నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధుల కల నెరవేరుతోంది. గత కొంతకాలంగా వివిధ దశల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల నిర్మాణం ఎట్టకేలకు పూర్తి కావడంతో, రాజధాని ప్రాంతంలో సందడి నెలకొంది. అత్యాధునిక హంగులతో నిర్మించిన 12 అపార్ట్మెంట్ టవర్లు ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రతి టవర్ అపార్ట్మెంట్లో ప్రజాప్రతినిధులకు కావాల్సిన అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పించింది.
వారం రోజుల్లోనే ఈ నివాస సముదాయాలను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కు అధికారికంగా అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భవనాల అప్పగింత ప్రక్రియ ముగియగానే, ఆయా నివాసాల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెరిగిన తరుణంలో ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కీలకమైన ప్రజాప్రతినిధుల నివాసాలు పూర్తి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నివాసాలు అందుబాటులోకి వస్తే, పాలనాపరమైన కార్యకలాపాలకు కూడా మరింత వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే విద్యుత్, మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఒకవైపు ప్రధాన రహదారులు, లేఅవుట్ల అభివృద్ధికి ప్రభుత్వం గడువులను నిర్దేశించుకున్న నేపథ్యంలో, ఈ అపార్ట్మెంట్ల పూర్తి రాజధాని నగరానికి ఒక కొత్త కళను తీసుకువచ్చింది. త్వరలోనే ప్రజాప్రతినిధులు తమ కొత్త నివాసాల్లోకి ప్రవేశించనుండటంతో అమరావతిలో రాజకీయ సందడి మరింత పెరగనుంది.
