయన ప్రచారం చేసిన మిగతా వారు కూడా అదే బాటలో నడుస్తున్నారు.
ప్రకాష్ రాజ్ సపోర్టు చేసిన పార్టీలన్నీ ఔట్
2019లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేస్తే, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు గల్లంతయ్యాయి. అప్పట్లో కన్హయ్య కుమార్ కోసం గొంతు చించుకున్నా, ఫలితం మాత్రం సున్నా గానే మిగిలింది. ఈ అరిష్టం కేవలం ఉత్తరాదికో, గతానికో పరిమితం కాలేదు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్ తరఫున ప్రకాష్ రాజ్ ప్రచారం నిర్వహించారు. ఫలితం ఏమైందంటే.. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఎడమపక్షాలు అత్యంత దారుణమైన ఓటమిని చవిచూశాయి. ఇక తమిళనాడు విషయానికి వస్తే, స్టాలిన్ కు మద్దతుగా నిలిచిన ఆయనకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. స్వయంగా స్టాలిన్ తన సొంత సీటును కోల్పోవడమే కాకుండా, పార్టీ మొత్తం ఎన్నికల్లో ఓటమి పాలుకావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్ ముద్ర:
ప్రకాష్ రాజ్ తెలుగు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో వేలు పెట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు, ఏపీలో వైసీపీ కి ఆయన గట్టి సపోర్టర్ గా నిలిచారు. చిత్రమేమిటంటే.. ఆయన ఏ పార్టీని భుజాన వేసుకున్నారో, ఆ పార్టీలు ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి విపక్ష వరుసలో కూర్చున్నాయి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన వేసే ప్రశ్నలు ప్రత్యర్థుల కంటే, ఆయన మద్దతు ఇచ్చే పార్టీలకే ఎక్కువ నష్టం చేకూరుస్తున్నాయా? అనే సందేహం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో విన్పిస్తోంది.
అడిగే ముందే ఆలోచించుకోవాలేమో!
నటనలో నవరసాలు పండించే ప్రకాష్ రాజ్, రాజకీయాల్లో మాత్రం కేవలం ఓటమిని మాత్రమే మిగిలిస్తున్నారనేది ప్రత్యర్థుల మాట. ఆయన ప్రచారానికి వస్తున్నారంటేనే ఇప్పుడు అభ్యర్థులు వణికిపోయే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా పార్టీ ఆయనను ప్రచారానికి పిలిచే ముందు.. ఆయన ట్రాక్ రికార్డును ఒకసారి చూసుకుంటే మంచిదేమోనని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. నేటి రాజకీయాల్లో ఆయన ఒక ఐరన్ లెగ్గా మారిపోయారు.


