మూలిగే నక్కపై తాటి పండు పడినట్టు అయ్యింది సూర్య సినిమా పరిస్థితి. అసలే సూర్య ఫ్లాపులు, డిజాస్టర్లు మూటగట్టుకొన్నాడు. తన ఆశలన్నీ ‘వీరభద్రుడు’ (తమిళంలో కురుప్పు) సినిమాపై ఉన్నాయి. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సివుంది. తమిళనాట స్పెషల్ షోలకు పర్మిషన్లు తెచ్చుకొన్నారు. కానీ అనూహ్యంగా విడుదల ఆలస్యమైంది. మార్నింగ్ షోలు రద్దు చేశారు. బుక్ మై షోలో మార్నింగ్ షో బుకింగులు కూడా జరిగాయి. ఆ టికెట్ డబ్బులు ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నారు. మధ్యాహ్నం అయినా షో పడుతుందా, లేదా? అనేది అనుమానమే. అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమాని రిలీజ్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
డ్రీమ్ వారియర్ సినిమాకు సంబంధించి గత సినిమాల అప్పులు ‘వీరభద్రుడు’ ని వెంటాడుతున్నాయి. దాదాపు రూ.20 నుంచి రూ.40 కోట్ల క్లియరెన్స్ రావాల్సివుంది. అందుకే.. ‘వీరభద్రుడు’ ని ఆపేశారు. ఇప్పుడు ఆ క్లియరెన్స్ కి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. అన్నీ తేలితే ఈ రోజు ‘వీరభద్రుడు’ ని చూడొచ్చు. లేదంటే.. ఈ రోజు విడుదల లేనట్టే.
ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. త్రిష కథానాయిక. దాదాపు రూ.120 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ పట్ల చిత్రబృందం సంతోషంగానే ఉంది. దాదాపు రూ.80 కోట్ల వరకూ రిటర్న్స్ వచ్చాయని టాక్. మిగిలిన సొమ్ము థియేటర్ల నుంచి రావాలి.
