పరిశ్రమలో ఎగ్జిబీటర్లు, నిర్మాతల మధ్య వ్యవహారం ముదురుతున్నట్టే కనిపిస్తోంది. ఇష్యూ ఎక్కడో మొదలై.. ఇంకెక్కడికో వెళ్తుందేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఎగ్జిబీటర్లు ఓ ప్రెస్ మీట్ పెట్టి, తమ సాధక బాధకాలు చెప్పుకొన్నారు. 24 గంటల్లోపే.. నిర్మాతలు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఎగ్జిబీటర్లకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఈ ప్రహసనంలో మేటర్.. ఏసియన్ సునీల్ వైపు వెళ్లింది. ఆయన్ని అటు నాగవంశీ, ఇటు మైత్రీ రవి సెటైర్లతో ముంచెత్తారు. ‘మల్టీప్లెక్సులు ఉన్న బడా ఎగ్జిబీటర్ సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే జోక్‌గా అనిపిస్తోంది’ అంటూ నాగవంశీ సెటైర్ వేశారు. ‘ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్సులు కట్టేస్తున్నారు సేటు గారు’ అంటూ మైత్రీ రవి కూడా సునీల్ ని టార్గెట్ చేశారు.
ఇప్పుడు సునీల్ వంతు వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగవంశీపై సెటైర్లు వేశారు. ”అతని పేరేంటి? కళ్లజోడు వేసుకొని..డూప్లికేట్ జుత్తు పెట్టుకొని పాము.. సారీ నాగవంశీ…” అంటూ హిందీలో నాగవంశీని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. తన దగ్గర సింగిల్ స్క్రీన్లు కూడా చాలా ఉన్నాయని, మల్టీప్లెక్సులు లాభాల్లో నడవడం లేదని, బ్రేక్ ఈవెన్ వస్తున్నాయంటూ ఓ లిస్టు చూపించారు.
ఎవరైనా సరే, సమస్య వచ్చినప్పుడు పిన్ టూ పిన్… పాయింట్ టూ పా యింట్ మాట్లాడాలి? ఇలా బాడీ షేమింగ్ చేయడం ఏమిటి? నిర్మాతల మధ్య ఉండాల్సిన సఖ్యత ఇదేనా? ఇలా మాట్లాడుకొంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయా? టోటల్ గా వ్యవహారం చూస్తుంటే… ఎగ్జిబీటర్లు, ప్రొడ్యూసర్లూ అసలు సమస్యని వదిలేసి ఈగోల వరకూ వెళ్లే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూశాక నాగవంశీ కామ్ గా ఉంటారా? ఆయన అసలే స్పీడు. మైకు పట్టుకొంటే ఆయన ఇంకా పంచ్‌లు వేయగలరు. ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉంది. మొత్తానికి పర్సంటేజీ, రెంటల్ గొడవ కాస్తా.. ఇగోల సమస్యగా మారే ప్రమాదాలు ఉన్నాయి. ఇది చిత్రసీమకు మంచిది కాదు.